TTD News: టీటీడీ ఉద్యోగులందరికీ ఇంటి స్థలాలు ఇప్పించే బాధ్యత తాను తీసుకుంటానని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి హామీ ఇచ్చారు. వడమాలపేట వద్ద టీటీడీ ఉద్యోగులకు ఇంటి స్థలాల కోసం మంజూరు చేసిన 310 ఎకరాల భూమిని ఈవో ఏవీ ధర్మారెడ్డి, జేఈవోలు సదా భార్గవి, వీరబ్రహ్మం, ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యోగులతో కలసి మంగళవారం ఆయన పరిశీలించారు.


అనంతరం భూమన మీడియాతో మాట్లాడుతూ సెప్టెంబరు18వ తేదీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఇంటి స్థలాల పంపిణీ ప్రారంభిస్తామన్నారు.  అవసరమైతే మరో 100 ఎకరాలైనా ప్రభుత్వం నుండి సేకరించి అందరికీ ఇంటి స్థలాలు ఇప్పిస్తామన్నారు. ఈ ప్రకటనతో ఉద్యోగులు ఒక్కసారిగా హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి, తాను ఉద్యోగులతో స్నేహపూర్వక సంబంధాలు కోరుకునే వారమని ఆయన చెప్పారు. 


దివంగత ముఖ్యమంత్రి  వైఎస్  రాజశేఖరరెడ్డి హయాంలో తన కృషితో ఉద్యోగులకు ఇంటిస్థలాలు ఇచ్చే ప్రక్రియ ప్రారంభించామన్నారు. ఆ తరువాత  జరిగిన  పరిణామాల  నేపథ్యంలో పదేళ్ళ పాటు ఈ  సమస్యను ఎవరూ పట్టించుకోలేదన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండటం వల్లే  మళ్లీ ఉద్యోగులందరికీ ఇంటిస్థలాలు వస్తున్నాయనే విషయం గుర్తు పెట్టుకోవాలని అన్నారు.


ఈవో ఏవీ ధర్మారెడ్డి మాట్లాడుతూ ఉద్యోగులకు 35x55 అడుగుల ఇంటి స్థలాలు కేటాయిస్తామని తెలిపారు. దాదాపు 7 వేల మంది ఉద్యోగులకు ఇక్కడ ఇంటి స్థలాలు రావడంతో పెద్ద టౌన్ షిప్ తయారవుతుందన్నారు. చెన్నై హైవే పక్కనే ఈ స్థలం ఉండడంతో మంచి ధర పలుకుతోందన్నారు. చైర్మన్ ఆదేశాల మేరకు సెప్టెంబర్ 18 లోపు ఈ స్థలాన్ని ప్లాట్లుగా విభజించి, కచ్చా రోడ్లు వేసి తుడా అనుమతి కూడా తీసుకునే ప్రయత్నం చేస్తామని తెలియజేశారు. ఎమ్మెల్యే  శ్రీభూమన కరుణాకర రెడ్డి పట్టుదల, కృషి తోనే ఉద్యోగులకు ఇంటిస్థలాలు వస్తున్నాయని ఆయన చెప్పారు.


టీటీడీ పరిపాలనా భవనంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవం 
తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలో భారత స్వాతంత్ర్య వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. పరేడ్‌ మైదానంలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేశారు. భద్రతా సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా టీటీడీ భద్రతా సిబ్బంది చేసిన కవాతు ఆకట్టుకుంది. ఏవీఎస్‌వో శైలేంద్రబాబు పెరేడ్‌ కమాండర్‌గా వ్యవహరించారు. 


అనంతరం టీటీడీ ఛైర్మన్ ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ తరువాత విధుల్లో ఉత్తమసేవలు అందించిన వివిధ విభాగాలకు చెందిన 30 మంది అధికారులు, 219 మంది ఉద్యోగులకు, ఎస్వీబీసీలో ఏడుగురు ఉద్యోగులకు శ్రీ‌వారి వెండి డాలర్‌, ప్రశంసాపత్రం అందజేశారు. అదేవిధంగా ఉద్యోగుల పిల్లలకు సంబంధించి ఇంటర్లో ప్రతిభ కనబరిచిన 26 మంది విద్యార్థులకు రూ.2,116 చొప్పున, 10వ తరగతిలో ప్రతిభ కనబరిచిన 32 మంది విద్యార్థులకు రూ.1,116 చొప్పున బహుమతులు అందజేశారు.


టీటీడీ నిఘా మరియు భద్రత విభాగం ఆధ్వర్యంలో  నిర్వహించిన జాగిలాల ప్రదర్శన ఆకర్షణగా నిలిచింది. జాగిలం బొకే అందించడం, ఫైర్ జంప్, హై జంప్ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఎస్వీ ఆర్ట్స్ కళాశాల ఎన్‌సీసీ విద్యార్థుల అశ్వ విన్యాసాలు అలరించాయి. మాపెల్, గుడ్ లక్, అలీవర్, రాణీ ఝాన్సీ పేర్లు గల అశ్వాల రైడింగ్, హైజంప్ ఆకట్టుకున్నాయి.


గంగమ్మ ఆలయ పనుల పరిశీలన
తాతయ్య గుంట గంగమ్మ ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను భూమన కరుణాకర్ రెడ్డి మంగళవారం రాత్రి పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేసి పనుల వేగం పెంచాలని ఆదేశించారు. మేయర్ శిరీష, కమిషనర్ హరిత పాల్గొన్నారు.