Telangana: అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగులను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఈ మేరకు తెలంగాణ సాంస్కృతిక సారథిలోని ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేస్తున్నట్లుగా కేసీఆర్ సర్కార్ ప్రకటించింది. ఈ మేరకు సాంస్కృతిక, యువజన సర్వీసులు, పర్యాటక శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. టీఎస్‌ఎస్‌ ఉద్యోగుల పీఆర్సీకి ఆర్థిక శాఖ 3 నెలల క్రితమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే దానికి ఇప్పటి వరకు మోక్షం కలగలేదు. తాజాగా సీఎం చంద్రశేఖర్ రావు దానికి ఆమోద ముద్ర వేశారు. దీంతో తెలంగాణ సాంస్కృతిక శాఖలోని ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. 


2014 సెప్టెంబర్ 30న మొత్తం 583 మంది కళాకారులతో తెలంగాణ సాంస్కృతిక సారథిని ఏర్పాటు చేసింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కళాకారులకు ఉద్యోగాలు కల్పించింది. ఇందులో మొత్తం 550 మంది కళాకారులు ఉద్యోగాలు దక్కించుకున్నారు.  వీరిలో 319 మంది ఎస్సీలు, 38 మంది ఎస్టీలున్నారు. ఇందులో పనిచేస్తున్న కళాకళాకారులకు ప్రభుత్వం నిధి నుంచి జీతాలను అందిస్తోంది. ప్రభుత్వం తాజా నిర్ణయంత పీఆర్సీ 2020 ప్రకారం టీఎస్‌ఎస్‌ ఉద్యోగులకు వేతనాలు పెరుగుతున్నాయి. 


2021 జూన్‌ 1వ తేదీ నుంచి పీఆర్సీ వర్తిస్తుందని సాంస్కృతిక, యువజన సర్వీసులు, పర్యాటక శాఖ తెలిపింది. అలాగే పీఆర్సీ అమలుకు కావాల్సిన చర్యలను వెంటనే తీసుకోవాలని భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌కు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం పే స్కేలు మీద 30 శాతం పీఆర్సీని అమలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉద్యోగుల పేస్కేలు 24,514 ఉండగా.. నూతన పీఆర్సీ ప్రకారం జీతభత్యాలు ఒక్కొక్కరికి రూ. 7,300 మేర పెరగనుంది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


సాంస్కృతిక సారథిలోని ఉద్యోగులు ఏం చేస్తారంటే 
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన 583 మంది కళాకారులతో 2014 సెప్టెంబర్ 30న తెలంగాణ సాంస్కృతిక సారథిని ఏర్పాటు చేసింది. ఇందులో పనిచేస్తున్న కళాకళాకారులకు ప్రభుత్వం నిధి నుంచి జీతాలు చెల్లిస్తోంది. వీరంతా కళాబృందాలుగా ఏర్పడి గ్రామీణ, రూరల్ ప్రాంతాల్లో సాంఘిక దురాచారాలు, మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తుంటారు. కళా ప్రదర్శనలకు శిక్షణ ఇస్తారు. గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వీటితోపాటు ప్రభుత్వ పథకాలపై పాటలు, నృత్యాలతో ప్రభుత్వం చేపట్టే వివిధ పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్తుంటారు. 


ఉద్యోగులపై వరాలు కురిపిస్తున్న కేసీఆర్
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సీఎం కేసీఆర్ ఉద్యోగులపై వరాలు కురిస్తున్నారు. ఇటీవల అంగన్ వాడీ టీచర్లు, హెల్పర్ల ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌సును పెంచుతూ ప్రభుత్వం ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం తీసుకున్నారు. వారి రిటైర్మెంట్ వయసు 61 ఏళ్లు నుంచి 65 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే టీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. ఫలితంగా 43 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు. వీరికి సైతం ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే పీఆర్సీనే వర్తిస్తుందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గతంలో తెలిపారు.