TDP Letter to APSRTC MD over Buses for YSRCP Meeting: అమరావతి: రాజకీయ పార్టీలు సభలు, సమావేశాలు ఏర్పాటు చేసుకునే సమయంలో అద్దెకు ఆర్టీసీ బస్సులను నడపటం ఎప్పటినుంచో జరుగుతుంది. అయితే అధికార పార్టీ వైఎస్సార్ సీపీ సభకు మాత్రమే బస్సులు సప్లై చేయడాన్ని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య (Varla Ramaiah) తప్పుపట్టారు. ఈ మేరకు ఏపీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌లకు టీడీపీ నేత వర్ల రామయ్య లేఖ రాశారు.


‘రాజకీయ పార్టీలకు ఏపీఎస్ ఆర్టీసీ అద్దెకు బస్సులను సరఫరా చేయటం సర్వ సాధారణం. గతంలోనూ పార్టీలకు అతీతంగా ఏపీఎస్ ఆర్టీసీ పేమెంట్ బేస్‌పై బస్సులు అద్దెకు సరఫరా చేసేవారు. కానీ ప్రస్తుతం ఏపీఎస్ ఆర్టీసీ కేవలం అధికార వైఎస్ఆర్‌సీపీ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ.. ఆ పార్టీ కార్యక్రమాలకు, సభలకు మాత్రమే పెద్ద ఎత్తున బస్సులు సప్లై చేస్తుంది. ఇతర పార్టీల అభ్యర్ధనలను ప్రక్కన పెడుతుంది. జనవరి 27న విశాఖపట్టణం జిల్లా భీమునిపట్నంలో జరిగిన వైకాపా సభకు భారీ సంఖ్యలో ఆర్టీసీ బస్సులను పంపారు. దాంతో మేం కోరిన కొంత సమాచారం ఇవ్వగలరు.


1. భీమునిపట్నంలో వైసీపీ సభకు మొత్తం ఎన్ని బస్సులు పంపారు?
2. పంపిన బస్సులు చెల్లింపు లెక్కన అందించారా? ఏ లెక్కన ఛార్జ్ వసూలు చేశారు?
3. ఆర్టీసీ వారు నిర్ణయించిన రేట్ల ప్రకారం వైఎస్ఆర్సీపీ వారు అద్దెను చెల్లించారా? చెల్లిస్తే ఏ విధానంలో(Mode of Payment), ఎంత, ఎవరి పేరు మీద చెల్లించారో వాటి వివరాలు?
4. అధికార వైఎస్‌ఆర్‌సీపీతో సమానంగా తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలకు ఏపీఎస్ ఆర్టీసీ వారు బస్సులను ఇవ్వకపోవటానికి గల కారణాలు ఏమిటి? ఈ వివరాలను ఇవ్వాలని ఆర్టీసీని కోరుతూ టీడీపీ నేత వర్ల రామయ్య లేఖ రాశారు.