మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబును స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో ఏపీ సీఐడీ అరెస్ట్ చేయడం వెనుక కేంద్ర ప్రభుత్వ పాత్ర ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బీజేపీ అండదండలతోనే ఏపీ ప్రభుత్వం ఈ పని చేయగలిగిందనే ఆరోపణలు రాజకీయ వర్గాల నుంచి కూడా వినిపిస్తున్నాయి. దేశ రాజకీయాల్లోనే సీనియర్‌ నేతగా ఉండటంతో పాటు 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబును అరెస్ట్ చేయడమంటే ఆషామాషీ విషయం కాదని అంటున్నారు.  కేంద్ర ప్రభుత్వ మద్దతు లేకుండా సీఎం జగన్ ఈ పని చేయలేరని, ఖచ్చితంగా బీజేపీ పెద్దల సపోర్ట్‌తో చంద్రబాబు అరెస్ట్ జరిగిందని ఆరోపిస్తున్నారు.


టీడీపీ నేతలు, కార్యకర్తలు కూడా బీజేపీ పాత్రపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం దీనిపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి స్పందించారు. మీడియాతో మాట్లాడిన ఆమె.. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంపై స్పందించారు. ఈ సందర్బంగా ఇందులో బీజేపీ పాత్ర ఉందనే ఆరోపణలను పురందేశ్వరి తీవ్రంగా ఖండించారు. బాబు అరెస్ట్ వెనుక బీజేపీ పాత్ర ఉన్నట్లు జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని క్లారిటీ ఇచ్చారు. అందులో కొంచెం కూడా వాస్తవం లేదని, కొంతమంది కావాలనే బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అదంతా ఫేక్ ప్రచారమని, కేంద్ర ప్రభుత్వం దీని వెనుక లేదని తెలిపారు. చంద్రబాబు అరెస్ట్‌పై మొదట స్పందించింది బీజేపీనేనని, ఆయనను అరెస్ట్ చేసిన విధానాన్ని తాము తీవ్రంగా ఖండించినట్లు స్పష్టం చేశారు. ఏపీ, తెలంగాణ బీజేపీ నేతలందరూ బాబు అరెస్ట్‌ను ఖండించారని పేర్కొన్నారు.


వైసీపీ కనుసన్నల్లో సీఐడీ పనిచేస్తుందని పురందేశ్వరి ఆరోపించారు. సీఐడీ అనేది రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుందని, కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. అలాగే వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుంటామని చంద్రబాబుతో ములాఖత్ తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటనపై కూడా పురందేశ్వరి స్పందించారు. పవన్ వ్యాఖ్యలను తాము తప్పుగా చూడటం లేదన్నారు.  బీజేపీ అధిష్టానానికి అన్నీ వివరిస్తామని పవన్ అన్నారని, అదే విధంగా ఏపీ పరిస్థితులను కూడా చెబుతారని పురందేశ్వరి చెప్పారు. బీజేపీతో జనసేన పొత్తు కొనసాగుతూనే ఉందని తెలిపారు. పొత్తుల విషయంపై బీజేపీ పెద్దలతో మాట్లాడిన తర్వాత తమ అభిప్రాయలు చెబుతామన్నారు. పవన్ వ్యాఖ్యలను హైకమాండ్‌కు వివరిస్తామని, ఢిల్లీకి వెళ్లి తన అభిప్రాయాలు చెబుతానన్నారు. పొత్తుల గురించి తమతో చర్చించే సమయంలో బీజేపీ అధిష్టానానికి రాష్ట్ర నాయకత్వం తరపున అభిప్రాయాలు చెబుతానని పురందేశ్వరి తెలిపారు. 


కాగా వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కలిపి వెళతాయని ప్రకటించిన పవన్.. బీజేపీ కూడా కలిసొస్తే సంతోషకరమని వ్యాఖ్యానించారు. బీజేపీ కూడా తమతో నడిచేలా కేంద్ర పెద్దలతో చర్చిస్తానని అన్నారు. ప్రస్తుతం వైసీపీ, టీడీపీకి బీజేపీ సమదూరం పాటిస్తుంది. అలాగే టీడీపీ, వైసీపీ కూడా పార్లమెంట్‌లో ప్రతి అంశంపై బీజేపీకి మద్దతిస్తున్నాయి. దీంతో రెండు పార్టీలు బీజేపీ పట్ల సానుకూలతతో ఉన్నట్లు అర్థమవుతుంది. కానీ ఎన్నికల్లో ఏ పార్టీతో కలిసి వెళ్లాలనేది మాత్రం బీజేపీ ఇంకా తేల్చుకోలేకపోతోంది.