‘రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహానీ’ సినిమాతో గత ఏడాది బాక్సాఫీస్ దగ్గర హిట్ కొట్టారు హీరోయిన్ ఆలియా భట్ (Alia Bhatt). కానీ, అదే ఏడాది ఆమె నటించిన హాలీవుడ్ సినిమా ‘హార్ట్ ఆఫ్ స్టోన్’ ఆలియాకు నిరాశనే మిగిల్చింది. హాలీవుడ్ ఇండస్ట్రీలో ఆలియాకు ఇది తొలి సినిమా. ఆ తర్వాత టీజర్, ట్రైలర్లను చూసి ఆలియా భట్ కు ‘జిగ్రా’ ద్వారా మరో హిట్ కచ్చితంగా వస్తుందని భావించారు. కానీ, ‘జిగ్రా’(Jigra) కూడా ఫెయిల్యూర్ గా మిగిలిపోయింది. అక్టోబర్ 11న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో విడుదలకు రెడీ అయ్యింది.


నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో ఈ శుక్రవారం నుంచి 'జిగ్రా'


Jigra OTT Platform: ఈ శుక్రవారం (డిసెంబర్ 6) నుంచి జిగ్రా నెట్ ఫ్లిక్స్ లో హిందీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాకు ఆలియా సహ నిర్మాతగా కూడా వ్యవహరించారు. కరణ్ జోహార్ (Karan Johar) నిర్మాణంలో రూపొందిన ‘జిగ్రా’ ఈ ఏడాది విజయ దశమికి విడుదలై, విజయం మాత్రం దక్కించుకోలేకపోయింది. ‘ఆర్ఆర్ఆర్’(RRR) సినిమా తర్వాత వస్తున్న ప్రాజెక్ట్ కావడంతో ఆలియా భట్ ఈ సినిమాను తెలుగులో కూడా విడుదల చేశారు. వాసన్ బాల తెరకెక్కించిన ఈ చిత్రం ద్వారానే హీరో, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆయన ఇందులో కీలక పాత్ర పోషించారు. ఇందులో ఆలియా భట్ పోషించిన సత్య పాత్రకు తమ్ముడిగా వేదాంగ్ రైనా కనిపిస్తారు.






కేర్ ఆఫ్ కాంట్రవర్సీగా నిలిచిన జిగ్రా


‘జిగ్రా’ విడుదల అయిన కొన్ని రోజులకు బాలీవుడ్ నటి, టీ సిరీస్ భూషన్ కుమార్ భార్య దివ్యా ఖోస్లా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా విమర్శలు మొదలు పెట్టారు. విషయం ఏమిటంటే, ఆమె హీరోయిన్ గా నటించిన ‘సావి’ సినిమా మేలో విడుదలై ఫర్వాలేదనిపించుకుంది. అక్రమంగా అరెస్ట్ అయిన భర్తను ఇంగ్లండ్ జైలు నుంచి తప్పించాలనే లక్ష్యంతో ప్రయత్నించే ఓ మహిళ జీవితం చుట్టూ ఆ సినిమా సాగుతుంది. సరిగ్గా ‘జిగ్రా’ కథ కూడా  అటువంటిదే. ఈ సినిమాలో సత్య పాత్రలో ఆలియా భట్ తన తమ్ముణ్ణి కాపాడటానికి జైలు గోడలు బద్దలు కొడుతుంది. వీరోచిత సాహసాలు చేస్తుంది. ‘సావి’ కూడా ఓ రీమేక్ సినిమానే. ‘గ్లాడియేటర్’ ఫేమ్ రసెల్ క్రో నటించిన ‘ద నెక్స్ట్ త్రీ డేస్’ అనే హాలీవుడ్ సినిమా హక్కులు కొనుగోలు చేసి, ‘సావి’ ని తీశారు దివ్యా ఖోస్లా. తాను సినిమా తీసిన కథను అటు ఇటూ మార్చి ఫ్రీమేక్ రూపంలో ‘జిగ్రా’ను కరణ్ జోహార్ నిర్మించడంతో దివ్యా ఖోస్లా భగ్గుమన్నారు. ఇద్దరూ చాలా కాలం పాటు సోషల్ మీడియాలో మాటా మాటా అనుకున్నారు. ఇక, ‘జిగ్రా’ సినిమా ఫ్లాప్ కావడంతో ఈ వివాదం మరుగున పడింది.