TTD Guidelines For Srivari Darshan To Tirupati Locals: తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించాలని ఇటీవలే టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్రతి నెలా మొదటి మంగళవారం వారికి స్వామి దర్శన భాగ్యం కల్పించాలని టీటీడీ (TTD) ఏర్పాట్లు చేసింది. డిసెంబర్ 3వ తేదీ నుంచి స్థానిక భక్తులకు శ్రీవారి దర్శనం (Srivari Darshanam) కల్పించనున్నారు. దీనికి సంబంధించి డిసెంబర్ 2న తిరుపతిలోని మహతి ఆడిటోరియం, తిరుమల బాలాజీనగర్‌లోని కమ్యూనిటీ హాల్‌లో దర్శన టోకెన్లు ఉచితంగా జారీ చేస్తారు. మహతి ఆడిటోరియంలో 2,500 టోకెన్లు, బాలాజీనగర్ కమ్యూనిటీ హాల్‌లో 500 టోకెన్లు ఉదయం 3 గంటల నుంచి 5 గంటల మధ్య జారీ చేయనున్నారు.


మార్గదర్శకాలివే..



  • ముందుగా వచ్చిన వారికే తొలి ప్రాధాన్యత క్రమంలో టోకెన్లు జారీ చేస్తారు. దర్శనం టికెట్ పొందడానికి స్థానికులు తమ ఒరిజినల్ ఆధార్ కార్డు తప్పనిసరిగా చూపించాలి.

  • టోకెన్లు పొందిన భక్తులు దర్శన సమయంలో ఒరిజినల్ ఆధార్ కార్డు తీసుకురావాల్సి ఉంటుంది.

  • వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని ఫుట్‌పాత్ హాల్ (దివ్యదర్శనం) క్యూలైన్‌లో భక్తులను దర్శనాలకు అనుమతిస్తారు.

  • ఇతర దర్శనాల్లో ఇచ్చే విధంగా దర్శనానంతరం ఒక లడ్డూ ఉచితంగా అందిస్తారు. 

  • స్థానికుల కోటాలో దర్శనం చేసుకున్న వారికి తిరిగి 90 రోజుల వరకూ దర్శనం చేసుకునేందుకు అవకాశం ఉండదు.


తిరుమలలో భారీ వర్షాలు


తుపాను ప్రభావంతో తిరుమలలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో రెండో ఘాట్ రోడ్డులో కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో సిబ్బంది ఆ మార్గంలో వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా ఎప్పటికప్పుడు జేసీబీలతో బండరాళ్లను తొలగిస్తున్నారు. భారీ వర్షాలతో తిరుమలలో జలాశయాలు జలకళను సంతరించుకున్నాయి. పాపవినాశనం, ఆకాశగంగ, గోగర్భం, కుమారధార, పసుపుధార జలాశయాలు ప్రధాన నీటి వనరులుగా ఉన్నాయి. వరద నీటి ప్రవాహంతో మొత్తం 5 జలాశయాల్లోకి నీరు చేరుకుంటోంది. గోగర్భం డ్యామ్ పూర్తిగా నిండిపోవడంతో గేట్లను తెరిచి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్ర‌స్తుత నీటి నిల్వ‌లు తిరుమ‌ల‌కు 200 రోజుల తాగునీటి అవ‌స‌రాల‌కు స‌రిపోతాయని అధికారులు తెలిపారు.


తిరుపతి, విశాఖ నుంచి విమానాలు రద్దు


ఫెంగల్ తుపాను (Fengal Cyclone) ఏపీలోని దక్షిణ కోస్తాంధ్రతో పాటు రాయలసీమ జిల్లాల్లో తీవ్ర ప్రభావం చూపుతోంది. రాయలసీమ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలకు భారత వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కొన్ని ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా విశాఖపట్నం నుంచి పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. తిరుపతిలో వర్షాల కారణంగా విశాఖ - తిరుపతి విమాన సర్వీసులను అధికారులు రద్దు చేశారు. భారీ వర్షాలతో చెన్నై ఎయిర్ పోర్టును సైతం తాత్కాలికంగా మూసివేశారు. దాంతో విశాఖపట్నం- చెన్నై విమాన సర్వీసులను రద్దు చేసినట్లు ఎయిర్ లైన్స్, విమనాశ్రయ అధికారులు తెలిపారు.


Also Read: Nadendla Manohar: 'జగన్.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి' - కాకినాడ పోర్టు అంశంపై మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు