తిరుమలకు పుణ్యక్షేత్రానికి నిత్యం లక్షల సంఖ్యలో భక్తులు దేశ విదేశాల నుంచి శ్రీవారి దర్శనార్ధం వస్తుంటారు. తిరుమలకు వచ్చిన భక్తులకు వివిధ రూపాల్లో టీటీడీ దర్శనాలు కల్పిస్తుంది. అయితే సర్వదర్శనం, దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం, వీఐపీ బ్రేక్ దర్శనం, శ్రీవాణి ట్రస్టు, ఆర్జీత సేవల ద్వారా భక్తులు స్వామి వారిని దర్శించుకుంటారు. కరోనా మహమ్మారి ముందు వరకూ ఈ పద్దతిలో దర్శనాలు సాగాయి. కోవిడ్ వచ్చాక తిరుమలలో పరిస్థితులు మారిపోయాయి. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులను స్వామి వారి దర్శనానికి అనుమతిస్తుంది. పరిమిత సంఖ్యలో ఆన్లైన్ లో విడుదల చేసిన ప్రత్యేక ప్రవేశ దర్శనం, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారుల సిపార్సు లేఖలు, శ్రీవాణి ట్రస్టు, వర్చువల్ ఆర్జీత సేవా టిక్కెట్లు కలిగిన భక్తులను తిరుమలకు అనుమతిస్తుంది. కోవిడ్ మహమ్మారి కారణంగా సర్వదర్శనాన్ని టీటీడీ గత ఏడాది సెప్టెంబరు 25వ తేదీ నుంచి పూర్తిగా నిలిపివేసింది.
తిరుమలకు చేరుకుని అఖిలాండం వద్ద నుంచి స్వామి వారిని ప్రార్ధించాలనే ఉద్దేశంతో కొందరు భక్తులు తిరుపతికి చేరుకుంటున్నారు. ఇలా తిరుపతికి చేరుకున్న భక్తులు అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద విజిలెన్స్ సిబ్బంది నిలిపివేస్తుంది. దీంతో సామాన్య భక్తులు ఏమి చేయలేక తీవ్రంగా మనోవేదనకు గురై తిరిగి వారి గమ్యస్థలానికి చేరుకుంటున్నారు. మరికొందరైతే కోవిడ్ సమయంలో స్వామి వారి దర్శనం పొందలేక పోతున్నామే అని బాధకు గురవుతున్నారు. అయితే టీటీడీ ఈవో, టీటీడీ ఛైర్మన్ కు ఫోన్ ద్వారా, విన్నతి పత్రాల రూపంలో సామాన్య భక్తులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆన్ లైన్ ద్వారా సర్వసర్శనం టిక్కెట్లను రోజుకు 15 వేల టోకెన్ల చొప్పున ఈ నెల 16వ తేదీ నుంచి సర్వదర్శనాన్ని టీటీడీ పునః ప్రారంభించింది.
కోవిడ్ వ్యాప్తి కారణంగా తిరుపతిలో ఆఫ్ లైన్ ద్వారా సర్వ దర్శనం టోకెన్లు జారీ విధానాన్ని గత ఏడాది సెప్టెంబర్ 25వ తేదీ నుంచి రద్దు చేసింది టీటీడీ. ప్రస్తుతం ఆన్లైన్లో సర్వ దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నప్పటికీ అవి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సామాన్య భక్తులకు అందడం లేదన్నది భక్తుల ఆవేదన. ఈ క్రమంలో సామాన్య భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా తిరుపతిలో ఆఫ్ లైన్ విధానంలో సర్వ దర్శనం టోకెన్లు జారీ చేయాలని అనేకసార్లు భావించిన కోవిడ్ తీవ్రత కారణంగా వాయిదా వేస్తూ వచ్చింది టీటీడీ. అయితే ప్రస్తుతం కోవిడ్ తీవ్రత తగ్గుముఖం పట్టడంతో ఈ నెల ఆఫ్ లైన్ లో ఫిబ్రవరి 16వ తేదీ నుంచి తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, శ్రీ గోవిందరాజస్వామి సత్రాల్లో రోజుకి 15,000 చొప్పున సర్వదర్శనం టోకెన్లను జారీ చేస్తుంది టీటీడీ.
అయితే సామాన్య భక్తుల సౌకర్యార్థం మరికొన్ని టోకెన్లు ఈ నెల 23వ తేదీ నుంచి ప్రత్యేక ప్రవేశ దర్శనం, సర్వదర్శనం టోకెన్లను అదనంగా జారీ చేయనుంది. ఇప్పటి వరకూ ఆన్లైన్ ద్వారా ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లను 12,000 వేల టోకెన్లు జారీ చేస్తుండగా.. ఈ నెల 24వ తేదీ నుంచి 28వ తేదీ వరకూ అదనంగా రోజుకి 13,000 చొప్పున టిక్కెట్లు జారీ చేయనుంది. అదే విధంగా ఫిబ్రవరి 26వ తేదీ నుండి 28వ తేదీ వరకు అదనంగా రోజుకు 5,000 వేల చొప్పున సర్వదర్శనం టోకెన్లను ఆఫ్ లైన్ లో తిరుపతిలోకి భూదేవి, శ్రీనివాసం, శ్రీ గోవిందరాజ స్వామి సత్రాల్లో భక్తులకు అందుబాటులో ఉంచనుంది. అయితే మార్చి నెలకు సంబంధించి రోజుకు 25 వేలు చొప్పున రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను ఈనెల 23న ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది టీటీడీ. మార్చి నెలకు సంబంధించి రోజుకు 20 వేలు చొప్పున సర్వదర్శనం టోకెన్లు ఆఫ్‌లైన్‌లో తిరుపతిలోని కౌంటర్ల ద్వారా కేటాయించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది.