ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ధరలు ఎప్పుడూ హాట్ టాపిక్కే. షాక్ కొట్టేలా రేట్లు పెంచుతామని చెప్పి మరీ సీఎం జగన్ అంత కంటే ఎక్కువగానే రేట్లు పెంచారు. అలా పెంచడం వల్ల మద్యం తాగేవారి సంఖ్య తగ్గించాలని ప్రభుత్వ లక్ష్యం. ఆ లక్ష్యం దిశగా వెళ్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఇలా రేట్లు పెంచడం వల్ల ప్రభుత్వానికి భారీ ఆదాయం వస్తోంది. ఇప్పుడు ఆ ఆదాయం వచ్చే సోర్స్‌ను ప్రభుత్వం మార్చింది. అంటే ఇప్పటి వరకూ వ్యాట్ విధించేవారు . ఇప్పుడు వ్యాట్ తగ్గించి, మార్జిన్ పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చింది. వ్యాట్ తగ్గించినా మద్యం రేట్లు పైసా తగ్గవు. అలాంటప్పుడు ప్రభుత్వం మార్పులు ఎందుకు చేసింది..? ఏ వ్యూహంతో ఉత్తర్వులు ఇచ్చింది. విపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా కొత్త అప్పుల కోసం ప్రయత్నించడమేనా ?
Also Read : ఉద్యోగ నేతలకు ఏపీ ప్రభుత్వం పిలుపు - తాడోపేడో తేల్చుకుంటామంటున్న సంఘాలు !
మద్యంపై భారీగా వ్యాట్ తగ్గిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు !
ప్రభుత్వం జీవోలన్నీ రహస్యంగా ఉంచుతోంది. ఎప్పుడో నిర్ణయ అమల్లోకి వచ్చినప్పుడో లేకపోతే ఉద్దేశపూర్వకంగా బయటకు తెలియాల్సి ఉన్నప్పుడో వివరాలు బయటకు వస్తున్నాయి. ఇలా హఠాత్తుగా మద్యంపై వ్యాట్ తగ్గించిన జీవో వివరాలు బయటకు వచ్చాయి. వ్యాట్ తగ్గించారు అంటే రేట్లు తగ్గుతాయని అందరూ అనుకున్నారు. కానీ ఆ జీవోనే ఒక్క పైసా కూడా ధరల్లో మార్పు ఉండదని స్పష్టం చేసింది. ఇప్పటి వరకూ 100 నుంచి 190 శాతం గరిష్టంగా వ్యాట్ మద్యంపై వసూలు చేస్తున్నారు. అంటే రేట్లను బట్టి ఈ వ్యాట్ అమల్లో ఉంటుంది. ప్రస్తుతం సవరించిన వ్యాట్ ప్రకారం అతి తక్కువగా 35 శాతం ఉండగా అతి ఎక్కువగా 60 శాతం మాత్రమే ఉంటుంది. ఈ లెక్కన చూస్తే మద్యం రేట్లు 60 నుంచి 70 శాతం వరకూ తగ్గాల్సి ఉంటుంది.
Also Read : వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే.. దాదాపు అన్నీ క్లీన్ స్వీపే!
ధరలు తగ్గకుండా స్పెషల్ మార్జిన్ పెంచిన ప్రభుత్వం !
వ్యాట్ తగ్గించినంత మేర బేవరేజెస్ కార్పొరేషన్‌కు స్పెషల్ మార్జిన్ పెంచారు. ఏపీలో మద్యం వ్యాపారం మొత్తం ప్రభుత్వ అధీనంలో ఉంది. ఈ వ్యాపారం చేసేది బేవరేజెస్ కార్పొరేషన్. ఇందు కోసం ఇప్పటి వరకూ ఆరు శాతం మార్జిన్ ప్రభుత్వం ఇస్తోంది.ఈ ఆరు శాతం బేవరేజెస్ కార్పొరేషన్ నిర్వహణ ఖర్చులు, ఇతర అవసరాల కోసం. ఇప్పుడు స్పెషల్ మార్జిన్ కేటాయించడంతో అది అరవై శాతానికి పెరిగింది. ఇప్పటి వరకూ రూ.60 కోట్లు స్పెషల్ మార్జిన్‌గా బేవరెజెస్ కార్పొరేషన్‌కు వెళ్తూంటే ఇక ముందు రూ. ఆరు వేల కోట్లు వెళ్తాయి.
Also Read: AP Employees : పీఆర్సీ నివేదిక కోసం ఆందోళన..ఏపీ సచివాలయంలో ఉద్యోగ సంఘ నేతల మెరుపు ధర్నా !
బేవరేజెస్ కార్పొరేషన్‌కు రూ. ఆరు వేల కోట్లు ఎందుకు !?
హఠాత్తుగా ప్రభుత్వం బేవరెజెస్ కార్పొరేషన్‌కు అంత భారీ మొత్తంలో స్పెషల్ మార్జిన్ ఇవ్వడానికి కారణం ఏమిటన్నదానిపై రకరకాల చర్చలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం కారణం ఏమిటో ఇంత వరకూ చెప్పలేదు. కానీ ఇటీవల కార్పొరేషన్ల పేరుతో ప్రభుత్వం రుణసమీకరణ చేస్తోంది. ఇందులోభాగంగా బేవరేజెస్ కార్పొరేషన్ పేరుతో రుణం తీసుకోవడానికి ఆదాయాన్ని చూపించాల్సి ఉంది. ఇప్పుడు ఈ ఆదాయాన్ని చూపించి బ్యాంకుల వద్ద నుంచి రూ. పాతిక వేల కోట్ల రుణం తీసుకుంటారని విపక్షాలు అనుమానిస్తున్నాయి. అదే విమర్శలు చేస్తున్నారు.
ఇప్పటికే " అదనపు రీటైల్ ఎక్సైజ్ పన్ను" హామీగా రుణ సేకరణ !
ఏపీ ప్రభుత్వం స్టేట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా ఇప్పటికే రుణం తీసుకుంది. ఆ రుణానికి మద్యంపై విధిస్తున్న " అదనపు రీటైల్ ఎక్సైజ్ పన్ను" హామీగా ఇచ్చింది. ఈ పన్ను దాదాపుగా రూ. మూడు వేల కోట్లు. బ్యాంకుల వద్ద తీసుకున్న రుణానికి కిస్తీల చెల్లింపు కోసం ఈ మొత్తం బ్యాంకులకు వెళ్లిపోతోంది. ఇది కాకుండా వచ్చే ఆదాయంలో మరో అరవై శాతం స్సెషల్ మార్జిన్ కింద బేవరెజెస్ కార్పొరేషన్‌కు మళ్లించి.. ఆ ఆదాయాన్ని చూపించి అప్పులు తీసుకోబోతున్నారని ఆర్థిక నిఫుణులు చెబుతున్నారు. మొత్తానికి మద్యం ఆదాయం కేంద్రంగా ఏపీలో ఆర్థిక విన్యాసాలు జరుగుతున్నాయన్న వాదన మాత్రం వినిపిస్తోంది.
Also Read: JC Paritala : పరిటాల - జేసీ ఆత్మీయ పలకరింపు..అనంతపురం టీడీపీ నేతలకు స్వీట్ షాక్ !