Daggubati Purandeswari: స్కిల్ డెవలప్ మెంట్ కేసులో సీఐడీ తీరు అనుమానాస్పదంగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ఈ కేసును విచారిస్తున్న అధికారులు ఒక్కరైనా, ఒక్కసారైనా రాష్ట్ట్రంలో ఉన్న ఒక్క స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ను అయినా పరిశీలించారా అని ప్రశ్నించారు. నైపుణ్యాభివృద్ధి శిక్షణను అవసరమైన సౌకర్యాలను స్కిల్ కేంద్రాల్లో కల్పించినట్లు తాము గుర్తించినట్లు వెల్లడించారు. అలాగే ఏపీలో సంపూర్ణ మద్యపాన నిషేధం విధిస్తానని ప్రజలను నమ్మించి.. అధికారంలోకి వచ్చాకా కల్తీ మద్యాన్ని అమ్మి ప్రజల ప్రాణాలు తీస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మద్యం కంపెనీల నుంచి తాడేపల్లి ప్యాలెస్ కు వేల కోట్ల డబ్బు అక్రమంగా అందుతుందని ఫైర్ అయ్యారు. 


మద్యం విషయంలో వైసీపీ అవినీతికి పాల్పడుతోందని దగ్గుబాటి పురందేశ్వరి విమర్శించారు. హానికరమైన రసాయనాలతో మద్యం తయారు చేస్తున్నారని ఆరోపించారు. అలాగే 15 రూపాయలకే లీటర్ మద్యం తయారు చేసి వందల రూపాయలకు అమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన ప్రభుత్వం... వారి జీవితాలతో చెలగాడం ఆడుతోందని ధ్వజమెత్తారు. అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా పట్టించుకోకుండా.. కోట్లు సంపాధించుకుంటున్నారని చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వంలో మద్యం ద్వారా రాష్ట్రానికి 15 వేల కోట్ల ఆదాయం వస్తే.. ప్రస్తుతం 32 వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తోందని అన్నారు. మద్యం తయారీ, సరఫరా, అమ్మకాలపై వైసీపీ సర్కారు పూర్తిస్థాయి గుత్తాధిపత్యం ప్రదర్శిస్తోందని పురందేశ్వరి ఫైర్ అయ్యారు. ప్రజలకు మంచి చేసే సంక్షేమ పథకాల గురించి ఆలోచించడం పక్కన పెట్టి.. ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేయడం, కేసులు పెట్టడంపై సీఎం జగన్ ఎక్కువ దృష్టి పెట్టారంటూ ఆమె చెప్పుకొచ్చారు. 


Read Also: Daggubati Purandeswari: చంద్రబాబు అరెస్ట్ వెనుక కేంద్ర ప్రభుత్వం ఉందా? పురందేశ్వరి స్ట్రాంగ్ రియాక్షన్


నిన్నటికి నిన్న బాబు అరెస్టులో తమ పాత్ర లేదని క్లారిటీ ఇచ్చిన పురందేశ్వరి


చంద్రబాబు అరెస్టు విషయంలో బీజేపీ పాత్ర ఉందనే ఆరోపణలను పురందేశ్వరి తీవ్రంగా ఖండించారు. బాబు అరెస్ట్ వెనుక బీజేపీ పాత్ర ఉన్నట్లు జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని క్లారిటీ ఇచ్చారు. అందులో కొంచెం కూడా వాస్తవం లేదని, కొంతమంది కావాలనే బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అదంతా ఫేక్ ప్రచారమని, కేంద్ర ప్రభుత్వం దీని వెనుక లేదని తెలిపారు. చంద్రబాబు అరెస్ట్‌పై మొదట స్పందించింది బీజేపీనేనని, ఆయనను అరెస్ట్ చేసిన విధానాన్ని తాము తీవ్రంగా ఖండించినట్లు స్పష్టం చేశారు. ఏపీ, తెలంగాణ బీజేపీ నేతలందరూ బాబు అరెస్ట్‌ను ఖండించారని పేర్కొన్నారు.


వైసీపీ కనుసన్నల్లో సీఐడీ పనిచేస్తుందని పురందేశ్వరి ఆరోపించారు. సీఐడీ అనేది రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుందని, కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. అలాగే వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుంటామని చంద్రబాబుతో ములాఖత్ తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటనపై కూడా పురందేశ్వరి స్పందించారు. పవన్ వ్యాఖ్యలను తాము తప్పుగా చూడటం లేదన్నారు.  బీజేపీ అధిష్టానానికి అన్నీ వివరిస్తామని పవన్ అన్నారని, అదే విధంగా ఏపీ పరిస్థితులను కూడా చెబుతారని పురందేశ్వరి చెప్పారు. బీజేపీతో జనసేన పొత్తు కొనసాగుతూనే ఉందని తెలిపారు. పొత్తుల విషయంపై బీజేపీ పెద్దలతో మాట్లాడిన తర్వాత తమ అభిప్రాయలు చెబుతామన్నారు. పవన్ వ్యాఖ్యలను హైకమాండ్‌కు వివరిస్తామని, ఢిల్లీకి వెళ్లి తన అభిప్రాయాలు చెబుతానన్నారు. పొత్తుల గురించి తమతో చర్చించే సమయంలో బీజేపీ అధిష్టానానికి రాష్ట్ర నాయకత్వం తరపున అభిప్రాయాలు చెబుతానని పురందేశ్వరి తెలిపారు.