విద్యార్థులు, ఉద్యోగులు ఉద్యమించారు. ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ వయసు పెంచిన ప్రభుత్వం నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునిచ్చారు. చాలా జిల్లాల్లో ఉద్రిక్తత పరిస్థితులు కనిపించాయి. 


కర్నూలు జిల్లాలో కదం తొక్కిన విద్యార్థులు


కర్నూలు జిల్లా కర్నూలు కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఏపీ ఉద్యోగ పోరాట సమితి ఆధ్వర్యంలో నిరుద్యోగులు కలెక్టరేట్ ముట్టడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2.35 లక్షల ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్ విడుదల చేసి భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. 


కలెక్టరేట్‌ ముట్టడి సందర్భంగా పోలీసులకు, విద్యార్థులకు మధ్య వాగ్వాదం జరిగింది. తోపులాట చోటు చేసుకుంది. గేట్లు ఎక్కి కలెక్టరేట్‌లోకి చొచ్చుకువెళ్లేందుకు విద్యార్థుల ప్రయత్నం చేశారు. 200 మంది విద్యార్థులను అరెస్ట్ చేసిన పోలీసులు నగరంలోని వివిధ పోలీసు స్టేషన్ లకు తరలించారు.


నెల్లూరులో ఉద్రిక్తం


నెల్లూరు జిల్లాలోనూ సేమ్‌ సీన్స్ కనిపించాయి. జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని, నోటిఫికేషన్లు విడుదల చేయాలని కోరుతూ నిరుద్యోగులు, విద్యార్థి సంఘాలు చలో కలెక్టరేట్‌కు పిలుపునిచ్చాయి.  వాళ్లను ఎక్కడికక్కడ కట్టడి చేశారు పోలీసులు. విద్యార్థి సంఘాలు నిరసన ప్రదర్శనకు బయల్దేరక ముందే నగరంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇటీవల ఉద్యోగుల నిరసన ర్యాలీల ప్రభావంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. విద్యార్థి సంఘాలు రోడ్డుపైకి వచ్చిన వెంటనే అరెస్ట్ చేశారు. తెలుగుదేశం పార్టీ తరపున తెలుగు యువత నాయకులు పార్టీ కార్యాలయం నుంచి బయటకి ప్రదర్శనగా రాగా.. అక్కడే పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కి తరలించారు. 


ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 60 నుంచి 62కు పెంచిన ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ వెంటనే రిలీజ్ చేయాలని ఏపీ నిరుద్యోగ జేఏసీ పిలుపునిచ్చింది. ఈ డిమాండ్‌తో విశాఖ కలెక్టరేట్‌ను ముట్టడించడానికి ప్రయత్నించారు నిరుద్యోగ,విద్యార్థి సంఘ నేతలు. వాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో వైజాగ్ కలక్టరేట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది.


చిత్తూరులో సేమ్ సీన్స్ 


నిరుద్యోగ జేఏసీ, టీడీపీ తెలుగు యువత, విద్యార్థి సంఘాలు చేపట్టిన చలో కలెక్టరేట్‌ కార్యక్రమం చిత్తూరు జిల్లాలో ఉద్రిక్తంగా మారింది. ముట్టడికి వెళ్తున్న ఆందోళనకారులను పోలీసులు ఎక్కడికక్కడ ముందస్తుగా అరెస్టులు చేశారు. పోలీసులు నుంచి తప్పించుకుని ఆందోళనకారులు కలెక్టరేట్ చేరుకున్నారు. 


కలెక్టర్ కార్యాలయానికి చేరుకునే  ప్రయత్నం చేయగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. రెండు వర్గాల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు వారిని బలవంతంగా అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.. అరెస్టు అయిన వారిలో రాష్ట్ర టిడిపి తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు, చిత్తూరు పార్లమెంట్ తెలుగు యువత అధ్యక్షుడు కాజూరు రాజేష్ ,తిరుపతి పార్లమెంట్ తెలుగు యువత అధ్యక్షుడు రవి నాయుడు  ఉన్నారు..


కడపలో విద్యార్థులను ఈడ్చేసిన పోలీసులు


ఏపీ ప్రభుత్వంలోని పలు శాఖలలో ఖాళీగా ఉన్న 2.3 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ  కడప లో విద్యార్థి సంఘాలు చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తతలకు దారి తీసింది. ఎక్కడికక్కడ విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. పలుచోట్ల కలెక్టర్ కార్యాలయాలకు ర్యాలీగా వెళ్తున్న విద్యార్థి నాయకులను అదుపులోకి తీసుకున్నారు. ర్యాలీలో పాల్గొన్న ఆందోళనకారులను పోలీసులు ఈడ్చుకెళ్లారు. 
జాబ్ క్యాలెండర్ విడుదల చేసే వరకు ఉద్యమాలు ఆపేది లేదని విద్యార్థి సంఘాలు స్పష్టం చేశాయి. కడప కలెక్టరేట్ వద్ద విద్యార్థి సంఘాల నాయకులను అరెస్ట్ చేసి స్టేషన్లకు తరలించారు. సీఎం జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని లేని పక్షంలో సీఎం క్యాంపు ఆఫీస్, ఎమ్మెల్యేల కార్యాలయాలు ముట్టడిస్తామని వారు హెచ్చరించారు.


గుంటూరులో విద్యార్థులు గరం గరం 


ఆంధ్ర ప్రదేశ్ ఉద్యోగ సాధన సమితి ఆధ్వర్యంలో పలు విద్యార్థి యువజన సంఘాలు నాయకులు గుంటూరు జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ ధర్నాకు అనుమతి లేదంటూ పోలీసులు కలెక్టరేట్ లోకి వెళ్లకుండా విద్యార్థి యువజన సంఘాలను అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు విద్యార్థి, యువజన సంఘాల నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. వారిని అరెస్ట్ చేసి పలు పోలీస్ స్టేషన్లకు తరలించారు. 


ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సాధన సమితి నాయకులు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల 35 వేల పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రతి సంవత్సరం వార్షిక జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలన్నారు. డీఎస్సీ, టెట్, గ్రూప్- వన్, గ్రూప్- టూ, ఉపాధ్యాయ, పోలీసు శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయాలన్నారు. తమ డిమాండ్లు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా అరెస్టు చేసిన విద్యార్థి యువజన సంఘాల నేతలను టిడిపి,కాంగ్రెస్, వామపక్షాల నేతలు కలిసి,తమ సంఘీభావం తెలిపారు.