Tirumala : కలియుగ దైవం శ్రీ వెంకటేశుడి సన్నిధానం తిరుమలలో వైకుంఠ ఏకాదశికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. 10 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా అనేక సేవలను రద్దు చేస్తున్నట్టు ఇప్పటికే టీటీడీ వెల్లడించింది. తాజాగా మరి కొన్ని చర్యలు తీసుకుంటున్నట్టు ప్రకటించింది. ఈ 10రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశామని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవన్ లో టీటీడీ విభాగాధిపతులతో సమీక్ష నిర్వహించిన ఆయన.. ఈ 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలకు టోకెన్లు, టిక్కెట్లు ఉన్న భక్తులనే దర్శనానికి అనుమతించాలని ఆదేశించారు.


వైకుంఠ ఏకాదశికి టీటీడీ నిబంధనలు


వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని గదుల అడ్వాన్స్ రిజర్వేషన్స్ రద్దు చేస్తామని టీటీడీ వెల్లడించింది. దాంతో పాటు కేటాయించిన దర్శన తేదీ రోజున మాత్రమే భక్తులను తిరుమలకు అనుమతిస్తామని చెప్పింది. ముఖ్యంగా చంటి బిడ్డలు, వృద్ధులు, దివ్యాంగులు, రక్షణ, ఎన్ఆర్ఐ వంటి వారికి విశేష దర్శనాలను రద్దు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. గోవింద మాల భక్తులకు ఎలాంటి స్పెషల్ దర్శన ఏర్పాటు ఉండవని స్పష్టం చేసింది.


వైకుంఠ ఏకాదశికి తిరుమల ముస్తాబు


వైకుంఠ ఏకాదశి పర్వదినం కోసం ముస్తాబవుతోంది. జనవరి 10 నుండి 19వ తేది వరకు శ్రీనివాసుడిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకునే భాగ్యం లక్షలాది మంది భక్తులకు కలగబోతోంది. దీనికోసం టీటీడీ ఇప్పట్నుంచే విస్తృతంగా ఏర్పాట్లు చేస్తోంది. వైకుంఠ ఏకాదశిని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే టీటీడీ కొన్ని నిర్ణయాలను తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా వైకుంఠ ఏకాదశికి ఒక్క రోజు ముందు అంటే జనవరి 9వ తేదీన స్లాటెడ్ సర్వదర్శనం (ఎస్ఎస్‌డీ) టోకెన్లను విడుదల చేయనున్నారు. 9వ తేదీన తెల్లవారు జామున 5 గంటలకు ఉచిత సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తారు.


డిసెంబర్ 28న డయల్ యువర్ ఈవో


డయల్ యువర్ ఈవో పేరిట టీటీడీ ఈ నెల 28న శనివారం ఉ.9 నుంచి 10గంటల వరకు తిరుమల అన్నమయ్య భవనంలో ఏర్పాటుచేయనుందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు, ప్రజలు తమ సందేహాలను, సూచనలను టీటీడీ ఈవో శ్యామలరావుకు ఫోన్ ద్వారా లేదా నేరుగా ఫిర్యాదు చేయవచ్చనారు. 08772263261 నంబర్ కు డయల్ చేసి తమ ప్రశ్నించలను నివేదించవచ్చని తెలిపారు.            


Also Read : Top Headlines: వైసీపీకి కొత్త వెలుగులు తెచ్చిన క్రిస్మస్ - అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM