Professor Kodandaram Counter: బీఆర్‌ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు, తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్‌కు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం కౌంటర్ విసిరారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ప్రొఫెసర్ శ్రవణ్ కరెక్ట్ కాదా.. మరి ప్రొఫెసర్ కోదండరాం కరెక్టా అని గవర్నర్ తమిళిసైను కేటీఆర్ నిలదీసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రొఫెసర్ కోదండరామ్ స్పందించారు.
తనకు ఎమ్మెల్సీ దక్కడంపై కేటీఆర్ అభ్యంతరాలు వ్యక్తం చేయడం ఏంటని ప్రశ్నించారు. ప్రజలకు అన్నీ తెలుసని.. తన ఎంపికపై అనవసరంగా కేటీఆర్ వివాదం చేయడం సరికాదని అన్నారు. రాజ్యాంగంలో షరతులు అర్ధమైతే చర్చ ఉండదని.. జాగ్రత్తగా రాజ్యాంగం చదివితే వివాదం అనేదే ఉండదని అన్నారు. రాజ్యాంగ పరంగా సేవ చేసిన వాళ్లకు ఎమ్మెల్సీ అవకాశం ఇస్తారని అన్నారు. తాను సుదీర్ఘకాలం సేవ చేశానని.. అనవసరంగా తన ఎంపికను వివాదం చేయడం తగదని అన్నారు. ప్రజలకు అన్నీ తెలుసని.. ఎవరు ఎలాంటి వారో ప్రజలే అంచనా వేసుకుంటారని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు.
ఎదురుచూపులు..
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియామకమైన ప్రొఫెసర్ కోదండరాం, అమెర్ అలీఖాన్ పట్ల తెలంగాణ శాసన మండలి చైర్మన్ అగౌరవాన్ని ప్రదర్శించారు. ప్రమాణస్వీకారం కోసం సభ్యులు వచ్చినా కూడా చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాత్రం తన చాంబర్ కు చేరుకోలేదు. దీంతో గంటల తరబడి వారిద్దరూ ఆయన కోసం ఎదురుచూడాల్సి వచ్చింది. కేసీఆర్ ఆదేశాలతోనే గుత్తా ఆలస్యం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.
అందుకే రాలేకపోయా - గుత్తా సుఖేందర్
మండలికి రాకపోవడంపై మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పందించారు. గత కొన్ని రోజుల నుండి తాను గొంతు నొప్పి, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నానని అన్నారు. వైద్యుల పర్యవేక్షణలో ఆ రోజు నుండి ఎలాంటి కార్యక్రమాలలో పాల్గొనకుండా చికిత్సపొందుతున్నానని అన్నారు. అనారోగ్యంతో ఉండటం కారణంగానే గణతంత్ర దినోత్సవం సందర్భంగా 26 వ తేదీ సాయంత్రం గవర్నర్ “ఎట్ హోం” కార్యక్రమానికి కూడా వెళ్ళలేదని అన్నారు.
అదే విధంగా ముంబయిలో ఈ నెల 27, 28 మరియు 29 తేదీలలో జరుగుతున్న అల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ కూడా వెళ్ళలేదు. 26వ గణతంత్ర దినోత్సవం రోజున శాసన పరిషత్తు కార్యాలయంలో ప్రమాణ స్వీకారానికి సమయం ఇవ్వాలని శాసన సభ్యుల కోటాలో ఎన్నికైన మహేష్ కుమార్ గౌడ్ మాత్రమే అడిగారు. ఈ నెల 31వ తేదీ మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రమాణ స్వీకారానికి సమయం అడిగారు. దానికి నేను అంగీకరించాను. వీలైతే అదే రోజు మిగతా ఎమ్మెల్సీలతో కూడా ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించడం జరిగింది. నేడు కోదండ రాం, ఇతర నూతనంగా ఎన్నికైన శాశన పరిషత్తు సభ్యులు నాకు సమాచారం ఇవ్వకుండా మా కార్యాలయానికి వచ్చారు. శాసన మండలి ఛైర్మన్ గా నిస్పక్షపాతంగా నా కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహిస్తా. మీడియా మిత్రులు తొందరపడి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయవద్దు’’ అని గుత్తా సుఖేందర్ రెడ్డి కోరారు.