తాము చెప్పినట్టు చేయడం లేదని వాలంటీర్లపై సచివాలయ సిబ్బంది ప్రతాపం చూపించిన కోనసీమ సంఘటన మర్చిపోకముందే మరో సంఘటన జరిగింది. ఈ సారి సచివాలయ సిబ్బంది అవామానానికి గురయ్యారు. 


విధులకు ఆలస్యంగా వస్తున్నారన్న కోపంతో సచివాలయం సిబ్బందితోపాటు వాలంటీర్లను సైతం బయటకు నెట్టేశాడో వైసీపీ నేత కుమారుడు. అంతేనా అసభ్య పదజాలంతో అందరి ముందు ఇష్టం వచ్చినట్లుగా తిడుతూ పరువు తీసేశారు. అతను చేస్తున్న అరాచకాన్ని అలాగే చూస్తుండిపోయారే తప్ప ఎవరూ నోరు మెదపలేదు. తిరుపతి జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది.  


సర్పంచి కుమారుడే బయటకు నెట్టేశారు..


జిల్లాలోని చంద్రగిరి మండలం గంగుడుపల్లి సచివాలయ సిబ్బంది, వాలంటీర్లును సర్పంచ్ బోడిరెడ్డి ధర్మారెడ్డి కుమారుడు క్రాంతి కుమార్ రెడ్డి కార్యాలయం నుంచి బయటకు గెంటేశారు. విధులకు ఆలస్యంగా వస్తున్నారన్న నెపంతో తరచూ వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని 9 మంది సచివాలయ సిబ్బంది, 9 మంది వాలంటీర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేం మొదటిసారి కాదని, గతంలో కూడా చాలా సార్లే అసభ్య పదజాలంతో దూషించారంటూ వాపోయారు. ఘటన జరిగిన అనంతరం 18 మంది కలిసి కార్యాలయం ఎదుట ధర్నాకి దిగారు. పంచాయితీ కార్యక్రమంలో నేతలు కాకుండా వారి పిల్లలు పెత్తనం చెలాయించడం ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేట్ వ్యక్తులు మద్యం సేవించి వచ్చి అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. 


అయితే సర్పంచి కుమారుడు క్రాంతి కుమార్ రెడ్డి గతంలో కూడా రెండు సార్లు కార్యాలయానికి తాళాలు వేసి వెళ్లిపోయారని గుర్తు చేశారు. తహశీల్దార్, ఎంపీడీవో కార్యాలయంలో సమావేశాలకు హాజరై వచ్చినా.. ఆలస్యంగా ఎందుకు వస్తున్నారని సర్పంచ్ కుమారుడు క్రాంతి కుమార్ రెడ్డి ప్రశ్నిస్తున్నారని పేర్కొన్నారు. ఉన్నతాధికారులు కచ్చితమైన హామీ ఇస్తే కానీ తాము విధులకు హాజరుకాబోమని స్పష్టం చేశారు. ఇలా తరచుగా వేధింపులకు గురి చేస్తే.. ఎవరూ పని చేయలేరని తెలిపారు. 


గతంలో కూడా నాయకుల వేధింపులతో వాలంటీర్ల రాజీనామాలు..!


ఎలాంటి కారణం లేకుండా తమను విధుల నుంచి తొలగించారని అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లెలో ముగ్గురు వాలంటీర్లు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికుల నాయకుల వేధింపుల కారణంగానే తమని తొలగించారని తెలిపారు. వ్యక్తిగత కక్షలతో అన్యాయంగా తీసేసిన తమకు న్యాయం చేయాలని కోరారు. అలాగే ఈ విషయం గురించి ముఖ్యమంత్రి జగన్ కు లేఖ రాస్తామని అన్నారు. 


ఐదు నెలల క్రితం చిత్తూరు జిల్లా పాకాల ఎంపీడీవో కార్యాలయం వద్ద సచివాలయ వాలంటీర్లు ధర్నా చేపట్టారు. వైకాపా నాయకులు వేధిస్తున్నారంటూ నిరసన తెలిపారు. జగనన్న కాలనీల లబ్ధిదారులు ఇళ్లు కట్టుకునేలా చూడాలంటూ పంచాయతీ కార్యదర్శి తమపై తీర్వ ఒత్తిడి తెస్తున్నారని అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని ఆరోపించారు. పాకాల పంచాయతీలోని రెండు గ్రామ సచివాలయ పరిధిలో విధులు నిర్వహిస్తున్న వాలంటీర్లు ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లారు. కానీ అక్కడ ఎవరూ లేకపోవడంతో తమ బాధను ఎమ్మార్వో భాగ్యలక్ష్మితో పంచుకున్నారు. స్థానిక పంచాయతీ కార్యదర్శి తమపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారని ఆరోపిస్తూ.. మూకుమ్మడిగా రాజీనామా పత్రాల్ని సమర్పించారు. ఈ ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది.