YS Viveka Case : : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తనపై సీబీఐ తీవ్రమైన చర్యలు తీసుకోకుండా ఆదేశించాలంటూ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు తుది తీర్పు శుక్రవారం ఇవ్వనుంది. తుది తీర్పు ఇచ్చే వరకూ అరెస్ట్ చేయవద్దని ఏపీ హైకోర్టు ఊరటనిచ్చింది. తదుపరి విచారణపై స్టే ఇవ్వాలన్న పిటిషన్‌పైనా ఉన్నత న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. వీటిపై శుక్రవారం ధర్మాసనం తీర్పు వెలువరించనుంది.
అవినాష్ విచారణకు సంబంధించిన డాక్యుమెంట్లు హైకోర్టుకు ఇచ్చిన సీబీఐ
అవినాష్ విచారణకు సంబంధించిన వివరాలను సీల్డ్ కవర్‌లో హైకోర్టుకు సీబీఐ విచారణ సందర్భంగా అందించింది. 10 డాక్యుమెంట్లు, 35 మంది సాక్షుల వాంగ్మూలాలు, కొన్ని ఫొటోలను కోర్టుకు సమర్పించింది. అవినాష్ విచారణను ఆడియో, వీడియో ద్వారా రికార్డు చేస్తున్నట్లు కోర్టు దృష్టికి సీబీఐ తీసుకొచ్చింది. హత్య జరిగిన ప్రాంతంలో దొరికిన లెటర్, ఎఫ్‌ఎస్ఎల్ నివేదికను కూడా హైకోర్టుకు సీబీఐ అందజేసింది. 160 సీర్పీసీలో విచారించబడుతున్నారని... కోర్టు ద్వారా విచారణకు రాలేదని, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ నోటీసులతో వచ్చారని సీబీఐ వెల్లడించింది.కేసుకు సంబంధించిన ఆధారాలను ధ్వంసం చేయడంలో అవినాష్ పాత్ర ఉందని.. ఆయనపై తీవ్ర చర్యలు తీసుకోవద్దంటూ ఆదేశాలు ఇవ్వొద్దని హైకోర్టును కోరింది.
వివేకా కుమార్తె వేసిన ఇంప్లీడ్ పిటిషన్‌పైనే అవినాష్ రెడ్డి అభ్యంతరం
ఈ కేసులో తన వాదనలు వినాలని వివేకా కుమార్తె సునీత ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేఏశారు. అయితే సునీత పిటిషన్ వెనుక సీబీఐ హస్తం ఉందని అవినాష్ రెడ్డి న్యాయవాది వాదించారు. సునిత అభియోగాల వెనకాల రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయన్నారు. వివేక హత్య అనంతరం అనుకూలంగా ఉన్న సునీత ఏడాది తరువాత ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. వివేకా అల్లుడు రాజశేఖర్ రెడ్డి, వివేకా రెండో భార్య షమీంల పాత్రపై సీబీఐ విచారణ చేయడం లేదని తెలిపారు. అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని దర్యాప్తు జరగాలని అవినాష్ తరుపు న్యాయవాది కోరారు.
అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలని నిర్ణయం తీసుకున్నామన్న సీబీఐ
వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ ఇప్పటి వరకూ రిమాండ్ రిపోర్టులు, కౌంటర్ల ద్వారా వెల్లడించిన సమాచారం ప్రకారం అవినాష్ రెడ్డి ప్రధాన అనుమానితుడిగా ఉన్నారు. అవినాష్ రెడ్డితో పాటు ఆయన తండ్రిని కూడా అదుపులోకి తీసుకోవాలని గతంలోనే నిర్ణయించుకున్నామని నేరుగా హైకోర్టుకే సీబీఐ చెప్పింది. అవినాష్ రెడ్డి పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టు ఇవ్వబోయే తీర్పు కీలకం కానుంది. తీవ్ర చర్యలు తీసుకోకుండా హైకోర్టు సీబీఐని ఆదేశిస్తే అరెస్ట్ జరగకపోవచ్చు. అదే సమయంలో ఆయన పిటిషన్ ను కోర్టు కొట్టి వేస్తే.. సీబీఐ అధికారులు ఏ క్షణమైనా అరెస్టు చేసే అవకాశం ఉంది. అందుకే తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.