TTD Key Decisions: బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఏపీలో రాబోయే 3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ క్రమంలో టీటీడీ అప్రమత్తమైంది. విపత్తు నిర్వహణ ప్రణాళికపై టీటీడీ అడిషనల్ ఈవో సీహెచ్ వెంకయ్యచౌదరితో కలిసి ఈవో శ్యామలరావు వర్చువల్ విధానంలో అధికారులతో సోమవారం నిర్వహించారు. రాగల 36 గంటల్లో భారీ వర్ష సూచనపై సమావేశంలో చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా శ్రీవారి ఆలయంలో ఈ నెల 15న సిఫార్సు లేఖలు అనుమతించకూడదని.. ఈ నెల 16వ తేదీన బ్రేక్ దర్శనాలు రద్దు చేయాలని నిర్ణయించారు. భక్తుల భద్రత దృష్ట్యా బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ఈవో తెలిపారు. అధికారులందరూ విపత్తును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఈవో సూచించారు.
ఘాట్ రోడ్లపై ట్రాఫిక్ జామ్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఈవో సిబ్బందికి సూచించారు. విద్యుత్ సరఫరా అంతరాయం లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. 'విద్యుత్ అంతరాయం ఏర్పడితే జనరేటర్లు నడపడానికి ముందస్తు జాగ్రత్తగా తగినంత డీజిల్ అందుబాటులో ఉంచుకోవాలి. ఐటీ విభాగం వారు భక్తులకు వసతి, దర్శనం, ప్రసాదాల తయారీ కార్యకలాపాలకు ఆటంకం లేకుండా ప్రత్యమ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి. వైద్య ఆరోగ్య శాఖ అంబులెన్సులను అందుబాటులో ఉంచుకుని అప్రమత్తంగా ఉండాలి. ఇంజినీరింగ్ విభాగం వారు డ్యామ్ గేట్లను పర్యవేక్షించాలి. ట్రాఫిక్ పోలీసులు ఇంజినీరింగ్ సిబ్బందితో సమన్వయం చేసుకోవాలి. ఏదైనా విపత్కర పరిస్థితి ఎదురైతే వేగంగా స్పందించేందుకు అగ్నిమాపక సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. ఎస్వీబీసీ, మీడియా, టీటీడీ సోషల్ మీడియా ద్వారా వాతావరణ పరిస్థితులపై ఎప్పటికప్పుడు విస్తృతంగా ప్రచారం చేస్తూ భక్తులను అప్రమత్తం చేయాలి.' అని అధికారులను ఈవో నిర్దేశించారు.
ఈవో కీలక సూచనలు
2021లో భారీ కొండ చరియలు విరిగిపడిన ఘటనతో టీటీడీ 700 పేజీల విపత్తు నిర్వహణ ప్రణాళిక రూపొందించిందని ఈవో శ్యామలవారు తెలిపారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఈ ప్రణాళిక మరింత మెరుగు పరచాల్సిన అవసరం ఉందని అధికారులకు చెప్పారు. ఈవో స్థాయిలో విపత్తుల నివారణ ఎగ్జిక్యూటివ్ కమిటీ, అడిషనల్ ఈవో ఆధ్వర్యంలో విపత్తు నిర్వహణ సమన్వయ కమిటీ ఉందన్నారు. అగ్నిమాపక శాఖ, ఆరోగ్య శాఖ, విజిలెన్స్ విభాగం, ఇతర కీలకమైన శాఖల విభాగాధిపతులు తమ సిబ్బందితో డిజాస్టర్ మేనేజ్మెంట్ రెస్పాన్స్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
తిరుమలలో భారీ వర్షం
మరోవైపు, సోమవారం ఉదయం నుంచి అల్పపీడన ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తిరుమలలోనూ ఎడతెరిపి లేని వర్షంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆలయ పరిసరాలు, మాడ వీధులు నీటితో నిండిపోయాయి. షెడ్లు ఖాళీ అయిన వెంటనే భక్తులను లోపలికి పంపుతామని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా టీటీడీ చర్యలు చేపట్టింది. ఏపీవ్యాప్తంగానూ వర్షాలతో అధికారులు అప్రమత్తమయ్యారు.