Praja Vedika Demolition : టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. చంద్రబాబు ఇంటి వద్ద ఉన్న ప్రజావేదిక కూల్చిన ప్రదేశానికి వెళ్లేందుకు టీడీపీ కార్యకర్తలు, నాయకులు ప్రయత్నించారు.  వీరిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో టీడీపీ కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. టీడీపీ నాయకులను అడ్డుకున్న పోలీసులు వారిని అరెస్టు చేశారు. మూడు ఏడేళ్ల క్రితం జూన్25న వైసీపీ ప్రభుత్వం ప్రజా వేదికను అక్రమ కట్టడంగా పేర్కొంటూ కూల్చివేయించింది. దీనిపై అప్పట్లో టీడీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజావేదిక కూల్చివేతకు నిరసనగా టీడీపీ శ్రేణులు ఉండవల్లికి వస్తారన్న సమాచారంతో పోలీసులను భారీగా మోహరించారు. ప్రజావేదిక వద్దకు కృష్ణా, గుంటూరు జిల్లాల టీడీపీ నేతలు, తెలుగు యువత నాయకులు రావడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది.


ప్రజావేదిక కూల్చివేత 


అధికారిక కార్యకలాపాలు, కలెక్టర్ల సమావేశాల కోసం గత ప్రభుత్వం ప్రజావేదికను ఏర్పాటు చేసింది. గుంటూరు జిల్లా ఉండవల్లి కరకట్టపై ప్రజావేదికను టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించారు. చంద్రబాబు ఇంటి పక్కనే అధికారిక కార్యకలాపాలు, కలెక్టర్ల సమావేశాల కోసం దీనిని ఏర్పాటుచేశారు. ఈ ప్రజావేదికలో సీఎం జగన్ చివరిగా కలెక్టర్ల సమావేశం నిర్వహిం అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి నిర్మాణాలు పుట్టుకొస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ మీటింద్ అనంతరం ప్రజావేదిక కూల్చివేతకు ఆదేశాలు ఇచ్చారు.  దీంతో అధికారులు అదే రోజు రాత్రి ప్రజావేదిక కూల్చివేత పనులు చేపట్టారు. అప్పటి నుంచి ఏటా ఇదే రోజు టీడీపీ శ్రేణులు ప్రజావేదిక కూల్చివేసిన ప్రాంతంలోని శిథిలాల వద్ద నిరసన తెలుపుతున్నారు. ఈ ఏడాది కూడా టీడీపీ శ్రేణులు నిరసన తెలిపేందుకు రావడంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. 


చంద్రబాబు నివాసానికి మార్గాలు మూసివేత 


చంద్రబాబు నివాసానికి వెళ్లే మూడు మార్గాలను బారికేడ్లు, ముళ్లకంచెలతో మూసివేసి భారీగా పోలీసులను మోహరించారు. కొండవీటి వాగువైపు, ఉండవల్లి గుహల వైపు, సచివాలయం నుంచి విజయవాడ వైపు వచ్చే మూడు దారులను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ముళ్లకంచెల, బారికేడ్లతో ఆ మార్గాలను దిగ్బంధించారు. సామాన్య ప్రజలు సైతం ఇటువైపు వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు.