Bandi Srinivasarao : ప్రభుత్వ ఉద్యోగులు పరిస్థితి కూలీల కన్నా అధ్వానంగా ఉందని ఏపీ ఎన్జీవో సంఘం నేత బండి శ్రీనివాసరావు అన్నారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన... ఉద్యోగులకు బ్యాంకు రుణాలు కూడా ఇవ్వడంలేదన్నారు. పాలు, కూరగాయలు, బ్యాంకుల వాళ్ల దగ్గర ప్రభుత్వ ఉద్యోగులు లోకువయ్యే పరిస్థితి వచ్చిందని ఆవేదన చెందారు.  


ఉద్యమాన్ని తాకట్టు పెట్టలేదు 


రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ సంఘాలకు లాలూచీ పడలేదని బండి శ్రీనివాసరావు అన్నారు. ఉద్యోగుల ఉద్యమాన్ని నేతలు తాకట్టు పెట్టలేదన్నారు. ఉద్యోగులకు క్రమం తప్పకుండా జీతాలు ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత అన్నారు. ఒక్క నెల జీతం రాకపోతేనే ఉద్యోగులు ఇబ్బందులు పడతారని, అలాంటిది కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు బకాయిలు పెడుతున్నారన్నారు. ఉద్యోగులకు జీతాలు ఇచ్చాకే ఐఏఎస్‌లకు ఇస్తామని నోటిమాటగా చెప్పడమే కానీ అది అమలుకావడంలేదన్నారు.  ప్రభుత్వ ఉద్యోగులందరికీ 62 ఏళ్ల ఉద్యోగ విరమణ వయసు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ చేపట్టాలని కోరారు. జీపీఎఫ్‌ నిధులను ప్రభుత్వం వాడుకోవడం ఏమిటని ప్రశ్నించారు. పింఛన్లను ఒకటో తేదీనే ఇస్తున్న ప్రభుత్వం పెన్షనర్లకు కూడా అదే ప్రాధాన్యత ఇవ్వాలని బండి శ్రీనివాసరావు సూచించారు. 


జనవరి 31న ఎన్నికలు


సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా సంక్షోభంలోకి నెడుతున్నారని బండి శ్రీనివాసరావు ఆరోపంచారు. ఏ ప్రభుత్వంతో ఉద్యోగ సంఘాలకు లాలూచీపడవన్నారు.  ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ ఎన్నికల నోటిఫికేషన్, షెడ్యూల్ ప్రకటించారు. జనవరి 31న ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ ఎన్నికలు జరగనున్నాయియ. అదే రోజున ఎన్నికల ఫలితాల ప్రకటిస్తారు. అధ్యక్షుడు సహా 20 పోస్టులకు ఎన్నికలు నిర్వహిస్తారు. జనవరి 18న నామినేషన్ల స్వీకరణ, జనవరి 19న అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తారు. విజయవాడలోని ఏపీ ఎన్జీవోస్ హోంలో ఎన్నికల నిర్వహించనున్నారు. ఎన్నికల్లో పోటీ చేసి అభ్యర్థులకు నామినేషన్ ఫీజును రూ.500గా నిర్ణయించారు.


మరోసారి ఆందోళన బాట! 


ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరోసారి ఆందోళన బాట పట్టాలని నిర్ణయించుకున్నారు. పెండింగ్ లో ఉన్న డిమాండ్ల పై  ఉద్యోగుల సంఘం నేతలు ఇటీవల సమావేశం అయ్యారు. జనవరి 15  ప్రభుత్వానికి డెడ్ లైన్ ఇచ్చారు.అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే సమ్మె చేస్తామని ప్రకటించారు. విజయవాడలో ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ఇటీవల నిర్వహించారు. జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయని నాయకులు ఆవేదన వెలిబుచ్చారు. ఏపీజేఏసీ అమరావతి మూడో మహా సభ కర్నూలులో ఫిబ్రవరి ఐదో తేదీన జరుపుతామని..వేలాదిగా ఉద్యోగులు అంతా తరలి రావాలని బొప్పరాజు వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. ఉద్యోగుల సమస్యలపై సమావేశంలో వాడివేడిగా చర్చ సాగిందని.. మాకు రావాల్సిన వేల‌కోట్లు రూపాయలు ఇవ్వక‌పోగా..ప్రతి నెలా భత్యాలు కూడా ఒకటో తేదీకి ఇవ్వడం లేదన్నారు.రెండేళ్లు పాటు భరించామని, ప్రభుత్వానికి ఇది ఒక అలవాటుగా మారిందని ఫైర్ అయ్యారు. జీతాలు, పెన్షన్ లు ఇరవై తేదీ అయినా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.  జీత భత్యాల‌ కోసం ఉద్యోగులు రోడ్డు మీదకు వచ్చే పరిస్థితి తెచ్చారన్నారు.  బకాయిలు అడగకూడదనే జీతాలు ఆలస్యం చేస్తున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఉందని మండిపడ్డారు.