Tirumala Tickets News: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్, నేడు ఆర్జిత సేవా టికెట్లు విడుదల - పూర్తి టైమింగ్స్ ఇవే

TTD Srivari Arjitha Seva Tickets | జూన్ నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవల టికెట్ల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం మంగళవారం విడుదల చేయనుంది.

Continues below advertisement

Srivari Arjitha Seva Tickets for June | తిరుమల: శ్రీవారి దర్శనానికి వెళ్లాలనుకునే భక్తులకు టీటీడీ (TTD) అప్‌డేట్ ఇచ్చింది. జూన్‌ నెలకు సంబంధించి తిరుమల (Tirumala) శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం నేడు విడుదల చేయనుంది. సుప్రభాతం, అర్చన, తోమాలతో పాటు అష్టాదళ పాదపద్మారాధన కోటా టికెట్లను మంగళవారం (మార్చి 18న) ఉదయం 10 గంటలకు టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేయనున్నారు. వీటి లక్కీడిప్‌ కోసం మార్చి 20 ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే వీలు కల్పించింది టీటీడీ. భక్తులు అధికారిక వెబ్‌సైట్ (TTD Website) https://ttdevasthanams.ap.gov.in  లో టికెట్లు పొందాలని టీటీడీ అధికారులు సూచించారు. పూర్తి వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి.

Continues below advertisement

మరికొన్ని దర్శన టోకెట్ల విడుదల వివరాలు

మొదటగా మార్చి 21వ తేదీ ఉదయం 10 గంటలకు సుప్రభాతం, అర్చన, తోమాల, అష్టాదళ పాదపద్మారాధన టికెట్లను విడుదల చేస్తారు. మార్చి 22న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం టోకెన్లను, ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు బ్రేక్‌దర్శనం కోటా విడుదల చేస్తారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు దివ్యాంగులు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులకు ఉచిత ప్రత్యేక ప్రవేశ శ్రీవారి దర్శన టోకెన్ల కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది టీటీడీ. మార్చి 24న ఉదయం 10 గంటలకు రూ.300 టికెట్ల కోటా టికెట్లు విడుదల చేయనున్నారు.  

తెలంగాణ ప్రజా ప్రతినిధులకు గుడ్ న్యూస్
తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను పట్టించుకోవడం లేదన్న ఆందోళనలకు టీటీడీ పరష్కారం చూపింది. మార్చి 24వ తేదీ నుంచి తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలను టీటీడీ అనుమతిస్తుంది. వారి సిఫారసుపై తిరుమల శ్రీవారి దర్శన టిక్కెట్లను కేటాయిస్తుంది. ఒక్కో ప్రజాప్రతినిధి రోజుకు ఒక్క లేఖ సిఫార్సు చేయడానికి అవకాశం ఇచ్చారు. ఆ లేఖపై గరిష్టంగా ఆరుగురు భక్తులు స్వామి వారి దర్శనం చేసుకోవచ్చు. ఆదివారం, సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలతో పాటు బుధవారం, గురువారం శ్రీవారి ప్రత్యేక దర్శనాలకు అవకాశం కల్పిస్తారు.

రాష్ట్ర విభజన అనంతరం మొదలైన సిఫార్సు లేఖల సమస్య

ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం 294 మంది ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలు, ఎమ్మెల్సీల సిఫారసు లేఖలు చెల్లుబాటు అయ్యేవి. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు చెందిన ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలు తీసుకోవడం క్రమక్రమంగా మానేశారు. గత నాలుగేళ్లుగా తమకు విలువ ఇవ్వడం లేదని తెలంగాణ ప్రజాప్రతినిధులు వాపోతున్నారు. టీటీడీ బోర్డులో మాత్రం తెలంగాణ వారికి ఖచ్చితంగా ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రస్తుతం ఉన్న టీటీడీ బోర్డులోనూ తెలంగాణ నుంచి ముగ్గురు సభ్యులుగా ఉన్నారు. వారు తమ అధికార పరిధి మేరకు సిఫారసు లేఖలు ఇవ్వగలరు, కానీ తెలంగాణకు చెందిన ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలు చెల్లుబాటు కావడం లేదు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు తెలంగాణ నేతలు తిరుమలలో సిఫారసు లేఖలు అనుమతించాలని కోరుతూ ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. ఈ క్రమంలో మార్చి 24 నుంచి టీటీడీ తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు అనుమతించనుంది.

Continues below advertisement