కలియుగ వైకుంఠానికి నిత్యం వేలాదిగా భక్తులు దర్శించుకుంటుంటారు. కోరిన కోర్కెలు తీర్చే కోనేటిరాయునికి ముడుపుల రూపంలోనూ, నగదు, బంగారు వెండి, ఇతర విలువైన వస్తువుల రూపంలో ముడుపులు చెల్లించుకుంటుంటారు. ఇలా స్వామికి భక్తులు సమర్పించే కానుకులు శ్రీవారి ప్రధాన ఆదాయ వనరు. హుండీ ఆదాయంలో ప్రతీ రోజూ చిల్లర నాణేలు 10 నుంచి 20 లక్షల వరకు లభిస్తుంటాయి. హుండీలో భక్తులు సమర్పించే నగదులో చిల్లర నాణేలు అధికంగా ఉంటాయి. ఇలా భక్తులు ఎంతో భక్తితో సమర్పించే నాణేలే టీటీడీకి పెద్ద కష్టాన్ని తెచ్చి పెడుతున్నాయి. భక్తులు సమర్పించే నాణేలు గుట్టలుగుట్టలుగా పేరుకుపోతున్నాయి. వీటిని ఏమి చేయలో తెలియక టీటీడీ తలలు పట్టుకుంటోంది.
గతంలో శ్రీవారికి భక్తులు సమర్పించిన నాణేలను బ్యాంకుల ద్వారా లెక్కింపు చేసి టీటీడీ పేరున బ్యాంకు ఖాతాలలో డిపాజిట్ చేసేది. అలా ఖాతాలో డిపాజిట్ చేసుకున్న నగదుకు వడ్డీ కూడా బ్యాంకులు చెల్లించేవి. అయితే టీటీడీ అధికారులు 2010లో విధానాన్ని మార్చుకున్నారు. 2010 వరకు తమకు సేవలు అందిస్తూ వస్తున్న బ్యాంకులలో డిపాజిట్ చేస్తు వచ్చిన టీటీడీ.. టెండర్ విధానంలో ఎవరు ఎక్కువ వడ్డీ చెల్లిస్తారో వారి బ్యాంకులలో నగదు డిపాజిట్ చేసే విధానానికి నాంది పలికింది. దీనితో బ్యాంకుల మధ్య పోటీతత్వం పెరిగింది. టీటీడీకి మంచి వడ్డీ వచ్చింది. కానీ అప్పటి వరకూ ఉచితంగా సేవలు అందించిన బ్యాంకులు తమను వ్యాపార సంస్థలుగా చుస్తున్నపుడు తమెందుకు ఉచితంగా సేవలు అందించాలని బ్యాంకులు తమ సేవలను విరమించుకున్నాయి. 2010 వరకు నెలకు ఒక బ్యాంకు పరకామణిలో లెక్కింపు చేసి తమ బ్యాంకుల్లో టీటీడీ ఖాతాలలో డిపాజిట్ చేసుకొనే వారు.. మారిన నిబంధనలతో ఎక్కువ వడ్డీ చెల్లిస్తున్న బ్యాంకులలో నగదును డిపాజిట్ చేస్తుండటంతో ఇతర బ్యాంకుల వద్ద నుంచి టీటీడీకి సహకారం తగ్గింది. అప్పటి పాలకమండలి నిర్ణయాలతో గుట్టలుగా పేరుకుపోయిన చిల్లర నాణేలను తీసుకునేందుకు బ్యాంకులు ముందుకు రాలేదు.
2009లో ఆర్బీఐ బ్యాంకు 25 పైసలు వరకు ఉన్న నాణేలను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 25 పైసలలోపు ఉన్న చిల్లర నాణేలను బ్యాంకులలో డిపాజిట్ చేయాలని ఆర్బీఐ సూచించింది. అప్పటి పాలకమండలి, అధికారులు పట్టించుకోలేదు. ఆర్బీఐ గడువు ముగిశాక 30టన్నుల చిల్లర నాణేలు ఉండి పోయాయి. చేసేది లేక మరో మార్గాని అన్వేషించింది టీటీడీ. నాణేలను కరిగించి స్టీల్ రూపంలో విక్రయించాలని టీటీడీ అధికారులలో ఆలోచన మొదలైంది. ఆర్బీఐ కూడా అనుమతి ఇచ్చింది. టన్నుకు 28 వేల రూపాయలకు చొప్పున సెయిల్ సంస్థకు ఇచ్చింది టీటీడీ. విదేశీ నాణేలది ఇదే పరిస్థితి దాదాపు 30 టన్నుల నాణేలు గౌడన్ లలో పేరుకు పోయాయి. వాటి విలువ కంటే వాటి తరలింపుకి అయ్యే ఖర్చే ఎక్కువ కావడంతో అలాగే ఉంచేశారు అధికారులు. ఎన్ని సార్లు ఆర్బీఐని, విదేశీ ఎంబసీ అధికారును టీటీడీ సంప్రదించిన ఫలితం లేకుండా పోయింది. ఇటీవల కొత్త రూల్స్ వచ్చాయి. నోడల్ బ్యాంక్‌కే చిల్లరను తరలించాలి. యూనియన్ బ్యాంక్‌లో విలీనమైన ఆంధ్రాబ్యాంక్ చిల్లర డిపాజిట్ తీసుకునేది. ఆ బ్యాంక్ చిల్లర చెస్ట్ నిండిపోవడంతో 2019 ఏప్రిల్ నెల నుంచి చిల్లర నాణేలు తీసుకోవడం నిలిపివేసింది.. ఇప్పటికే 30 కోట్ల రూపాయలు విలువ చేసే చిల్లర నాణేలు నిల్వ పేరుకుపోయింది.
ఇక ఏ బ్యాంకులోనూ డిపాజిట్ చేసే పరిస్థితి లేకపోవడంతో దీంతో భక్తుల నుంచి వచ్చిన నాణేలను తిరిగి భక్తులకే ఇవ్వాలని టిటిడి నిర్ణయించింది. శ్రీవారి హుండీలో కానుకల రూపంలో భక్తులు సమర్పించే చిల్లర నాణెలను శ్రీవారి ధనప్రసాదం పేరిట భక్తులకే తిరిగి పంపిణే చేసే వినూత్న కార్యక్రమాన్ని టీటీడీ ప్రారంభించింది. అతిథి గృహాల రిసెప్షన్ కేంద్రాల్లో చిల్లర నాణెలను 100 రూపాయలు ప్యాకెట్ల రూపంలో ప్రత్యేక కవర్‌లలో ప్యాక్ చేసి భక్తులకు అందజేస్తోంది. భక్తులు గదికి అద్దెను చెల్లించిన సమయంలో అదనంగా కాషన్ డిపాజిట్ కూడా చెల్లిస్తూ ఉండడంతో భక్తులు గదిని ఖాళీ చేసే సమయంలో కాషన్ డిపాజిట్‌ను శ్రీవారి ధనప్రసాదం రూపంలో చెల్లించేలా చర్యలు తీసుకుంది. ప్రస్తుతం ఒక్క రూపాయి కాయిన్స్ ఇస్తుండగా, రానున్న రోజుల్లో 2,5 రూపాయలను ప్యాకెట్ లను కూడా టీటీడీ భక్తులకు అందుబాటులోకీ తీసుకురానుంది. ఒక వేళ భక్తులు చిల్లర నాణెలను తీసుకునేందుకు ఆసక్తి చూపకపోతే నోట్ల రూపంలో కాషన్ డిపాజిట్‌ను భక్తులకు టిటీడి చెల్లిస్తోంది.