Undavalli On chiru : సినిమా ఇండస్ట్రీ నిజంగా పిచ్చుకే కానీ చిరంజీవి కాదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమర్ స్పష్టం చేశారు. విభజన సమయంలో పార్లమెంట్‌లో చిరంజీవి గట్టిగా మాట్లాడారని.. చిరంజీవి మాట్లాడటం వల్లే హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా వచ్చిందని స్పష్టం చేశారు. హోదాపై పోరాడాలని మంత్రులకు సలహా ఇవ్వడం తప్పు కాదన్నారు. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఉండవల్లి అరుణ్ కుమార్.. చిరంజీవిపై ఏపీ మంత్రులు చేస్తున్న విమర్శలను ఖండించారు. రాష్ట్ర విభజన సమయంలో కేంద్రమంత్రిగా ఉన్న చిరంజీవి పార్లమెంట్‌లో గట్టిగా మాట్లాడటం వల్లే హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా వచ్చిందన్నారు.
కేంద్రంలో మంత్రిగా ఉండి సొంత పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడారన్న ఉండవల్లి
స్వయంగా కేంద్రంలో మంత్రిగా ఉండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం సాధారణ విషయం కాదన్నారు. కానీ చిరంజీవి సొంత పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడారన్నారు. అలాంటి చిరంజీవి ప్రత్యేక హోదా కోసం ఏపీ మంత్రులు పోరాటం చేయాలని సలహా ఇవ్వడంలో ఏమాత్రం తప్పులేదని ఉండవల్లి స్పష్టం చేశారు. రెండు రోజుల కిందట చిరంజీవి వాల్తేరు వీరయ్య రెండు వందల రోజుల వేడుకలో ఏపీ ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేశారు.
సినీ పరిశ్రమను పదే పదే ఎందుకు టార్గెట్ చేస్తారని.. ప్రజలకు పనికొచ్చే వాటిపై దృష్టి పె ట్టాలని చిరంజీవి సలహా
పిచ్చుకపై బ్రహ్మాస్త్రంలా సినీ పరిశ్రమపై పడతారెందుకని.. ప్రజలకు ఉపయోగపడే ప్రత్యేకహోదా వంటిపై పోరాడితే.. ప్రజలు దండం పెడతారన్నారు. అయితే ఇలా సలహా ఇవ్వడంపై వైఎస్ఆర్‌సీపీ మంత్రులు విరుచుకుపడ్డారు. కొడాలి నానితో పాటు పేర్ని నాని, గుడివాడ అమర్నాథ్, రోజా వంటి నేతలు రాష్ట్రాన్ని విభజించేటప్పుడు చిరంజీవి కేంద్రమంత్రిగా ఉన్నారన్నారు. అప్పుడు ఆయన ఏం చేశారని ప్రశ్నించారు. దీనికి ఉండవల్లి అరుణ్ కుమర్ చిరంజీవికి మద్దతుగా మాట్లాడారు.
మార్గదర్శిపై కక్షతో చేసిన తప్పు లేదన్న ఉండవల్లి
మరో వైపు మార్గదర్శి విషయంలో ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నా తప్పు లేదని ఉండవల్లి వ్యాఖ్యానించారు. 'విదేశాలకు కళాంజలి కళాకృతులు' అంటూ పత్రికలో రాసినందుకు సీనియర్ పాత్రికేయుడు ఏబీకే ప్రసాద్‌పై రామోజీరావు కేసు పెట్టారన్నారు. కళాంజలి పేరుతో చారిత్రక వస్తుువులను స్మగ్లింగ్ చేస్తున్నారని రాయడంతో ఈ కేసు పెట్టారని.. ఈ కేసులో రామోజీపై పోరాడలేక ఏబీకే ఫైన్ కట్టి బయటపడ్డారన్నారు. డబ్బులు ఉంటేనే కోర్టులో న్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ప్రభుత్వం సహకరిస్తోంది కాబట్టే మార్గదర్శిపై పోరాటం చేస్తున్నట్లు ఉండవల్లి చెప్పుకొచ్చారు.