గుంటూరులో జరగాల్సిన BRS ఆత్మీయ సమావేశం వాయిదా పడింది. జాతీయ పార్టీ భారత రాష్ట్ర సమితి (BRS) ఆంధ్రప్రదేశ్ శాఖ ఫిబ్రవరి 3న గుంటూరులో తలపెట్టిన కార్యకర్తల ఆత్మీయ సమావేశం అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. శుక్రవారం నాడు గుంటూరులోని శ్రీవెంకటేశ్వర విజ్ఞాన మందిరం ఆడిటోరియంలో బీఆర్ఎస్ సమావేశం జరగాల్సి ఉండగా, ఇదే నెల 5న (ఆదివారం) నాందేడ్ లో కేసీఆర్ భారీ బహిరంగ సభ నేపథ్యంలో ఏపీ మీటింగ్ పోస్ట్ పోన్ అయింది. తదుపరి తేదీలను నాయకులు త్వరలోనే వెల్లడిస్తారు.
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఫిబ్రవరి నెల 5న మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో పర్యటించనున్నారు. ముందుగా గురుద్వారా దర్శనం, అక్కడ ప్రత్యేక పూజల అనంత రం, హింగోలీరోడ్ ఎదురుగా ఉన్న గురుద్వారా సత్కండ్ బోర్డ్ మైదాన్‌లో బీఆర్‌ఎస్ చేరికల సమావేశం ఉంటుంది.
నేడు వైసీపీ రీజినల్ కో ఆర్డినెటర్లతో సీఎం జగన్ సమావేశం
గడప గడపకు ప్రోగ్రెస్ తో పాటు తాజా రాజకీయ పరిణామాలపై చర్చ
కోటంరెడ్డిపై ఇప్పటికే తీవ్ర స్థాయిలో మండి పడుతున్న వైసీపీ కీలక నేతలు
ఈ సమావేశంలో పార్టీలో ఉన్న కొన్ని సమస్యలు, జనంలో ఎక్కువగా తిరగడం వచ్చే ఎన్నికల ప్రధాన ఎజెండాపై చర్చ
అనకాపల్లిలో తహసీల్దారు సస్పెండ్
అనకాపల్లి జిల్లా కశింకోట మండల తహసీల్దారు బి.సుధాకర్ సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ రవి పట్టన్‌శెట్టి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పట్టాదారు పాస్‌పుస్తకాలు జారీ, భూముల మ్యుటేషన్, తదితర విషయాల్లో కశింకోట తహసీల్దారు సుధాకర్ నిబంధనలు పాటించడం లేదని గతంలో కలెక్టర్‌కు ఫిర్యాదులు అందాయి. దీనిపై విచారణకు ఆదేశించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నట్టు నిర్ధారణ అయ్యింది. ఇంకా భూముల సమగ్ర రీసర్వే కార్యక్రమాన్ని సరిగా పర్యవేక్షించడంలేదని ఉన్నతాధికారులు గుర్తించారు. వీటికితోడు బయ్యవరం భూముల విషయంలో ఆయనపై పలు ఫిర్యాదులు అందాయి. ఈ కారణాల వల్ల ఆయనను సస్పెండ్ చేసినట్టు తెలిసింది.
గుంటూరు జిల్లాలో టీడీపీ నేతపై కాల్పులు
గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం అలవాలలో కాల్పులు కలకలం రేగాయి. రొంపిచర్ల మండల టీడీపీ అధ్యక్షుడు వెన్నా బాలకోటిరెడ్డిపై ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. ఇంట్లో ఉన్న సమయంలో తుపాకీతో ప్రత్యర్థులు రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. బాలకోటి రెడ్డికి బులెట్ గాయాలు కాగా, అతణ్ని నరసరావుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ కాల్పులను గడ్డం వెంకట్రావు, పమ్మి వెంకటేశ్వర్ రెడ్డి, పూజల రాముడు అనే వ్యక్తులు చేసినట్లుగా తెలుస్తోంది. గతంలో రొంపిచర్ల ఎంపీపీగా వెన్న బాల కోటిరెడ్డి పని చేశారు. పక్కా ప్లాన్ తో రొంపిచర్ల వైసీపీ ఎంపీపీ భర్త గడ్డం వెంకట్రావు, అతని అనుచరులు దాడికి పాల్పడినట్లు సమాచారం.
నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-చార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద బాబు ఆసుపత్రిలో బాలకోటిరెడ్డి పరామర్శించారు. వెన్న బలకోటి రెడ్డి పై హత్యాయత్నం ముమ్మాటికీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పనే అని ఆయన అన్నారు. బలకోటి రెడ్డికి ఏమైనా జరిగితే వైఎస్ఆర్ సీపీ సర్కారుదే బాధ్యత అని అన్నారు. బాలకోటి రెడ్డి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు హాస్పిటల్ కి తరలించామని టీడీపీ ఇన్-చార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద బాబు చెప్పారు.