Ramana Deekshitulu Comments On Tirumala Laddu: తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగంపై టీటీడీ మాజీ ప్రధానార్చకులు రమణ దీక్షితులు (Ramana Deekshitulu) శుక్రవారం స్పందించారు. పవిత్రమైన ఆవు నెయ్యిని కల్తీ చేసి శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వినియోగించడం అపచారమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమలలో ప్రసాదాల నాణ్యతపై గతంలో ఎన్నోసార్లు టీటీడీ ఛైర్మన్, ఈవో దృష్టికి తాను తీసుకెళ్లానని.. అయినా ఫలితం లేకపోయిందని మీడియా సమావేశంలో చెప్పారు. ఈ రెండు మూడు రోజుల్లో వస్తున్న వార్తలు చాలా బాధగా ఉందని.. శ్రీవారి భక్తులకు తీవ్ర మనోవేదన కలిగించాయని అన్నారు. 'నైవేద్యాలు, లడ్డూల్లో పవిత్రమైన నెయ్యిని కల్తీ చేయడం బాధ కలిగించింది. ప్రసాదాల నాణ్యతపై చాలాసార్లు అధికారుల దృష్టికి తీసుకొని వెళ్లాను. కానీ నాది ఒంటరి పోరాటమే అయ్యింది. తోటి అర్చకులు ఎవరూ తమ వ్యక్తిగత కారణాల వల్ల ముందుకు రాలేదు. దీంతో గత ఐదేళ్లూ నిరభ్యంతరంగా ఈ మహాపాపం జరిగిపోయింది. నెయ్యి పరీక్షలకు సంబంధించి ల్యాబ్ రిపోర్టులు చూశాను. నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు అందులో బహిర్గతమైంది. పరిశుభ్రమైన ఆవు పాలతో తయారైన నెయ్యిలో కొవ్వు పదార్థాలు కలిసేందుకు వీలు లేదు.' అని రమణ దీక్షితులు పేర్కొన్నారు.


'ప్రక్షాళన చేపట్టారు'


చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రక్షాళన దిశగా ఎన్నో చర్యలు చేపట్టారని రమణ దీక్షితులు అన్నారు. 'కర్ణాటకలోని నందిని డెయిరీ నుంచి నాణ్యత ఉన్న నెయ్యిని వినియోగించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇది శుభ పరిణామం. గతంలో లడ్డు తయారీలో వినియోగించిన కల్తీ నెయ్యి అంశంపై పూర్తి స్థాయి విచారణ జరగాలి. కల్తీ, స్వామి వారి కైంకర్యాలు గురించి అధికారుల దృష్టికి తీసుకెళ్తే గతంలో నాపై కేసులు పెట్టారు. నేను ఎన్ని ఇబ్బందులు పడినా నా స్వామి వారికి సమయానికి నైవేద్యం, కైంకర్యాలు జరిగితే చాలు. కైంకర్యాలు, ప్రసాదాల్లో లోపాలు జరిగాయి. ఈ కల్తీ జరగడం వల్ల మా చేతుల మీద జరగడం చాలా దురదృష్టకరం. ఆగమ శాస్త్రం, దిట్టం ప్రకారం ప్రసాదాలు చేయాలి. దిట్టం కన్న తక్కువ చేస్తే అది అపచారం. స్వామి వారికి నాణ్యత, రుచిగా నైవేద్యం పెడితే భక్తులను అనుగ్రహిస్తారు. సేంద్రీయ వ్యవసాయం బియ్యంతో నైవేద్యం పెట్టకూడదని గతంలోనే చెప్పాను. వందల సంవత్సరాలుగా వస్తోన్న ఆచారం మార్చవద్దని చెప్పాను. గతంలో అధికారులకు చిత్తశుద్ధి ఉంటే ఇలాంటి ఘటనలు జరిగి ఉండవు.' అని రమణ దీక్షితులు పేర్కొన్నారు.


కాగా, తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగం జరిగిందని సీఎం చంద్రబాబు తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై తీవ్ర రాజకీయ దుమారం రేగింది. దీనికి సంబంధించిన రిపోర్టులను తాజాగా టీడీపీ నేత ఆనం బయటపెట్టారు. జగన్ హయాంలో టీటీడీ లడ్డూల తయారీలో వాడే నెయ్యిలో.. పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేప నూనె వంటివి కలగలిసి ఉండొచ్చనే అనుమానాన్ని గుజరాత్‌కు చెందిన నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు (NDDB) కాఫ్ లిమిటెడ్ సంస్థ వ్యక్తం చేసినట్లు టీడీపీ తెలిపింది. నెయ్యి పెద్ద ఎత్తున కల్తీ జరిగిందని.. అందులో పాలకు సంబంధించినవి కాకుండా ఇతరత్రా కొవ్వులు కలగలిసి ఉన్నట్లు ఆ పరీక్షల్లో వెల్లడైనట్లు పేర్కొంది. మరోవైపు, ఈ అంశంపై టీటీడీ విచారణకు ఆదేశించింది. 


Also Read: Pawan Kalyan: తిరుమల లడ్డూ వివాదంపై తొలిసారి స్పందించిన పవన్ కల్యాణ్ - బాధ్యులపై కఠినచర్యలు ఉంటాయన్న డిప్యూటీ సీఎం