Kodali Nani in Tirumala : 
తిరుపతి: మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి టీటీడీ రూల్స్ వర్తించవా అని ఏపీలో చర్చ మొదలైంది. విజిలెన్స్ సిబ్బంది వారిస్తున్నా మాజీ మంత్రి కొడాలి నాని టీటీడీ నిబంధనలను ఉల్లంఘించారు. ఏకంగా స్వామి వారి మహాద్వారం నుంచే ఆలయంలోకి ప్రవేశించారు. వాస్తవానికి రాష్ట్రపతి నుంచి మొదలుకుని ముఖ్యమంత్రి వరకూ ఓ స్థాయి ఉన్న ప్రభుత్వాధినేతలకు, పాలకులు మాత్రమే మహాద్వారం నుంచి తిరుమల ఆలయంలోకి నేరుగా ప్రవేశించవచ్చు. 


తాజాగా తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ బ్రహోత్సవాల లాంటి సమయాల్లో పట్టువస్త్రాలు తీసుకువస్తారు కాబట్టి సీఎంకు తోడుగా కొంతమంది మంత్రులు కూడా ఆలయ మహాద్వారం నుంచి ఆలయంలోకి వెళ్తారు. కానీ కొడాలి మాజీ మంత్రి. గుడివాడ ఎమ్మెల్యే కావడంతో అధికారులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఆయనకు మహాద్వారం నుంచి ప్రవేశించేందుకు నిబంధనలు అంగీకరించవు. అందుకే విజిలెన్స్ అధికారి బాలిరెడ్డి కొడాలి నానికి నమస్కరిస్తూనే సున్నితంగా ఆయన్ను లోనికి వెళ్లటానికి వీలు లేదని ఆపారు. కానీ తననే ఆపుతారా అన్నట్లు చూసిన కొడాలి నాని వీజీవోతో వాగ్వాదానికి దిగబోయారు. ఈ లోగా అక్కడే టీటీడీ సీవీ అండ్ ఎస్వో నరసింహ కిషోర్ కొడాలి నానిని లోపలికి పంపించారు. నిబంధనలు అంగీకరించపోయినా.. విజిలెన్స్ సిబ్బంది ఆపినా ఆగని కొడాలినాని పై భక్తులు మండిపడుతున్నారు. టీటీడీ రూల్స్ సామన్యూలకేనా కొడాలి నాని లాంటి మాజీ మంత్రులకు వర్తించవా అంటూ ప్రశ్నిస్తున్నారు.