Jammu Kashmir Floods:


జమ్ముకశ్మీర్‌లో వరదలు..


జమ్ముకశ్మీర్‌ భారీ వర్షాలతో తడిసి ముద్దవుతోంది. పలు జిల్లాల్లో కొండ చరియలు విరిగి పడుతున్నాయి. వరదలు ముంచెత్తున్నాయి. ముఖ్యంగా పూంఛ్ జిల్లాలో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. వరదల ధాటికి ఇద్దరు భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. సురన్‌కోటేలోని డోగ్రా నల్లాని దాటుతుండగా ఒక్కసారిగా వరద ఉద్ధృతి పెరిగింది. అందులో పడిపోయిన ఇద్దరు సైనికులు గల్లంతయ్యారు. ఆ తరవాత శవాలై తేలారు. మొదట ఓ సైనికుడి మృతదేహాన్ని కనుగొన్న రెస్క్యూ టీమ్...మరొకరి డెడ్‌బాడీని కనిపెట్టలేకపోయారు. దాదాపు 24 గంటల పాటు గాలించాక ఆ మృతదేహం లభించింది. భారత ఆర్మీకి చెందిన 16 Corps దీనిపై స్పందించింది. ఈ ఘటన తమను కలిచివేసిందని తెలిపింది. 


"వరదల ధాటికి ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. వాళ్లకు సెల్యూట్. ప్యాట్రోలింగ్ చేస్తున్న క్రమంలోనే ఈ ప్రమాదం జరిగింది. ఓ నదిని దాటుతుండగా నీళ్లలో పడిపోయారు. వరదల ధాటికి పూంఛ్ జిల్లా చాలా ప్రమాదకరంగా మారింది. ఈ ఇద్దరి కుటుంబాలకు భారత ఆర్మీ తరపున ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాం. వాళ్ల కుటుంబ సభ్యులకు అండగా ఉంటాం"


- ఇండియన్ ఆర్మీ 






జమ్ముకశ్మీర్‌లోని రెండు జిల్లాల్లో రెడ్ అలెర్ట్ ప్రకటించారు వాతావరణ శాఖ అధికారులు. దాదాపు మూడు రోజులుగా అక్కడ కుండపోత కురుస్తోంది. కథువా, సంబా ప్రాంతాల్ని మరింత వరదలు ముంచెత్తే ప్రమాదముందని హెచ్చరించారు. రానున్న 24 గంటల పాటు అంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఢిల్లీ, హరియాణా, హిమాచల్ ప్రదేశ్,ఉత్తరాఖండ్, రాజస్థాన్, పంజాబ్, జమ్ముకశ్మీర్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే కురిసే అవకాశముందని IMD తెలిపింది. అమర్‌నాథ్ యాత్ర (Amarnath Yatra) వరుసగా మూడో రోజు కూడా రద్దైంది. పలు చోట్ల కొండచరియలు విరిగి పడుతున్నాయి. శ్రీనగర్ జమ్ము హైవేలో దాదాపు 3 వేల వాహనాలు నిలిచిపోయాయి. కొన్ని చోట్ల రహదారులపై భారీ గుంతలు ఏర్పడ్డాయి.


Also Read: Agnipath Scheme: అగ్నివీర్‌ స్కీమ్‌పై ఆసక్తి తగ్గుతోందా! ట్రైనింగ్ మధ్యలోనే వచ్చేస్తున్న యువత