IAS Officers Filed Petition In CAT: ఏపీ, తెలంగాణ ఐఏఎస్ అధికారులు కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్‌ను (CAT) ఆశ్రయించారు. పునర్విభజన చట్టం ప్రకారం వారికి కేటాయించిన రాష్ట్రాల్లో రిపోర్ట్ చేయాలని ఇటీవలే డీవోపీటీ (డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగం) ఆదేశాలు జారీ చేయగా.. వీటిని సవాల్ చేస్తూ క్యాట్‌ను ఆశ్రయించారు. ఈ మేరకు ఐఏఎస్ అధికారులు వాకాటి కరుణ, వాణిప్రసాద్, ఆమ్రపాలి, సృజన వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. డీఓపీటీ ఇచ్చిన ఉత్తర్వులు రద్దు చేయాలని.. తెలంగాణలోనే కొనసాగేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ముగ్గురు ఐఏఎస్‌లు వాకాటి కరుణ, వాణిప్రసాద్, ఆమ్రపాలి కోరారు. ఏపీలోనే కొనసాగేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ఐఏఎస్ సృజన కోరారు. వీరి పిటిషన్లపై కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ మంగళవారం విచారణ చేపట్టనుంది.
ఏపీకి కేటాయించి తెలంగాణలో (Telangana) కొనసాగుతోన్న వారిలో ఐఏఎస్ అధికారులు వాణీప్రసాద్, వాకాటి కరుణ, రొనాల్డ్ రోస్, ఆమ్రపాలి, ప్రశాంతి.. ఐపీఎస్ అధికారులు అంజనీకుమార్, అభిలాష్ బిస్త్, అభిషేక్ మహంతి ఉన్నారు. అటు, ఏపీ నుంచి తెలంగాణకు రావాల్సిన వారిలో ఐఏఎస్ అధికారులు సృజన, శివశంకర్, హరికిరణ్ ఉన్నారు. అలాగే, ఏపీ నుంచి తెలంగాణకు వెళ్లాలని ఎస్.ఎస్.రావత్, అనంతరాములు డీవోపీటీని అభ్యర్థించారు. వీరి అభ్యర్థనలనూ తిరస్కరించగా.. వీరు ఏపీలోనే కొనసాగుతారు.
కేటాయించిన రాష్ట్రాలు వద్దన్న అధికారులు
కాగా, ఉమ్మడి ఏపీ విభజన సమయంలో అధికారులను కేంద్రం ఏపీ, తెలంగాణకు సర్దుబాటు చేసింది. అయితే, వారిలో కొందరు మాత్రం వివిధ కారణాలు చూపుతూ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. తమను తెలంగాణ కేడర్‌కు మార్చాలని కోరారు. ఇదే విషయంపై గతంలో క్యాట్‌ను సైతం ఆశ్రయించగా.. వారికి అనుకూలంగా తీర్పిచ్చింది. అయితే, క్యాట్ తీర్పును వ్యతిరేకిస్తూ కేంద్రం తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారించిన న్యాయస్థానం.. అభ్యర్థనలను మరోసారి పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఈ క్రమంలో కేంద్రం విశ్రాంత ఐఏఎస్ అధికారి దీపక్‌ను (IAS officer Deepak) నియమించి ఆయన ఇచ్చిన నివేదిక ప్రకారం.. అధికారుల అభ్యర్థనను తోసిపుచ్చుతూ తాజాగా ఆదేశాలిచ్చింది. రాష్ట్ర విభజన జరిగినప్పుడు సివిల్ సర్వీస్ అధికారుల్ని విభజించడానికి ఖండేకర్ కమిటీని నియమించి విధి విధానాలు ఖరారు చేశారు. ఆ విధి విధానాల ప్రకారం ప్రత్యూష్ సిన్హా కమిటీ అధికారుల్ని విభజించింది. అయితే తమను ఆయా రాష్ట్రాలకు కేటాయించడంపై పలువురు క్యాట్‌తో పాటు కోర్టుల్లో న్యాయపోరాటం చేశారు. చివరికి కోర్టుల్లోనూ వారికి అనుకూల ఫలితం రాలేదు.
ఈ నెల 16వ తేదీలోగా కేటాయించిన రాష్ట్రాలకు వెళ్లిపోవాలని డీవోపీటీ ఆదేశాలివ్వగా.. దీనిపై ఐఏఎస్‌లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ ఆదేశాలను రద్దు చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని తాజాగా క్యాట్‌ను ఆశ్రయించారు. దీనిపై మంగళవారం విచారణ జరగనుండగా ఎలాంటి తీర్పు వస్తుందనేది ఉత్కంఠగా మారింది.
Also Read: AP Sand Policy : ఉచిత ఇసుక ఇస్తున్నా విమర్శలు - శాండ్ పాలసీ విషయంలో ఏపీ ప్రభుత్వం తేలిపోయిందా ?