వయో వృద్ధులు, దివ్యాంగులకు తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanam) శుభవార్త అందించింది. వయో వృద్ధులు, దివ్యాంగులు జులై నెలలో తిరుమల శ్రీవారిని దర్శించుకునేందకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను టీటీడీ బుధవారం మధ్యాహ్నం విడుదల చేసింది. జూన్ 1 నుంచి వయో వృద్ధులు, దివ్యాంగులు శ్రీవారి దర్శించుకునే వేళల్లోనూ టీటీడీ కొన్ని మార్పులు చేసింది. ఈ ప్రత్యేక కోటా భక్తులను ఉదయం 10 గంటలకు బదులుగా మధ్యాహ్నం 3 గంటలకు స్వామివారి దర్శనానికి అనుమతిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. ఆగస్ట్ నెల గదుల కోటాను గురువారం విడుదల చేయనున్నట్లు ఓ ప్రకటనలో టీటీడీ పేర్కొంది.
జూన్ నెలలో దర్శనం వేళల్లో మార్పులు
జూన్ 1 నుంచి ఉదయం 10 గంటలకు బదులుగా మధ్యాహ్నం 3 గంటల స్లాట్‌లో వయో వృధ్ధులను, దివ్యాంగులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. ఆగస్టు నెలకు సంబంధించిన గదుల కోటా మే 26వ తేదీ (గురువారం) ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల కానుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని టీటీడీ కోరింది. ఆగస్టు నెలకు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, జులై నెలకు సంబంధించిన అష్టదళ పాద పద్మారాధన సేవ టికెట్లను మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేశారు.
అధికారిక వెబ్‌సైట్‌లో టికెట్లు..
TTD Arjitha Seva tickets: శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం మంగళవారం విడుదల చేసింది. ఆగస్టు నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్ల కోటాను మే 24న) మంగళవారం ఉదయం 9 గంటలకు టీటీడీ విడుదల చేసింది. శ్రీవారి కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్ల (Tirumala Darshan Tickets)ను టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లో భక్తులకు అందిస్తోంది.
ఆన్‌లైన్ ద్వారా టికెట్లను భక్తులను తీసుకోవాల్సి ఉంటుందని టీటీడీ అధికారులు సూచించారు. కరోనా వ్యాప్తి తరువాత గత రెండు మూడు నెలలుగా తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతోంది. సేవా టికెట్లను ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ పద్ధతుల్లో అందించి భక్తులకు స్వామి వారి దర్శనం జరిగేలా టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. గత నెలలో తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువ కావడంతో, టికెట్లు లేకపోయినా భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతించారు.
ఆగస్టు నెలకు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, జులై నెలకు సంబంధించిన అష్టదళ పాద పద్మారాధన సేవ టికెట్లను మే 26వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు భక్తులు నమోదు చేసుకోవాలి. గురువారం సాయంత్రం 6 గంటలకు ఆన్‌లైన్ డిప్ తీసి సేవా టికెట్లు పొందిన వారికి టీటీడీ సమాచారం అందిస్తుంది. భక్తులు ఆన్‌లైన్‌లోనగదు చెల్లించి సేవా టికెట్లు పొందాలని టీటీటీ సూచించింది.