Union Cabinet has decided to release Polavaram funds :  పోలవరం ప్రాజెక్టుకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయినట్లుగా కనిపిస్తున్నాయి. చంద్రబాబునాయుడు పలుమార్లు ఢిల్లీ వెళ్లి కేంద్రమంత్రులతో జరిపిన చర్చల ఫలితంగా.. పెండింగ్ నిధులతో పాటు రూ. 12500 కోట్లను విడుదల చేయనున్నారు. ఈ మేరకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది.


ఐదేళ్ల పాటు పెద్దగా సాగని పోలవరం పనులు                    


2014 -19 మధ్య పరుగులు పెట్టిన  పోలవరం ప్రాజెక్టు తర్వాత ఆగిపోయింది. ఐదేళ్ల సమయం వృధా అయింది. రివర్స్ టెండర్లకు వెళ్లి కాంట్రాక్టర్లను మార్చడంతో పనులు ఆగిపోయాయి. గైడ్  బండ్ కుంగిపోయింది. డయాఫ్రంవాల్  కూడా దెబ్బతిన్నది.  చంద్రబాబు మళ్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పోలవరాన్ని ఎలా గట్టెక్కించాలా అన్నదనిపై విస్తృతంగా చర్చలు జరిపారు. ఉన్నతాధికారులతో అంచనాలు వేశారు. తర్వాత పలుమార్లు కేంద్రాన్ని కలిసి ప్రాజెక్టు స్థితిగతులపై వివరించారు. డీపీఆర్‌ను ఆమోదించాలని.. తక్షణం పనుల కొనసాగింపులకు రూ. 12500 కోట్లను విడుదల చేయడంతో పాటు పాత బిల్లులు రీఎంబర్స్ చేయాలని కోరారు. కేంద్రం తాజా కేబినెట్ భేటీలో ఆ మేరకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 


పోలవం జాతీయ ప్రాజెక్టు.. ఖర్చంతా కేంద్రానిదే         


విభజన చట్టంలో భాగంగా పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం .. జాతీయ హోదా ఇచ్చింది. సాధారణంగా జాతీయ హోదా ప్రాజెక్టుల్లో 90 శాతం కేంద్రం.. పది శాతం రాష్ట్రం పెట్టుకుంటాయి. అయితే తర్వాత ప్రత్యేక ప్యాకేజీలో భాగంగా ఆ పది శాతం కూడా తామే పెట్టుకుంటామని కేంద్రం హామీ ఇచ్చింది. ఈ మేరకు ముందుగా ప్రభుత్వం పనులు చేయించి  బిల్లులు పెడితే.. కేంద్రం మంజూరు చేస్తూ వస్తోంది. గత ఐదేళ్లుగా ఈ బిల్లింగ్ సైకిల్  గాడి తప్పింది. పనులేమీ చేయకపోవడంతో పెద్దగా బిల్లులు రావాల్సిన అవసరం లేకపోయింది.


ప్రధానిని పలుమార్లు కలిసిన చంద్రబాబు 


అయితే ఇప్పుడు ప్రాజెక్టును గాడిన పెట్టాలనుకున్న చంద్రబాబు.. పలుమార్లు కేంద్ర మంత్రులని కలిసి విజ్ఞప్తి చేశారు. దీంతో ప్రధాన మంత్రి  కార్యాయం  ఆదేశాల మేరకు ఆర్థికశాఖ  పోలవరం నిధుల విషయాన్ని  మంత్రిమండలి ముందు ఉంచింది.  పోలవరం తొలి దశకు అవసరమయ్యే పూర్తి నిధులను అంచనా వేసి పోలవరం డీపీఆర్‌ను రూపొందించడంతో..  అవసరమయ్యే పూర్తి నిధులకు పలు స్థాయిలలో ఆమోదముద్ర వేశారు. ఇప్పుడు కేంద్ర మంత్రిమండలి ఆమోదిస్ంచినందున వెంటనే నిధులు విడుదలయ్యే అవకాశం ఉంది.


చంద్రబాబు ప్రయత్నాలతో నిధుల విడుదల                         


పోలవరం ప్రాజెక్టుకు ప్రత్యేకంగా బడ్జెట్లో నిధులు కేటాయించడం లేదు.  2016 తర్వాత నాబార్డుతో కేంద్రం ఒప్పందం కుదుర్చుకుంది. పోలవరంకు అయ్యే ఖర్చు నాబార్డు ఇస్తుంది.  అయితే కేంద్రానికి రుణం రూపంలో ఇస్తుంది.. అది  ఏపీరాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తోంది. దీంతో పోలవరం ప్రాజెక్టుకు ఇవ్వబోయే 12 వేల కోట్ల రూపాయలకు పైగా నిధులను అడ్వాన్స్‌గా ఇవ్వాలని కోరుతున్నారు. ఆ నిధులు వస్తే ఆర్థికంగా వెసులుబాటు ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.