అమరావతి: కర్ణాటక పరిసర ప్రాంతాల నుండి కోస్తాంధ్ర తీర ప్రాంతం వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో వాతావరణం మారనుంది. సోమవారం, మంగళవారాల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ప్రఖర్‌ జైన్‌ తెలిపారు. ప్రధానంగా అల్లూరి సీతారామరాజు, పోలవరం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్‌ కడప జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులు పడే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.  తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. ఉరుములు వచ్చేటప్పుడు చెట్ల కింద, కరెంట్ స్తంభాల వద్ద నిల్చోవద్దని ప్రజలకు సూచించారు.

Continues below advertisement

కొన్ని చోట్ల వడగాల్పులుఒకవైపు వర్ష సూచన ఉన్నప్పటికీ, మరోవైపు రాష్ట్రంలో ఎండ తీవ్రత కూడా ఆందోళనకరంగానే ఉంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 56 మండలాల్లో తీవ్ర వడగాలులు, 67 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఆదివారం ప్రకాశం జిల్లా కరేడులో అత్యధికంగా 43.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు తెలిపారు. ప్రజలు పిడుగులు, వడగాల్పుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.

ఇంకా తగ్గని భానుడి ప్రతాపం.. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు

శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో నేడు 42 నుంచి 44 డిగ్రీల మధ్య పగటి ఉష్ణోగ్రత నమోదు కానుంది. కోనసీమ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్ కడప, చిత్తూరు జిల్లాల్లో 40 నుంచి 42 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. అత్యవసరంగా బయటకు వెళ్తే చెవుల్లోకి వేడిగాలి వెళ్లకుండా కండువా లేదా టోపీ ధరించాలని ప్రజలకు సూచించారు. ​

Also Read: School Holidays: విద్యార్థులకు పండగే.. తెలంగాణలో సమ్మర్ హాలిడేస్ పొడిగించిన విద్యాశాఖ

రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి వర్షాలు కురవడంతో వాతావరణం కూల్‌గా మారింది. నైరుతి రుతుపవనాలు ఒకట్రెండు రోజుల్లో తెలంగాణలో ప్రవేశించనున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 10వ తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. ఈ వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు, గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంటూ వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదివారం వనపర్తి జిల్లా ఏదుల మండలంలో గరిష్టంగా 5.08 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

ఆ జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలుతెలంగాణలో నేడు మహబూబాబాద్, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండలోని కొన్ని ప్రాంతాలు, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఉరుములతో కూడిన వానలు పడే అవకాశం ఉంది. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వికారాబాద్, వనపర్తి, గద్వాల, నారాయణపేట జిల్లాల్లో కూడా భారీ ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్ మ్యాన్ అంచనా వేశారు. రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం, కందుకూర్, యాచారం బెల్ట్ మీదుగా కడ్తాల్, కేశంపేట, ఆమనగల్ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయి. 

50% సాధారణ వర్షాలు - 50% లోటు వర్షాలుఈ ఏడాది వర్షపాతం 2018 నాటి పరిస్థితులను పోలి ఉంటుందని, సాధారణం కంటే తక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా గత ఏడాది (2025) కురిసిన భారీ వర్షాలను ఈసారి అస్సలు ఆశించలేమని తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపారు. నెలల వారీగా వర్షాల గమనాన్ని పరిశీలిస్తే.. జూన్, జూలై నెలల్లో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో మాత్రం సాధారణం కంటే తక్కువ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. 

అయినప్పటికీ, ఈ ఏడాది వర్షాలు 2014-15 నాటి కరువు పరిస్థితుల వలె మరీ దారుణంగా ఉండకపోవచ్చని, కానీ గత 5-6 సంవత్సరాలతో పోలిస్తే ఈసారి నైరుతి రుతుపవనాల వర్షపాతం  తగ్గుతుందని తెలుస్తోంది. ఈ ఏడాది లోటు వర్షాల ప్రభావం తెలంగాణలోని దక్షిణాది, ఉత్తరాది జిల్లాలపై తీవ్రంగా ఉండనుంది. మధ్య తెలంగాణ జిల్లాల్లో మాత్రం మంచి వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో ఈ ఏడాది సాధారణం నుండి స్వల్పంగా లోటు వర్షపాతం నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.