నల్ల ద్రాక్షని పులియబెట్టి చేసే ఒక పానీయం రెడ్ వైన్. ఇది తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చాలా మంది అంటుంటారు. గుండెకి మేలు చేస్తుందని, బరువు తగ్గించడంలో సహాయపడుతుందని చెప్తారు. వైన్ తాగడం వల్ల స్ట్రోక్ వచ్చే ప్రమాదం తగ్గుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఆరోగ్యానికి మంచిది కదా అని అతిగా రెడ్ వైన్ తాగడం వల్ల దాని ప్రయోజనాలు పొందకపోగా ఇతర అనారోగ్య సమస్యలని ఎదుర్కోవాల్సి వస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వాస్తవానికి ఆల్కహాల్ అధిక వినియోగం వల్ల స్ట్రోక్ ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతుందని నిపుణులు సూచిస్తున్నారు. నెలల్లో ఎటువంటి సమయంలోనైనా ఐదు కంటే ఎక్కువ పానీయాలు తాగడం వల్ల స్ట్రోక్ కి దగ్గరగా వెళ్తున్నట్టే అని హెచ్చరిస్తున్నారు. రెడ్ వైన్ పూర్తి స్థాయి ఆల్కహాల్ కాదు. ఇందులో 12-15 శాతం ఆల్కహాల్ కంటెంట్ ఉంటుంది. ఈ వైన్ అతిగా తాగడం వల్ల ఆరోగ్యం క్షీణించే ప్రమాదం ఉందని అంటున్నారు. కానీ మితంగా దీన్ని తీసుకుంటే స్ట్రోక్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుందని చెబుతున్నారు.
మెదడుపై ఎలా ప్రభావం చూపిస్తుంది?
స్ట్రోక్ ప్రమాదాల విషయంలో వైన్ రక్షణాత్మకంగా ప్రభావాన్ని చూపిస్తుందని కోపెన్ హగన్ సిరి హార్ట్ స్టడీలో ప్రచురించిన ఒక అధ్యయనంలో వెల్లడించింది. వైన్ లో ఫ్లేవనాయిడ్స్ , టానిన్ లు ఉన్నాయి. ఇవి స్ట్రోక్ ప్రమాదాన్ని అడ్డుకోగలవు. అయితే వైన్ తీసుకునే సమయం కూడా ముఖ్యమే. రెడ్ వైన్ లోని రసాయనాలు మంట, ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతాయి. ఇందులోని కొన్ని లక్షణాలు వ్యాధులు రాకుండా, నరాలు దెబ్బతినకుండా మెదడుని రక్షిస్తుంది. ఎర్ర ద్రాక్ష తొక్కలు, విత్తనాల్లో కనిపించే సమ్మేళనం రెస్వెరాట్రాల్ హెమే ఆక్సిజనేజ్ స్థాయిలను పెంచుతుందని పరిశోధనలో తేలింది. ఇది మెదడులోని నరాల కణాలని దెబ్బతినకుండా కాపాడుతుంది. స్ట్రోక్ వచ్చినప్పుడు ఎంజైమ్ స్థాయిలు పెరగడం వల్ల మెదడు తనను తాను రక్షించుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. రెస్వెరాట్రాల్ ఇస్కీమిక్ స్ట్రోక్ మెదడు నిరోధకతను సమర్ధవంతంగా నిర్మించగలదని అధ్యయనంలో నిరూపించబడింది.
ఇతర ఆరోగ్య ప్రయోజనాలు
వైన్ సాధారణంగా భోజనంతో పాటు వేయించిన ఆహారాలతో కలిపి తీసుకుంటారు. వైన్ వినియోగం వల్ల స్ట్రోక్ ని నిరోధించడంలో సహాయపడుతుందని వివిధ అధ్యయనాల్లో తేలింది. శరీరంలోని మంచి కొలెస్ట్రాల్ పెంచి, రక్తం గడ్డకట్టడాన్ని తగ్గిస్తుంది. రక్తనాళాలో ఉండే కణాల పొరను మెరుగుపరుస్తుంది. రెడ్ వైన్లోని పోషకాలు రక్తం గడ్డకట్టడాన్ని నిరోధిస్తాయి. ధమనులలో కొవ్వు పేరుకుపోకుండా కాపాడతాయి. వీటిలో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
అతిగా తాగకూడదు
అధిక ఆల్కహాల్ తాగడం అనేది స్ట్రోక్ వచ్చే అవకాశాన్నిపెంచుతుంది. ఊబకాయం, అధిక రక్తపోటుతో పాటు అవయవాలని దెబ్బతీస్తుంది. ఇతర ఆరోగ్య సమస్యలు, మందులు తీసుకుంటున్నట్లయితే వైన్ అసలు తాగకూడదు. వైన్ తాగడం వల్ల ప్రయోజనాలు ఉన్నప్పటికీ స్ట్రోక్ సమస్య ఉన్నవాళ్ళు వైద్యులని సంప్రదించకుండా తాగకూడదు.
రోజుకి ఎంత మోతాదు: అధ్యయనాల ప్రకారం మహిళలు రోజుకి 150 ఎమ్ఎల్ రెడ్ వైన్ తాగొచ్చు. మగవారైతే 300 ఎమ్ఎల్ అంటే రెండు గ్లాసుల రెడ్ వైన్ తాగవచ్చు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: నెలసరి నొప్పులు వేధిస్తున్నాయా? ఈ ఆహార పదార్థాలతో చెక్ పెట్టొచ్చు