Vijayawada News : ఇంద్రకీలాద్రిపై మరోసారి అవకతవకలు వెలుగులోకి వచ్చాయి. సిబ్బంది ఎవరి స్థాయిలో వారు అందినకాడికి అమ్మవారి సొమ్ము ఆరగించేస్తున్నారు. భక్తుల ఎంతో భక్తితో అమ్మవారికి సమర్పించిన చీరలు పక్కదారి పడుతున్నాయి. తాజాగా 2019-2022 సంవత్సరంలో అమ్మవారికి భక్తులు సమర్పించిన 77 పట్టు చీరలకు సంబంధించిన రికార్డుల్లో లెక్కలు సరిగా లేకపోవడం సంచలనంగా మారింది. అప్పట్లో ఆ విభాగంలో పనిచేసిన జూనియర్ అసిస్టెంట్ సుబ్రహ్మణ్యాన్ని ఈవో డి.భ్రమరాంబ సస్పెండ్ చేశారు.
గతంలోనూ సస్పెండ్
దుర్గమ్మకు భక్తులు సమర్పించిన పట్టు చీరల లెక్కలను జూనియర్ అసిస్టెంట్ సుబ్రహ్మణ్యం రికార్డుల్లో చూపించలేదని తెలుస్తోంది. 2019-2020లో 77 చీరలకు సంబంధించిన రికార్డులు సక్రమంగా లేవని ఆడిట్ అధికారులు గుర్తించి ఈవోకి విషయం తెలియజేశారు. దీంతో ఈవో జూనియర్ అసిస్టెంట్ పై వేటు చేశారు. సూపరింటెండెంట్ నివేదిక ప్రకారం చర్యలు తీసుకున్నట్లు ఆమె మీడియాకు తెలిపారు. నెల రోజుల ముందే సుబ్రహ్మణ్యానికి మౌఖికంగా ఆదేశాలు ఇచ్చినా ఇండెంట్లు సమర్పించలేదని ఈవో తెలిపారు. ఇదిలా ఉండగా గతంలో కూడా సుబ్రహ్మణ్యం ఆరు నెలల పాటు సస్పెన్షన్ కు గురయ్యాడు.
మళ్లీ పోస్టింగ్ ఎలా?
గతంలో సస్పెన్షన్ కు గురైన సుబ్రహ్మణ్యానికి తిరిగి పోస్టింగ్ ఇచ్చేశారు. ఇదేలా జరిగిందన్న అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అధికారుల ప్రమేయం లేకుండానే తిరిగి పోస్టింగ్ రావటం సాధ్యం కాదన్న వాదన ఉంది. అవినీతి, అవకతవకలు జరిగాయని తెలిసి సదరు ఉద్యోగిపై సస్పెన్షన్ వేటు వేసిన తరువాత మరలా ఉద్యోగం ఇప్పించటం అంటే ఆషామాషీ వ్యవహరం కాదు. దీంతో ఈ వ్యవహరంలో సుబ్రహ్మణ్యం పాత్ర మాత్రమే లేదనే విషయం తెలుస్తుంది. సుబ్రహ్మణ్యంతో పాటుగా మిగిలిన వారి పాత్ర ఏంటనే విషయంలో మాత్రం ఎవ్వరూ నోరు మెదపటం లేదు. ఆడిట్ అధికారుల లెక్కలతో అసలు వ్యవహరం వెలుగులోకి వచ్చింది కాబట్టి, ఎవరినో ఒకరిని బూచిగా చూపించి చేతులు దులుపుకునే క్రమంలో మరలా సుబ్రహ్మణ్యం పైనే వేటు పడిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఉద్యోగుల పాత్రపై
ఈ పరిణామాలు ఇంకా ఎటు వైపు దారి తీస్తుందనేది ప్రస్తుతానికి చర్చనీయాంశంగా మారింది. మిగిలిన ఉద్యోగుల పాత్ర ఏమిటి. అధికారుల సహకారం మాటేమిటి అనే విషయాలపై కూడా ఉన్నతాధికారులు వెలికి తీయాల్సి ఉందనే డిమాండ్లు ఉద్యోగుల నుండే వ్యక్తం అవుతున్నాయి. భక్తులు అమ్మవారిపై నమ్మకంతో చీరలు సమర్పించటం ఆనవాయితీగా వస్తుంది. మొక్కులు తీర్చుకునే క్రమంలో పెద్దముత్తయుదువుగా అమ్మవారిని భావించి తమ ఆర్థిక స్థోమతను బట్టి చీరలను సమర్పిస్తారు. అలా వచ్చిన చీరలను దేవస్థానం సిబ్బంది సేకరించి, తిరిగి వేలం వేయటం ద్వారా ఆదాయం సమకూర్చుకుంటారు. దీని వలన రూ.కోట్ల ఆదాయం వస్తుంది. గతంలో చీరలను పోగు చేసుకునే కాంట్రాక్ట్ ను టెండర్ల ద్వారా ఇచ్చేవారు. ఇప్పుడు సిబ్బందే నిర్వహిస్తుండటంతో అవినీతి ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.
Also Read : Train To Puri: పూరీ జగన్నాథ యాత్రకు వెళ్లాలనుకునే వారికి అందుబాటులో ఉన్న ట్రైన్స్ ఇవే