ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానులపై కేంద్రమంత్రి రాందాస్ అథవాలే(Ramdas Athawale) కీలక వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానులు(Three Capitals) సరికాదని భావిస్తున్నామన్నారు. ప్రస్తుతం ఏపీలో ఒక్క రాజధాని కూడా అభివృద్ధి కాలేదన్నారు. మూడు రాజధానులు పెడితే ఎక్కడకు రావాలన్నారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడం మంచిదే కానీ.. దేనికైనా నిధులు ముఖ్యమన్నారు. విభజన సమయంలోనే రాజధానికి నిధులు ఇవ్వాల్సిందని అథవాలే అన్నారు. నిధులు లేకే అమరావతి(Amaravati) అభివృద్ధి జరగలేదన్నారు. మూడు రాజధానుల కంటే అమరావతిని అభివృద్ధి చేయడమే మేలన్నారు. విజయవాడ పర్యటనకు వచ్చిన ఆయన రాష్ట్ర విభజన సమయంలోనే ఏపీ రాజధాని(AP Capital) అభివృద్ధి కోసం నిధులు కేటాయించాల్సిందన్నారు. యూపీఏ ప్రభుత్వం(UPA Government) ఈ అంశాలను విస్మరించిందన్నారు. ప్రధాని మోదీ(PM Modi) నాయకత్వంలోని కేంద్రం నిధులు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తోందన్నారు. 


సీఎం జగన్ పాలన గుడ్


కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే వైసీపీ, బీజేపీతో పొత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ అభివృద్ధి కోసం బీజేపీతో చేతులు కలపాలని సీఎం కేసీఆర్ ను మరోసారి సూచించారు. ఏపీకి ప్రత్యేక హోదా(AP Special Category Status) కోసం సీఎం జగన్ ప్రధాని మోదీని కలిసి వివరించాలని కేంద్ర మంత్రి అథవాలే సూచించారు. కేంద్రం తీసుకోస్తున్న బిల్లులకు వైసీపీ పార్లమెంట్‌లో మద్దతు ఇస్తోందన్నారు. సీఎం జగన్‌ పరిపాలన బాగానే చేస్తున్నారన్న ఆయన... ఏపీకి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం కోసం తాను ప్రయత్నిస్తానన్నారు. వైఎస్‌ జగన్‌కు ఏపీని పాలించే అవకాశం రావటం టీడీపీ అధినేత చంద్రబాబుకు పెద్ద ఎదురుదెబ్బగా అథవాలే అభిప్రాయపడ్డారు. కర్ణాటకలో వివాదాస్పదమైన హిజాబ్‌(Hijab Issue) అంశంపై స్పందించిన అథవాలే హిజాబ్‌ అంశం కర్ణాటక ప్రభుత్వ నిర్ణయమన్నారు. విద్యాసంస్థల్లోకి మతం వెళ్లకూడదన్నదన్నారు. పాఠశాలల్లో బాలికలు హిజాబ్ ధరించాల్సిన అవసరం లేదన్నారు. 


గతంలోనూ వైసీపీ-బీజేపీ దోస్తీపై కామెంట్స్ 


సీఎం జగన్‌ తనకు మంచి మిత్రుడని ఆయన ఎన్డీఏలో చేరాలని గతంలో ఒకసారి రాందాస్ అథవాలే అన్నారు.  ఎన్డీఏలో చేరితే హైవేలు, నీటిపారుదల ప్రాజెక్టుల్లో మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. మరో 15 ఏళ్ల వరకు కాంగ్రెస్‌ పార్టీ(Congress Party) పుంజుకునే అవకాశం లేదని అథవాలే జోస్యం చెప్పారు. వైఎస్ఆర్సీపీ(Ysrcp) కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం అయితే ఆంధ్రప్రదేశ్ మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. కేంద్రంలో భాగస్వామ్యం అయితే  ఏపీ అభివృద్ధి త్వరగా జరుగుతుందన్నారు. జాతీయ రహదారులు, టూరిజం ప్రాజెక్ట్ లు పూర్తి చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. 


Also Read: ఉదయం "హోదా" సాయంత్రానికి తొలగింపు - విభజన సమస్యల చర్చల ఎజెండా మార్చేసిన కేంద్ర హోంశాఖ !