Post Office Scheme: ఇండియన్ పోస్ట్ ఆఫీస్ ద్వారా అనేక రకాల పెట్టుబడి లేదా పొదుపు పథకాలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. పోస్ట్‌ ఆఫీస్‌లో ఒక ఖాతా తీసుకుని చిన్న మొత్తాల్లో పొదుపును ప్రారంభించవచ్చు. ఇవి కేంద్ర ప్రభుత్వం ద్వారా రన్‌ అయ్యే పథకాలు కాబట్టి, వీటిలో మీ పెట్టుబడి నూటికి నూరు శాతం సురక్షితం. పోస్టాఫీస్‌ పథకాల్లో డిపాజిట్ చేసిన మొత్తంపై మంచి పన్ను రాబడితో పాటు ఆదాయ పన్నును ఆదా చేసుకునే అవకాశాన్ని కూడా ప్రజలు పొందుతారు. 


ఈ రోజు మనం తెలుసుకోబోతున్న పోస్ట్ ఆఫీస్ పథకం కూడా ఆదాయ పన్ను భారాన్ని తగ్గిస్తుంది. దాంతో పాటు 7 శాతం రాబడిని కూడా తెచ్చి ఇస్తుంది. ఈ పథకం మెచ్యూరిటీ పిరియడ్‌ 5 సంవత్సరాలు. అంటే, ఇది పోస్టాఫీసు టర్మ్ డిపాజిట్ స్కీమ్‌. వివిధ మెచ్యూరిటీ కాలాల ఆప్షన్లు కూడా ఈ టర్మ్‌ డిపాజిట్‌ కింద అందుబాటులో ఉన్నాయి.


టర్మ్ డిపాజిట్‌పై ఎంత వడ్డీ లభిస్తుంది?
వివిధ కాల పరిమితుల ప్రకారం, ఈ టర్మ్ డిపాజిట్‌ మీద 6.6 శాతం నుంచి 7 శాతం వరకు వడ్డీ లభిస్తుంది. ఒక సంవత్సర కాల డిపాజిట్ మీద 6.6 శాతం వడ్డీ, రెండు సంవత్సరాల డిపాజిట్‌ మీద 6.8 శాతం వడ్డీ, మూడు సంవత్సరాల డిపాజిట్‌ మీద 6.9 శాతం వడ్డీ లభిస్తుంది. ఐదేళ్ల కాలానికి మీరు డిపాజిట్‌ చేస్తే 7 శాతం వడ్డీని పోస్టాఫీసు చెల్లిస్తుంది.


ఏ కాల డిపాజిట్‌పై ఆదాయ పన్ను క్లెయిమ్‌ చేసుకోవచ్చు?
పోస్టాఫీస్‌ టర్మ్ డిపాజిట్లు 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాల మెచ్యూరిటీతో అందుబాటులో ఉన్నాయని చెప్పుకున్నాం కదా. వీటిలో... 5 సంవత్సరాల టర్మ్ డిపాజిట్‌ మీద మాత్రమే మీకు ఆదాయ పన్ను ప్రయోజనం లభిస్తుంది, దీనిని మాత్రమే మీరు క్లెయిమ్‌ చేసుకోగలరు. ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు లభిస్తుంది.


ఎంత పన్ను ఆదా అవుతుంది?
ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 80C కింద ఒకటిన్నర లక్షల రూపాయల వరకు ఆదాయ పన్నును ఆదా చేసుకోవచ్చు. ఇది ప్రముఖ పన్ను ఆదా ఆప్షన్‌. అనేక ప్రభుత్వ రంగ పెట్టుబడి పథకాలకు కూడా ఈ సెక్షన్‌ వర్తిస్తుంది. 


NSC పథకంలో 7% వడ్డీ ఆదాయం
పోస్టాఫీస్‌ ద్వారా అందుబాటులో ఉన్న మరో పథకం నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (National Saving Certificate - NSC). దేశంలోని ఏ పోస్టాఫీసు నుంచైనా ఈ స్కీమ్‌లో జాయిన్‌ కావచ్చు. పైగా, కేంద్ర ప్రభుత్వం ఈ పథకం వడ్డీ రేట్లను ఇటీవలే పెంచింది. డిసెంబర్ 2022 వరకు, ఈ పథకం కింద 6.8 శాతం వడ్డీ రేటును పెట్టుబడిదార్లకు అందించారు, ఇప్పుడు అది 7 శాతానికి పెరిగింది. NSCలో పెట్టుబడి ద్వారా మంచి రాబడితో పాటు, పన్ను ఆదా ప్రయోజనాన్ని (Tax Saving Benefit) కూడా మీరు పొందవచ్చు. ఈ పథకంలో పెట్టుబడులకు, ఆదాయపు పన్ను సెక్షన్ 80C కింద రూ. 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది.


మీరు ఆదాయ పన్ను మినహాయింపు పొందాలనుకుంటే, ఈ నెలే చివరి అవకాశం. కాబట్టి, మార్చి 31 లోపు పన్ను ప్రణాళిక వేసుకోవడం చాలా ముఖ్యం.