Vangalapudi Anita: ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీకి వైఎస్సార్ పేరు పెట్టడాన్ని తెలుగు దేశం పార్టీ ఏపీ మహిళా అధ్యక్షురాలు వంగల పూడి అనిత మండిపడ్డారు. మహోన్నత వ్యక్తి అయిన ఎన్టీఆర్ కు.. వైఎస్సార్ కు నక్కకు.. నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని అనిత విమర్శించారు. తండ్రి వైఎస్ రాజ శేఖర రెడ్డిపై జగన్ మోహన్ రెడ్డికి అంత ప్రేమ ఉంటే... తాడేపల్లి ప్యాలెస్, హైదరాబాద్ లో ఉన్న లోటస్ పాండ్ కు ఎందుకు వైఎస్ పేరు పెట్టలేదని వంగలపూడి అనిత ప్రశ్నించారు. పదహారు నెలల పాటు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉన్న జైలుకు జగన్ సెంట్రల్ జైలు లేదా వైఎస్సార్ సెంట్రల్ జైలు అని పేరు పెట్టుకోవాలని టీడీపీ ఏపీ మహిళా అధ్యక్షురాలు సూచించారు. డాక్టర్ గా వైఎస్ రాజశేఖర రెడ్డి సేవలందించినందుకే ఎన్టీఆర్ విశ్వ విద్యాలయానికి పేరు పెట్టామని చెప్పుకుంటున్న వైసీపీ నేతలు జగన్ ఉన్న జైలుకు కూడా పేరు పెట్టాలని వంగలపూడి అనిత పేర్కొన్నారు. వాస్తవానికి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో వైఎస్ భారతి, విజయ సాయి రెడ్డి అల్లుడు ఉన్నారని ప్రచారం జరుగుతోందని.. ఆ తరుణంలోనే ఆ ప్రచారాన్ని కప్పి పుచ్చడానికి, పేర్లు మార్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అనిత ఆరోపించారు. 


ఢిల్లీలోని మద్యం పాలసీలపై ఆరోపణలు


ఈ మధ్య దేశవ్యాప్తంగా ఢిల్లీలో మద్యం కుంభకోణం ప్రకంపనలు రేగాయి. టెండర్ల ప్రక్రియలో అక్రమాలు జరిగాయని, కోట్లాది రూపాయలు చేతులు మారాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఆరోపణల లింకులు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఢిల్లీ లిక్కర్ కుంభకోణానికి తెలంగాణలోని ప్రజాప్రతినిధులకు, ఆంధ్రప్రదేశ్ లోని నాయకులకు లింకులు ఉన్నాయన్న ఆరోపణలు వచ్చాయి. ఢిల్లీలో కొన్ని నెలల క్రితం కొత్త మద్యం విధానం అమలులోకి వచ్చింది. 2021 నవంబరు నుండి అమలు అవుతున్న ఈ విధానంలో భాగంగా ఎక్సైజ్ అధికరాులు ఢిల్లీని 32 జోన్లుగా విభజించారు. ఈ సారి మద్యం విక్రయాల బాధ్యతను ప్రైవేటు సంస్థలకు అప్పగించింది. మాఫియా ను నియంత్రించడం, వినియోగదారులకు సమస్యలు లేకుండా చూడడం అలాగే మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెంచడమే లక్ష్యంగా కొత్త మద్యం విధానాన్ని తీసుకు వస్తున్నట్లు ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆప్ సర్కారు వెల్లడించింది. దీని వల్ల 27 శాతం ప్రభుత్వ ఆదాయం పెరుగుతుందన్ ఆప్ ప్రభుత్వం పేర్కొంది. 


చేతులు మారిన కోట్లాది రూపాయలు


అయితే కొత్త విధానంలో జరిగిన టెండర్ల ప్రక్రియలో అక్రమాలు జరిగాయని, ఈ వ్యవహారంలో పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారాయని బీజేపీ ఆరోపించింది. బీజేపీ ఆరోపణలతో కేజ్రీవాల్ సర్కారు కొత్త మద్యం విధానాన్ని రద్దు చేసింది. పాత పద్ధతిలోనే మద్యం అమ్మకాలు జరుగుతాయని పేర్కొంది. అంతకుముందే కొత్త మద్యం పాలసీలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై విచారణ ప్రారంభం అయింది. ఆ తర్వాత ఢిల్లీ ఎక్స్జైజ్ ఉన్నతాధికారి ఒకరు మద్యం పాలసీలో అవకతవకలు జరిగాయన్నది నిజమేనని వెల్లడించడంతో బీజేపీ తన దాడిని తీవ్రతరం చేశారు.