Vamsi admitted In private hospital: వైఎస్ఆర్‌సీపీ సీనియర్ నేత వల్లభనేని వంశీ విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. ఆయనకు శ్వాస తీసుకోవడంలో సమస్యలు రావడంతో కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. ప్రత్యేక వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందిస్తోంది. ఇంకా మెరుగైన వైద్యం అవసరం అయితే వైద్యుల సిఫారసు మేరకు హైదరాబాద్ తరలించే అవకాశం ఉంది. అయితే కోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కోర్టు షరతుల మేరకు గన్నవరంలోనే ఉండాలి. పలు కేసుల్లో వారానికి రెండు రోజులు పోలీస్ స్టేషన్ కు హాజరై సంతకాలు పెట్టాల్సి ఉంది.
గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదు దారుడ్ని బెదిరించి.. కేసు విత్ డ్రా చేయించారన్న ఆరోపణలపై ఫిబ్రవరి 13న అరెస్టు చేశారు. అప్పటి నుంచి వివిధ రకాల కేసుల్లో పీటీ వారెంట్లు అమలు చేయడంతో 147 రోజుల పాటు జైల్లో ఉన్నారు. అన్ని కేసుల్లో బెయిల్ రావడంతో బయటకు వచ్చారు. అయితే ఆయనకు జైలులో ఉన్న సమయంలో అనారోగ్య సమస్యలు తలెత్తాయి. పలుమార్లు ఆస్పత్రుల్లో చికిత్స అందించారు. శ్వాస కోశ సమస్యకు కోర్టు అనుమతితో ఆస్పత్రిలోనూ చికిత్స తీసుకున్నారు. విడుదలైన తర్వాత ఆస్పత్రిలో పూర్తి స్థాయిలో పరీక్షలు చేయించుకుని అవసరం అయితే ఆస్పత్రిలో అడ్మిట్ అవుతారని అనుకున్నారు.
కానీ వల్లభనేని వంశీ మిత్రులు, సన్నిహితులతో సమావేశం అవుతున్నారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత రోజే తాడేపల్లిలో పార్టీ అధ్యక్షుడు జగన్ ను కలిశారు. ఆ తర్వాత నుంచి వరుసగా పార్టీ నేతలు నచ్చి కలుస్తున్నారు. పేర్ని నాని, కొడాలి నాని కూడా వచ్చి కలిశారు. అయితే వీరంతా కలిసిన సమయంలో కూడా వంశీ అంత చురుకుగా ఉండటం లేదు. నోటికి కర్చీఫ్ అడ్డం పెట్టుకుని మాట్లాడుతున్నారు. దీంతో అనారోగ్యం నుంచి ఆయన కోలుకోలేదని స్పష్టం అయింది.
బెయిల్ షరతుల ప్రకారం ఆయన గన్నవరం నియోజకవర్గంలోనే ఉండాలి. చికిత్స కోసం హైదరాబాద్ లేదా ఇతర ప్రాంతానికి వెళ్లాలంటే కోర్టు అనుమతి తీసుకోవాలి. జైలు నుంచి విడుదలైన తర్వాత వైద్య పరంగా జాగ్రత్తలు తీసుకోకపోవడం, చాలా మంది వచ్చి కలుస్తూండటంతో శ్వాస సమస్య ఇన్ ఫెక్షన్ పెరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆయనను కలిసేందుకు ఎవరూ రావొద్దని కుటుంబసభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ తరపున గెలిచి వంశీ ఆ తర్వాత వైసీపీలోకి మారారు. వైసీపీలోకి వెళ్లిన తర్వాత చంద్రబాబు కుటుంబంపై, లోకేష్ పై అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో తన తల్లిని కించ పరిచిన వారిని ఊరుకునేది లేదని లోకేష్ హెచ్చరించారు. ప్రభుత్వం మారడంతో వంశీ సైలెంట్ అయ్యారు. అయితే ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ఆయన ఏ 71గా ఉన్నారు. పోలీసులు అరెస్టు చేయలేదు కానీ న్యాయపోరాటం చేస్తూ ఉండటంతో ఏ చర్యా తీసుకోలేదు. అయితే ఫిర్యాదు దారుడ్నే కిడ్నాప్ చేసి.. కేసును విత్ డ్రా చేయించే ప్రయత్నం చేయడంతో కేసులు నమోదయ్యాయి.