ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని.. ఈ నెల 13 నుంచి పదిరోజులపాటు.. వైకుంఠ ద్వారా దర్శనం.. కల్పించనున్నట్టు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. సామాన్య భక్తులకు..  ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందన్నారు. పది రోజులపాటు.. ఎలాంటి సిఫార్సు లేఖలు తీసుకోమని.. స్పష్టం చేశారు. స్వయంగా వస్తేనే.. ప్రముఖులకు టికెట్స్ కేటాయిస్తామని స్పష్టం చేశారు వైవీ సుబ్బారెడ్డి. కొన్ని పనుల కారణంగా.. తిరుమలలో గదుల కొరత ఉందని చెప్పారు. ప్రజాప్రతినిధులకు నందకం, వకుళామాత వసతి సముదాయాల్లో గదులు ఉంటాయని పేర్కొన్నారు.  
 
జ‌న‌వ‌రి 11 నుంచి 14వ తేదీ వ‌ర‌కు వ‌స‌తి గ‌దుల అడ్వాన్స్ రిజ‌ర్వేష‌న్‌ ర‌ద్దు చేయ‌డ‌మైన‌ది. శ్రీ‌వారి ద‌ర్శనానికి విచ్చేసే సామాన్య భ‌క్తుల‌ వ‌స‌తికి పెద్దపీట వేస్తూ తిరుమ‌ల‌లోని అన్ని గ‌దుల‌ను క‌రెంటు బుకింగ్ ద్వారా కేటాయించాల‌ని టీటీడీ నిర్ణయించింది. జ‌న‌వ‌రి 11 నుంచి 14వ తేదీ వరకు దాతల‌కు గదుల‌ కేటాయింపు ప్రివిలేజ్ ఉండదని తెలిపింది. తల‌నీలాలు తీసేందుకు తగినంత మంది క్షురకుల‌ను అందుబాటులో ఉంచామని వెల్లడించింది. కోవిడ్‌-19 నిబంధనలు పాటిస్తూ క్షురకులు పీపీఈ కిట్లు, ఆప్రాన్లు వినియోగిస్తారన్నారు. అన్నప్రసాద భవనంలో కోవిడ్‌-19 నిబంధనలు పాటిస్తూ ఉదయం 4 నుంచి రాత్రి 12 గంటల‌ వరకు వితరణ ఉంటుందని పేర్కొంది. భక్తుల‌కు వైద్య సేవ‌లు అందించేందుకు అవసరమైన ప్రాంతాల్లో వైద్య బృందాలు అందుబాటులో ఉంటాయని వివరించింది. తిరుమల‌లో పోలీసుల‌తో సమన్వయం చేసుకుని ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా వాహనాలు పార్కింగ్‌ ప్రాంతాల‌కు చేరేలా ఏర్పాట్లు చేశామని తెలిపింది.  
 
'కోవిడ్-19 మూడో వేవ్ ఒమిక్రాన్ రూపంలో దేశ వ్యాప్తంగా విస్తరిస్తున్న నేప‌థ్యంలో ఇటీవ‌ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరిక‌లు జారీ చేశాయి. అదేవిధంగా, కొన్ని ప‌ట్టణాల్లో రాత్రి క‌ర్ఫ్యూ కూడా విధించారు. ఈ నేప‌థ్యంలో భ‌క్తులు పర్వదినాల్లోనే కాకుండా మిగతా అన్ని రోజుల్లోనూ వ్యాక్సినేష‌న్ సర్టిఫికేట్ కానీ, దర్శనానికి 48 గంటల ముందు చేసుకున్న ఆర్‌టీపీసీఆర్ పరీక్ష నెగిటివ్ సర్టిఫికేట్ త‌ప్పనిస‌రిగా తీసుకురావాలి. టీటీడీ ఉద్యోగులు, వేలాది మంది సహభక్తుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని భక్తులు టీటీడీ విజిలెన్స్, సెక్యూరిటీ సిబ్బందికి స‌హ‌క‌రించాలి' అని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. 


Also Read: Vangaveeti Radha Issue: టీడీపీ హయాంలోనే రంగా హత్య... రాధా హత్యకు రెక్కీపై ఆధారాలు ఇస్తే దర్యాప్తు చేస్తాం... మంత్రి వెల్లంపల్లి కీలక వ్యాఖ్యలు


Also Read: Minister Mekapati Humanity: న్యూ ఇయర్ సర్‌ప్రైజ్.. అనాథ బాలుడి ఇంటికి అనుకోని అతిథిగా మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి


Also Read: APSRTC: ఆర్టీసీ టికెట్లు ఇలా బుక్ చేసుకుంటే ఇక జీఎస్టీ కట్టాల్సిందే.. ఈ పద్ధతిలో అయితే సేఫ్!