Tomato Price: టమాటా ఆకాశంలో విహరిస్తోంది. ఇప్పట్లో సామాన్యులకు చిక్కే సూచనలు కనిపించడం లేదు. రోజు రోజుకూ కొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఎప్పుడూ లేనంతగా ధరలు పెరిగిపోవడంతో సామాన్యులు ఆగమైపోతున్నారు. ఈ ధోరణి ఏదో ఒక రాష్ట్రంలో ఉంది అనుకుంటే పొరబడినట్లే. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. ఎక్కడా టమాటా ధరలు సామాన్యులకు అందుబాటు ధరల్లో ఉండట్లేదు. టమాటా అంటే బెంబేలెత్తిపోయేలా ధరలు ఉండటంతో.. చాలా మంది టమాటాలు లేకుండా కూరలు వండేసుకోవడానికి అలవాటు పడుతున్నారు. దేశవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో పంట నాశనమై ఈ ధరలు మరింతగా పెరిగిపోతూనే ఉన్నాయి. 


బి గ్రేడ్ టమాటా ధర రూ.168


ఈ నేపథ్యంలోనే ఏపీలోని మదనపల్లె టమాటా మార్కెట్ లో ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. మదనపల్లె మార్కెట్ లో కిలో టమాటా ధర రూ. 168 పలకడం గమనార్హం. అందులోనూ ఈ రోజు అన్నదాతలు మార్కెట్ యార్డుకు కేవలం 361 టన్నుల టమాటాలు మాత్రమే తీసుకువచ్చారు. వీటిల్లో ఏ గ్రేడ్ టమాటా రూ.118, రూ. 138 వరకు పలికింది. బి గ్రేడ్ టమాటాకు రూ. 140  నుంచి రూ.168 వరకు పలికింది. సగటున కిలో టమాటా రూ. 132 నుంచి రూ. 16 మధ్యలో ఉన్నట్లు మదనపల్లె మార్కెట్ యార్డు కార్యదర్శి అభిషాల్ చెప్పుకొచ్చారు. 24 గంటల క్రితం రూ.140 పలికిన కిలో టమాటా ధర.. ఇవాళ రూ. 168 కి చేరుకుంది. ఒక రోజులోనే దాదాపుగా రూ. 30 కి పెరిగింది. దీంతో టమాటా అంటేనే భయపడే పరిస్థితి వచ్చినట్లయింది. సామాన్యులు అయితే టమాటా వైపు చూడటమే మానేశారు. 


నెలలో కోటి 80 లక్షలు సంపాదించిన మెదక్ రైతు


మెదక్‌ లోని కౌడిపల్లి గ్రామానికి చెందిన మహిపాల్‌ రెడ్డి జూన్‌ 15 నుంచి నెల రోజుల పాటు టమాటాలు అమ్మి కోటీ 80 లక్షలు సంపాదించారు. చదువు అబ్బకపోవడంతో ఆయన రైతుగా సెటిల్ అయ్యారు. చదువును పదోతరగతిలోనే అపేశారు. మొదట్లో వరి సాగు చేసే మహిపాల్‌ అందులో నష్టాలనే చూశారు. వరి సాగుతో లాభం లేదని గ్రహించి కూరగాయలు సాగు వైపు మొగ్గు చూపారు. ఇన్నాళ్లు పడిన శ్రమకు ఇప్పుడు ఫలితం లభించింది. నెల రోజులుగా పెరిగిపోతున్న టమాలా ధర కారణంగా మహిపాల్ పంట పండింది. దాదాపు 150 రూపాయలు పలుకుతున్న టమాటను విక్రయించి మంచి లాభాలను తెచుకున్నారు. మహిపాల్‌ సుమారు 8 ఎకరాల్లో టమాటా పంట పండించారు. జూన్‌ 15 నుంచి వచ్చిన దిగుబడిని అమ్ముతున్నారు. నెల రోజుల్లో కోటీ ఎనభై లక్షల రూపాయల సరకు అమ్మారు. 


వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేస్తూ భూసారానికి అనుగుణంగా పంట మార్పిడీ చేస్తున్నట్టు మహిపాల్ తెలిపారు. అందుకే తన పొలంలో పండిన టమాట ఏ గ్రేడ్‌ రకానికి చెందిందని చెబుతున్నారు. అధిక వర్షాలకు కాస్త పంట నష్టం వాటిల్లిందన్నారు. అయితే ఇప్పటి వరకు 60 శాతం పంటనే అమ్మానని.. ఇంకా 40 శాతం పంట పొలంలోనే ఉందన్నారు. మిగతా 40 శాతం దిగుబడి అమ్మితే కచ్చితంగా తన ఆదాయం 2 కోట్లకు దాటిపోతుందన్నారు.