Main Accused Surrendered In TDP Office Attack Case: టీడీపీ కేంద్ర కార్యాలయంపై (TDP Central Office) దాడి కేసులో సోమవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు పానుగంటి చైతన్య (Panuganti Chaitanya) కోర్టులో లొంగిపోయాడు. వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఆయన గతంలో టీడీపీ కార్యాలయంపై దాడిలో ప్రత్యక్షంగా పాల్గొన్నాడనే అభియోగాలను ఎదుర్కొంటున్నాడు. వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పరెడ్డికి చైతన్య ప్రధాన అనుచరుడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. కాగా, వైసీపీ హయాంలో 2021, అక్టోబర్ 19వ తేదీన ఆ పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడికి పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. వైసీపీ నేతలు దేవినేని అవినాష్,లేళ్ల అప్పిరెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి అనుచరులు దాడి చేశారని అభియోగాలు నమోదయ్యాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు.
అటు, ఈ కేసుకు సంబంధించి వైసీపీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, దేవినేని అవినాష్ సోమవారం పోలీసుల విచారణకు హాజరయ్యారు. మంగళగిరి గ్రామీణ పోలీసులు వీరిని విచారించారు. దాడి జరిగిన రోజు వీరంతా ఉదయం ఎక్కడెక్కడ కలిశారు.?, ఏయే ప్రాంతాల్లో సమావేశమయ్యారు.? వంటి వివరాలను ఆరా తీశారు.
సీఐడీకి అప్పగింత
మరోవైపు, కేసు విచారణ మరింత వేగవంతమయ్యేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టీడీపీ ఆఫీసుపై దాడి, అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం చంద్రబాబు నివాసంపై దాడి కేసులను సీఐడీకి అప్పగించింది. ఇప్పటివరకూ మంగళగిరి, తాడేపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేయగా.. సీఐడీకి బదిలీ చేస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకూ కేసుల విచారణకు సంబంధించిన ఫైళ్లను మంగళగిరి డీఎస్పీ సీఐడీకి అప్పగించారు.