Tirumala News: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 22వ తేదీన ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని.. ఉగాది ఆస్థానాన్ని నిర్వహించబోతున్నట్లు టీటీడీ ప్రకటించింది. శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా జరిపబోతున్నట్లు వెల్లడించారు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని సుప్రభాత సేవ అనంతరం ఆలయాన్ని శుద్ధి చేయనున్నారు. ఉదయం 6 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత స్రీ మలయప్ప స్వామికి, విష్వక్సేనులకి విశేష సమర్పణ చేస్తారు. ఉదయం 7 గంటల నుంచి 9 గంటల మధ్య విమాన ప్రాకారం, ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోకి ప్రవేశిస్తారు. ఆ తర్వాత శ్రీవారి మూల విరాట్టుకు, ఉత్సవ మార్తులకు నూతన వస్త్రాలను ధరింపజేస్తారు. అనంతరం పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. ఉగాది ఆస్థానాన్ని బంగారు వాకిలి వద్ద ఆగమ పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారని టీటీడీ వెల్లడించింది. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మార్చి 22వ తేదీన శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జిత బ్రహ్మోత్సవం, కల్యాణోత్సవం, ఊంజల్ సేవను టీటీడీ రద్దు చేసింది. ఈనెల 21, 22వ తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేయడమే కాకుండా... ఎలాంటి సిఫార్సు లేఖల స్వీకరించబోమని స్పష్టం చేసింది. భక్తులు ఈ విషయాలను గుమనించి సహకరించాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేసింది.  


తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. నిన్న హుండీ ఆదాయం ఎంతంటే


శ్రీనివాసుడి సన్నిధిలో భక్తుల రద్దీ తగ్గింది. శ్రీనివాసుడికి ప్రతి రోజు ఒక్కో రకమైన ప్రసాదాన్ని నైవేద్యంగా నివేదిస్తారు అర్చకులు. ఇక బుధవారం నాడు బెల్లంతో తయారు చేసిన పాయసంను అర్చకులు స్వామి వారి నైవేద్యంగా మొదటి గంటాలో సమర్పిస్తారు. మంగళవారం రోజున 59,751 మంది స్వామి వారి దర్శించుకున్నారు. ఇక స్వామి వారికి 20,177 మంది తలనీలాలు సమర్పించగా, 3.80 కోట్ల రూపాయలు భక్తులు హుండీ ద్వారా కానుకలుగా సమర్పించారు. ఇక వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు ఖాళీగా ఉండడంతో భక్తులను నేరు శ్రీవారి దర్శనంకు టీటీడీ అనుమతిస్తుంది. ఇక ఉదయం ఏడు గంటలకు పైగా వచ్చిన టైం స్లాట్ టోకెన్లు లేని సర్వదర్శనం భక్తులకు మాత్రం 12 గంటల సమయం పడుతుంది. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనంకు మూడు గంటల సమయం పడుతుంది.  


శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీ వేంకటేశ్వరుడికి కైంకర్యాలు నిర్వహిస్తున్నారు అర్చకులు. ఇందులో‌ భాగంగా బుధవారం ప్రత్యూషకాల ఆరాధనతో ఆలయ ద్వారముకు తెరిచిన అర్చకులు. బంగారు వాకిలి వద్ద శ్రీ వేంకటేశ్వర సుప్రభాత స్త్రోతంతో స్వామి వారిని మేలు కొలిపారు. అనంతరం  తోమాల, అర్చన సేవలు నిర్వహించిన అర్చకులు. ప్రాతఃకాల ఆరాధనలో‌ భాగంగా స్నపన మండపంలో శ్రీకొలువు శ్రీనివాసమూర్తిని వారి సమక్షంలో దర్భార్ నిర్వహించారు. శ్రీవారికి పంచాంగ శ్రవణం,హుండీ జనాకర్షణ విన్నవించి, బెల్లంతో  కలిపిన నువ్వుల పిండిని స్వామి వారిని నైవేద్యంగా సమర్పించారు. నవనీత హారతి సమర్పించి అనంతరం శ్రీనివాసమూర్తిని తిరిగి సన్నిధిలో వేంచేపు చేసారు. ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా మొదటి ఘంటా నివేదనలో అన్నప్రసాదం, లడ్డూ, వడలు సమర్పించగా, ఇక బుధవారం నాడు "బెల్లం పాయసం" ను స్వామి వారికి నైవేద్యంగా సమర్పించారు.