Vande Bharat Trains From Secunderabad To Visakha: తెలుగు రాష్ట్రాల ప్రయాణికులు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. సికింద్రాబాద్ (Secunderabad) నుంచి విశాఖకు (Visakha) మరో వందే భారత్ రైలు నడపనుంది. అలాగే, భువనేశ్వర్ - విశాఖ - భువనేశ్వర్ కు సైతం ఈ రైళ్లను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ నెల 12న ప్రధాని మోదీ ఈ రైళ్లను వర్చువల్ గా ప్రారంభించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్య నగరాలైన సికింద్రాబాద్, విశాఖకు ఇప్పటికే ఓ వందే భారత్ రైలు నడుస్తోంది. విశాఖ - సికింద్రాబాద్ - విశాఖ తొలి వందే భారత్ 2023, జనవరి 15న ప్రారంభమైంది. ఈ రైలు ఉదయం 5:45 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2:15 గంటలకు సికింద్రాబాద్ చేరుకుని తిరిగి 3 గంటలకు బయలుదేరి రాత్రి 11:30 గంటలకు విశాఖ చేరుతుంది. ఈ ట్రైన్ కు ప్రయాణికుల నుంచి ఊహించని స్పందన వస్తోంది. వంద శాతం ఆక్యుపెన్సీతో రిజర్వేషన్ కూడా దొరకని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈ రూట్ లో మరో రైలును నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ప్రస్తుతం విశాఖ - సికింద్రాబాద్ - విశాఖ వందేభారత్ 16 బోగీలతో నడుస్తుండగా.. కొత్త రైలును 8 బోగీలతో మాత్రమే నడపనున్నారు. 


కొత్త వందే భారత్ టైమింగ్స్ 


ప్రయాణికుల రద్దీ, ఆక్యుపెన్సీ దృష్ట్యా సికింద్రాబాద్ నుంచి విశాఖకు మరో వందేభారత్ రైలుకు రైల్వే శాఖ ఆమోదం తెలపగా.. త్వరలోనే  ఈ రైలు పట్టాలెక్కనుంది. ట్రైన్ నెంబర్ 20707/20708 సికింద్రాబాద్ - విశాఖ - సికింద్రాబాద్ రైలు గురువారం తప్ప మిగతా అన్ని రోజులూ ప్రయాణికులకు అందుబాటులో ఉండనుంది. ప్రతీ రోజూ ఉదయం 5:05 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1:50 గంటలకు విశాఖ చేరుకుంటుంది. తిరిగి విశాఖ నుంచి మధ్యాహ్నం 2:35 గంటలకు బయల్దేరి రాత్రి 11:20కి సికింద్రాబాద్ స్టేషన్ చేరుకుంటుంది. తెలంగాణలోని వరంగల్, ఖమ్మం.. ఏపీలోని విజయవాడ, రాజమహేంద్రవరం, సామర్లకోట స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది.


పూరీ - విశాఖ - పూరీకి వందేభారత్


విశాఖ నుంచి పూరీకి వందే భారత్ రైలు అందుబాటులోకి రానుంది. ఈ రైలు (20841/20842) సోమవారం మినహా మిగిలిన రోజులు నడవనుంది. ప్రతి రోజూ ఉదయం 5:15 గంటలకు పూరీలో బయలుదేరి ఉదయం 11:30 గంటలకు విశాఖ వస్తుంది. తిరిగి విశాఖ నుంచి మధ్యాహ్నం 3:40 గంటలకు బయలుదేరి రాత్రి 9:55 గంటలకు పూరీ చేరుకుంటుంది. ఈ రైలుకు 8 బోగీలు ఉంటాయి. 443 కిలో మీటర్ల దూరాన్ని సుమారు 5 గంటల్లోనే చేరుకుంటుంది. విశాఖ నుంచి సికింద్రాబాద్ మధ్య నడుస్తోన్న వందేభారత్ రైలులో ఉండే ఛార్జీలే దీనికి వర్తింపచేస్తారని వాల్తేరు రైల్వే అధికారులు తెలిపారు.


పూరీ నుంచి విశాఖకు వచ్చే వందేభారత్ రైలు ఖుర్దారోడ్ (ఉదయం 5:33 గంటలకు), బరంపూర్ (ఉదయం 7:05 గంటలకు), ఇచ్ఛాపురం (ఉదయం 7:18 గంటలకు), పలాస (ఉదయం 8:18 గంటలకు), శ్రీకాకుళం రోడ్ (ఉదయం 9:03 గంటలకు), విజయనగరం  (ఉదయం 09:48 గంటలకు)స్టేషన్లలో ఆగుతుంది. అలాగే, విశాఖ నుంచి పూరీ వెళ్లే వందేభారత్ రైలు విశాఖలో మధ్యాహ్నం 03:45 గంటలకు బయలుదేరి 4:30 గంటలకు విజయనగరం చేరుతుంది. సాయంత్రం 5:28 గంటలకు శ్రీకాకుళం రోడ్, 6:30 గంటలకు పలాస, రాత్రి 7 గంటలకు ఇచ్ఛాపురం, 7:20 గంటలకు బరంపూర్, రాత్రి 8:57 గంటలకు ఖుర్దారోడ్, రాత్రి 9:30 గంటలకు భువనేశ్వర్ చేరుకుంటుందని.. ప్రతీ స్టేషన్ లోనూ ఈ రైలు 2 నిమిషాలు ఆగుతుందని అధికారులు తెలిపారు.


Also Read: Daggubati Purandeswari: 'దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసమే పొత్తులు' - ఒకట్రెండు రోజుల్లో సీట్లపై స్పష్టత వస్తుందన్న పురంధేశ్వరి