Minister Nadendla Manohar Comments On Kakinada Port: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అక్రమ బియ్యం నిల్వలపై దాడి చేశామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) అన్నారు. రాష్ట్రంలో గత ఐదేళ్ల పాటు అక్రమంగా బియ్యం ఎగుమతి చేశారని ఆరోపించారు. విజయవాడలో ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. రేషన్ బియ్యం కోసం రూ.12,800 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. కాకినాడలో జూన్ చివరి వారంలో 13 గిడ్డంగుల్లో తనిఖీలు చేశామని.. పట్టుకున్న బియ్యంలో 25 వేల టన్నుల రేషన్ బియ్యాన్ని గుర్తించినట్లు వెల్లడించారు. ఆయా గిడ్డంగుల యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేశామని అన్నారు. రేషన్ బియ్యం విషయంలో కాకినాడ పోర్టుపై ప్రత్యేక దృష్టి పెట్టామని పేర్కొన్నారు.


'జగన్.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి'


ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వంపై మంత్రి నాదెండ్ల తీవ్ర విమర్శలు గుప్పించారు. మాజీ సీఎం జగన్‌కు వరుస ప్రశ్నలు సంధించారు. 'గత ఐదేళ్ల పాటు కాకినాడ పోర్టులోకి ఎవరినీ రానివ్వలేదు. ఇక్కడ కేవలం 20 మంది సెక్యూరిటీనే ఉంచుతారా.?. ఎప్పుడు చూసినా ఇక్కడ 12 వెసల్స్ ఉంటాయి. మిగతా పోర్టుల కంటే కాకినాడ నుంచే ఎక్కువ ఎగుమతులు ఎందుకు జరిగాయి.?. వ్యవస్థను గుప్పిట్లో ఉంచుకుని బియ్యం ఎగుమతి చేశారు. ద్వారంపూడి, కన్నబాబు గతంలో ఎందుకు మాట్లాడలేదు. పూర్తిస్థాయిలో పాతుకుపోయిన వ్యవస్థను ప్రక్షాళన చేయాలనే ఈ తనిఖీలు చేస్తున్నాం. కాకినాడ పోర్టు వెనుక ఎవరున్నారో ప్రజలకు అర్థం కావాలి. ఈ పోర్టు నుంచి స్మగ్లింగ్ మాఫియాను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం. వాస్తవాలు తెలుసుకునేందుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన ప్రయత్నం గొప్పది. కాకినాడ పోర్టుపై వస్తోన్న ప్రశ్నలకు జగన్ జవాబు చెప్పాలి.' అని మంత్రి డిమాండ్ చేశారు.


కాగా, ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాకినాడ పోర్టును సందర్శించారు. కాకినాడలో అక్రమంగా రైస్ స్మగ్లింగ్ చేస్తున్న వ్యవహారంపై సీరియస్ అయ్యారు. రేషన్ బియ్యాన్ని ఆఫ్రికాకు అక్రమంగా ఎగుమతి చేస్తున్నట్లు గుర్తించి షిప్‌ను ఛేజ్ చేసి మరీ పట్టుకున్నారు. పోర్టులోకి రైస్ ఎలా వస్తుందని పవన్ స్థానిక టీడీపీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావును ప్రశ్నించారు. మీరు కూడా కాంప్రమైజ్‌ అయితే ఎలా అందుకేనా మనం పోరాటం చేసిందని అసహనం వ్యక్తం చేశారు. పోర్టు అధికారులపైనా మండిపడ్డారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 'కాకినాడ పోర్టును స్మగ్లింగ్ హబ్‌గా మార్చారు. పోర్టు నుంచి జరిగే అక్రమాలు ఆపుతామని గతంలోనే హామీ ఇచ్చాను. మంత్రి నాదెండ్ల పలుచోట్ల తనిఖీలు నిర్వహించి 51 వేల టన్నుల రేషన్ బియ్యం పట్టుకున్నారు. పోర్టుకు రోజుకు వెయ్యి నుంచి 1100 లారీలు వస్తాయి. రేషన్ మాఫియా వెనుక ఎవరున్నా వదిలిపెట్టం. రేషన్ బియ్యం పేదలకు మాత్రమే అందాలి. కాకినాడ పోర్టుకు భద్రత పెంచాలని కేంద్ర హోంమంత్రికి లేఖ రాస్తాను.' అని పవన్ తెలిపారు.


Also Read: Chevireddy Bhaskar Reddy: మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డిపై పోక్సో కేసులో బిగ్ ట్విస్ట్ - పోలీసులకు తాను ఎలాంటి ఫిర్యాదు చేయలేదన్న బాలిక తండ్రి