Tomato Prices: టామాటా పేరు ఎత్తితేనే ప్రజలు వణికిపోయారు. కొండెక్కిన ధరతో సామాన్యుడి ఇంట టమాటా కాస్ట్‌లీ కూరగాయ అయ్యింది. రెండున్నర నెలల పాటు చూడడమే తప్ప కొనుగోలు చేయలేని స్థితికి టమాటా చేరుకుంది. దేశం మొత్తం టమాటా రేట్లు రెండున్నర నెలల పాటు చుక్కలు చూపించాయి. కొంత మంది రైతులు, వ్యాపారులు నెలలోనే కోట్లకు పడగలెత్తారు. కొన్ని చోట్ల టమాటాల కోసం హత్యలు, దొంగతనాలు జరిగాయంటే రెండు నెలలు పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రెండు నెలలు ఆకాశాన్నంటిన టమాటా ధరలు ఒక్కసారిగా పడిపోయాయి.
ఆంధ్రప్రదేశ్‌లో కిలో టమాటా 11కి చేరింది. ప్రజలు ఊపిరి పీల్చుకుంటుంటే రైతులు మాత్రం లబోదిబోమంటున్నారు. హైదరాబాద్‌లో కిలో రూ.200 పలికిన టమాటా ప్రస్తుతం రిటైల్ మార్కెట్‌లో రూ.24కి దొరుకుతోంది. ఏపీలో హోల్‌సేల్ మార్కెట్‌లో కిలో రూ.218 పలుకగా, ఇప్పుడు కిలో రూ.11కి విక్రయిస్తున్నారు. జూన్ నుంచి టమాటా ఉత్పత్తి లేకపోవడంతో ధరలు విపరీతంగా పెరిగాయి. చాలా వరకు వంట గదుల్లో టమాటా కనిపించకుండా పోయింది.
అదే సమయంలో టమాటా సాగు చేసిన రైతులు కోటీశ్వరులుగా మారారు. ధరలతో కొంతమంది టమాటాలను దొంగతనం చేశారు. రైతులను దోచుకోవడం, చంపడం కూడా జరిగాయి. కొంతమంది టమాటా రైతులు తమ పొలాలను రక్షించుకోవడానికి గార్డులను నియమించుకున్నారు. టామాటాకు ఉన్న డిమాండ్ నేపథ్యంలో రైతులు జూన్ నెలలో పెద్ద ఎత్తున టమాటా నాటారు. ఈ క్రమంలో ఉల్లి, క్యాలీఫ్లవర్ వంటి పంటలను విస్మరించారు. భారీ రాబడిని ఆశించి టమాటా సాగు చేయడం ప్రారంభించారు. అయితే ఇప్పుడు ధరలు పతనమవడంతో నష్టాల్లో కూరుకుపోయారు.
ఏప్రిల్‌లో టమాటా మొక్కలు నాటానని, వాతావరణం అనుకూలించకపోవడంతో ఆగస్టు మొదటి వారం వరకు పంట రాలేదని ఓ రైతు వాపోయాడు. ‘ఈ వారం 20 టన్నులు పండించగా రూ. 2.2 లక్షలు వచ్చింది. ఆగస్టు మొదటి వారంలో పంట చేతికి వచ్చి ఉంటే రూ.30 లక్షల వరకు ఆదాయం వచ్చేది. నేను దురదృష్టవంతుడిని’ అంటూ అనంతపురం జిల్లాకు చెందిన టమాటా రైతు వాపోయారు. రాష్ట్రంలో చాలా మంది రైతుల పరిస్థితి ఇదే. పంట చేతికి వచ్చే సరికి ధరలు ఒక్కసారిగా పడిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు మాత్రం ధరలు తగ్గడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కిలో టమాటా రూ.200 పలికితే సామాన్యుడు ఏంతిని బ్రతకాలని ప్రశ్నిస్తున్నారు.
త్వరలో టమాటా కేజీ రూ.6 కే
ఆంధ్రప్రదేశ్ అంతటా భారీ మొత్తంలో పంట కోతకు సిద్ధంగా ఉంది. కొద్ది రోజుల్లో పెద్ద ఎత్తున టమాటా పంట చేతికి రానుండంతో ధర మరింత తగ్గే అవకాశం ఉందని వ్యవసాయ నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు అదనపు ఉత్పత్తి ఉందని, ఎగుమతికి అవకాశం లేదని ఏపీ వ్యవసాయ సంఘం ప్రతినిధి రవి కుమార్ అన్నారు. రైతులు తమ ఉత్పత్తులను స్థానికంగా విక్రయించాలని చూస్తున్నారని అన్నారు. టమాటా వేగంగా పాడువుతుందని, పంట కోత కోసిన ఐదు రోజులలోపు విక్రయించాల్సి ఉంటుందన్నారు. లేకపోతే టమాటాలు ఎందుకు పనికిరావని, మరో 10 రోజుల్లో టమాటా ధర కిలో రూ.6కు తగ్గే అవకాశం ఉందని, ప్రభుత్వాలు రైతులను ఆదుకోవాలని ఆయన కోరారు.