Varahi Yatra 2nd Schedule: జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేస్తున్న వారాహి యాత్రపై మంత్రి గుడివాడ అమర్నాథ్ సెటైర్లు వేశారు. మొన్నటి వరకు పార్ట్ - 1 చేశారని, ఇప్పుడు పార్ట్ -2 చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయం అంటే ఓటీటీ వెబ్ సిరీస్ కాదని చురకలటించారు. పవన్ సినిమాల్లో మాత్రమే హీరో అని రాజకీయాల్లో మాత్రం సైడ్ క్యారెక్టర్ అని తెలిపారు. పవన్ కల్యాణ్ సినిమాలో చంద్రబాబు విలన్ అని దుయ్యబట్టారు. 175 నియోజక వర్గాల్లో పోటీ చేసేందుకు జనసేనకు అభ్యర్థులే లేరని అన్నారు. చంద్రబాబును భుజాన వేసుకొని తిరగడానికి రాజకీయ పార్టీ దేనికంటూ పవన్ ను ప్రశ్నించారు. రాష్ట్ర రాజకీయాల్లో చంద్రబాబు విలన్ అంటూ చెప్పుకొచ్చారు. 2019 ఎన్నికల ఫలితాలు మళ్లీ రిపీట్ అవుతాయని.. నేషనల్ మీడియాలో పవన్ కల్యాణ్ భార్యతో విడిపోయారని వార్త వచ్చిన వెంటనే భుజాలు తడుముకొని మరీ ఫొటో విడుదల చేయడం ఏంటని అన్నారు.   


మూడు, నాలుగు పెళ్లిళ్లు చేసుకుంటా: గుడివాడ అమర్నాథ్                       


మూడో,నాలుగో పెళ్లిళ్లు చేసుకుంటే ముఖ్య‌మంత్రి అయ్యే యోగం ఉందంటే తాను కూడా అన్ని పెళ్లిళ్లు చేసుకుంటాన‌ని ఇటీవలే ప్రకటించేశారు.  ఈసారి కూడా గెలవలేనని ముమ్మిడివరంలో పవన్‌కు జ్ఞానోదయం అయిందని అన్నారు. ఉపవాసాలు చేస్తేనో, నలుగురిని పెళ్లి చేసుకుంటేనో, నలుగురిని తిడితేనో ముఖ్యమంత్రి కాలేరని చెప్పుకొచ్చారు. అలా అయ్యే అవకాశం ఉంటే తానూ మూడు, నాలుగు పెళ్లిళ్లు చేసుకుంటానన్నారు. అంతే కాదు.. తనకు  ఉప ముఖ్యమంత్రి కావాలని ఉంది. నేనూ 15 రోజులు ఉపవాసాలు చేస్తాను. అయిపోతానా? అని చెప్పుకొచ్చారు. 


ఉపముఖ్యమంత్రి కావాలని ఉంది..                        


ఒక లీడర్‌‌కు కావాల్సిందేంటి? నిబద్ధత, డెడికేషన్, స్థిరత్వం, సహనం ఉండాలని.. పెళ్లిళ్లు చేసుకోవడం కాదని చెప్పుకొచ్చారు.  అభిమానులు ఉన్నారు. సినీ నటుడిగా చరిష్మా ఉంది. కాపు కులంలో పుట్టారు కాబట్టి.. అది కూడా కలిసి వస్తుంది. నిజంగా వీటన్నింటినీ వాడుకోవాలని అనుకుంటే. దానికి అనేక రకాల దారులు ఉన్నాయని పవన్ కు సలహా ఇచ్చారు.   డెడికేషన్   ఉండుంటే.. కనీసం ఎమ్మెల్యే అయినా అయ్యే వారేమో అని ఎద్దవా చేశారు.  ప్రత్తిపాడు వచ్చి ఎమ్మెల్యే కావాలని అంటారు.. పిఠాపురం వచ్చి ముఖ్యమంత్రిని చేయమని అంటారు.. ముమ్మిడివరం వచ్చి ఈ సారి గెలవకపోయినా కలిసి పోరాటం చేయాలని అంటారు అని  ప‌వ‌న్ క‌ల్యాణ్ స్టేట్ మెంట్లపై మండిపడ్డారు.  పవన్  ఎప్పుడు ఏం మాట్లాడ‌తారో ఆయ‌న‌కే తెలీయ‌ద‌ని, ఈసారికూడా జ‌న‌సేనానికి ఎమ్మెల్యే యోగం లేద‌ని అమర్నాథ్ చెప్పుకొచ్చారు. 


పవన్ కల్యాణ్ పెళ్లిళ్ల అంశాన్ని తెరపైకి తెస్తున్న  వైసీపీ నేతలు              


పవన్ కల్యాణ్ పూర్తిగా రాజకీయ విమర్శలు చేస్తారని కానీ ఆయనకు కౌంటర్ ఇవ్వలేక.. వ్యక్తిగత విమర్శలు చేస్తారని జనసేన నాయకులు మండిపడుతూ ఉంటారు. పవన్ పెళ్లిళ్ల ప్రస్తావన ఎందుకు తెస్తారని ఎన్ని సార్లు ప్రశ్నించినా వారు అదే పద్దతిలో వెళ్తున్నారని అంటున్నారు. పవన్ పెళ్లిళ్ల గురించి చెప్పే క్రమంలో ఆ చాన్స్ ఉంటే తానూ చేసుకుంటానని చెప్పడం గుడివాడ అమర్నాథ్ తీరుకు నిదర్శనమని.. జనసైనికులు సెటైర్లు వేస్తున్నారు.