TTD Website: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. టీటీడీకి చెందిన వెబ్‌సైట్ యూఆర్ఎల్‌ను https://ttdevasthanams.ap.gov.in గా మార్చుతున్నట్లు ప్రకటించింది. ఒకే సంస్థ, ఒకే వెబ్సైట్, ఒకే మొబైల్ యాప్ అన్న నినాదం మేరకు వెబ్సైట్ పేరును https://ttdevasthanams.ap.gov.in గా మార్చినట్లు ఐటీ జనరల్ మేనేజర్ సందీప్ రెడ్డి సోమవారం తెలిపారు. తిరుమల రాంభగీచా-2లోని మీడియా సెంటర్ లో సోమవారం మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. టీటీడీ ఐటీ విభాగం ఎప్పటికప్పుడు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని సాఫ్ట్వేర్ అప్లికేషన్లను రూపొందించడం ద్వారా శ్రీవారి భక్తులకు దర్శనం, ఆర్జిత సేవలు, గదులు, లడ్డూ ప్రసాదం తదితర సేవలను వేగంగా, పారదర్శకంగా అందిస్తోందని అన్నారు.
బ్రహ్మోత్సవాల్లో తొలిసారిగా వెహికల్ పాస్ మేనేజ్‌మెంట్ సిస్టం అప్లికేషన్ రూపొందించి తిరుపతి శివారు ప్రాంతాల్లో వాహనాలకు పాసులు మంజూరు చేశామని, దీని ద్వారా తిరుమలలో వాహనాల రద్దీ పెరిగినప్పుడు విజిలెన్స్ అధికారులు తిరుపతిలోనే పార్కింగ్ వసతి కల్పించారని తెలిపారు. బ్రహ్మోత్సవాల వాహన సేవలను సోషల్ మీడియా ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నామని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు వాహన సేవలను వీక్షించి తరిస్తున్నారని తెలియజేశారు. 2021వ సంవత్సరం నుంచి టీటీడీ వెబ్‌సైట్, యాప్ క్లౌడ్‌కు మారాయని, అప్పటినుంచి వేగవంతంగా దర్శన టికెట్లు, ఆర్జిత సేవలు, గదుల బుకింగ్ జరుగుతోందని వివరించారు.
ఒకే సంస్థ, ఒకే వెబ్సైట్, ఒకే మొబైల్ యాప్ అన్న నినాదం మేరకు వెబ్సైట్ పేరును మార్చామని వెల్లడించారు. తద్వారా టీటీడీకి సొంతంగా ట్రేడ్ మార్క్ ఉంటుందని, నకిలీ వెబ్సైట్లను నియంత్రించే అవకాశం లభిస్తుందని అన్నారు. వీటితోపాటు తిరుపతిలో సర్వదర్శనం టోకెన్లు, దివ్యదర్శనం టోకెన్లు జారీ చేస్తున్నామని, తిరుమలలో పారదర్శకంగా గదులు కేటాయించేందుకు ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ అమలు చేస్తున్నామని తెలిపారు. ఆర్జితసేవల ఆన్లైన్ లక్కీ డిప్‌తో పాటు తిరుమలలోని సీఆర్ఓ కార్యాలయంలో ఆఫ్ లైన్‌లో ఎలక్ట్రానిక్ డిప్ అమలు చేస్తున్నామని చెప్పారు. టీటీడీ విద్యాసంస్థల్లో స్టూడెంట్ మేనేజ్‌మెంట్ అప్లికేషన్ ద్వారా విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తున్నామన్నారు.
స్విమ్స్, బర్డ్ ఆసుపత్రుల్లో హాస్పిటల్ మేనేజ్‌మెంట్ అప్లికేషన్ ద్వారా మెరుగైన పాలన జరుగుతోందన్నారు. త్వరలో టీటీడీ పరిధిలోని 60 స్థానిక ఆలయాల్లో భక్తులు ఆర్జిత సేవలను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తామన్నారు. శ్రీవారి సేవ ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా సేవకులు నమోదు చేసుకుంటున్నారని చెప్పారు. టీటీడీ ఉద్యోగుల ఇళ్ల స్థలాలకు సంబంధించి డిప్‌ను ఎలక్ట్రానిక్ పద్ధతిలో పారదర్శకంగా నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీ మేనేజర్లు నాదముని, నాగరాజరెడ్డి పాల్గొన్నారు.
గతంలో టీటీడీ అధికార వెబ్‌సైట్‌గా https://tirupatibalaji.ap.gov.in/ గా ఉండేది. దీని ద్వారానే భక్తులు, సేవలు, దర్శనం టికెట్లు బుక్ చేసుకునేవారు. దీని స్థానంలో టీటీడీ కొత్త యూఆర్ఎల్‌ను పరిచయం చేసింది. టీటీడీకి సంబంధించిన అన్ని విషయాలకు https://ttdevasthanams.ap.gov.in సందర్శించాలని శ్రీవారి భక్తులను కోరింది. సైబర్ నేరాలు పెరిగిన నేపథ్యంలో టీటీడీని పోలిన వెబ్‌సైట్లు చాలా ఉన్నాయని, అలాంటి నకిలీ వెబ్‌సైట్లను నమ్మవద్దని సూచించింది. భక్తులు అప్రమత్తంగా ఉండాలని కోరింది.