Tirumala Record Collection: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వేంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమల పుణ్యక్షేత్రం దర్శించని వారు ఉండరు. ఆపదలో ఉన్న వారికి.. ఆపద మొక్కులవాడై, సకల పాప రక్షకుడై ఇలా వైకుంఠంలో వెలిశారు శ్రీనివాసుడు. కోర్కెలు తీర్చే కోనేటి రాయడు కనుకనే రోజుకు లక్ష మందికి పైగా భక్తులు స్వామి వారి దర్శనార్థం తిరుమలకు చేరుకుంటున్నారు. ఆపద సమయంలో తాము మొక్కుకున్న విధంగా ముడుపులు కట్టి ఆపదలు తొలగిన తర్వాత ముడుపులు భధ్రంగా భక్తి భావంతో స్వామి వారికి సమర్పిస్తారు. ఇలా తమ తమ స్ధోమతకు తగ్గట్టుగా చిల్లర నాణేల నుంచి కోట్ల రూపాయల వరకు శ్రీవారి హుండీలో నగదు సమర్పిస్తారు. అయితే ఏడాదిలో‌ ఒక్కసారి మాత్రమే వచ్చే వైకుంఠ ఏకాదశి నాడు భక్తులు భారీ స్ధాయిలో‌ విరాళాలు శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి సమర్పించారు. 


దీంతో టీటీడీకి రికార్డు స్ధాయిలో హుండీ ఆదాయం లభించింది. కరోనా మహమ్మారి మానవాళిని కబళించిన సమయంలో శ్రీవారి దర్శనాలు 83 రోజుల పాటు టీటీడీ శ్రీవారి దర్శనాన్ని రద్దు చేసింది. అనంతరం శ్రీవారి దర్శనాలు ప్రారంభించిన పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తూ ఉండడంతో అంతంత మాత్రంగానే హుండీ ఆదాయం లభించేది. కరోనా పరిస్థితులు తొలగి మునుపటి రోజులు ప్రారంభం కావడంతో తిరుమలకు భారీ స్థాయిలో భక్తులు చేరుకుంటున్నారు. ప్రతి రోజుకు లక్షకు పైగా భక్తులు వస్తుంటే అదే స్థాయిలో హుండీ ఆదాయం లభిస్తోంది. 


కొవిడ్ తరువాత ప్రతినిత్యం భక్తులు పెద్ద ఎత్తున తిరుమల యాత్రకు వస్తున్నారు. దీంతో ఏడు కొండలు గోవింద నామస్మరణలతో మారుమ్రోగుతున్నాయి. ఈ సారి ఒక్కరోజు హుండీ ఆదాయం భారీగా లభించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా హుండీ ఆదాయం 6 కోట్ల మార్క్ ను దాటుతూ వచ్చింది. అయితే సోమవారం  శ్రీనివాసుడి అత్యంత ప్రీతికరమైన పర్వదినం వైకుంఠ ఏకాదశి కావడంతో దేశంలోని ధనవంతులు, రాజకీయ ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు మొదలుకుని కటిక పేదవారి వరకూ వైకుంఠ ద్వార దర్శనం చేసుకునేందుకు తిరుమలకు క్యూ కట్టారు. అయితే వైకుంఠ ఏకాదశి నాడు శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకుంటే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. 


ఈక్రమంలో వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్న భక్తులు వారి వారి స్ధోమతకు తగ్గట్టుగా వైకుంఠ ఏకాదశి నాడు స్వామి‌ వారిపై భక్తితో హుండీలో విరాళాలు సమర్పించారు. దీంతో వైకుంఠ ఏకాదశి నాడు శ్రీవారి హుండీ ఆదాయం ఘననీయంగా పెరిగింది. కనీవినీ ఎరుగని రీతిలో రికార్డు స్థాయిలో ఒక్కరోజు హుండీ ఆదాయం రావడం విశేషం. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 7.68 కోట్లు శ్రీవారి హుండీ ఆదాయంగా సమర్పించారు భక్తులు. శ్రీవారిని ఆదివారం ఒక్కరోజే 69,414 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇప్పటి వరకు ఉన్న రికార్డుల ప్రకారం 2018 జులై 27వ తేదీ రోజు రూ. 6.28 కోట్ల హుండీ ఆదాయం రాగా, గత ఏడాది అక్టోబర్ 23వ తారీఖులన 6.31 కోట్ల రూపాయలు హుండీ ఆదాయం లభించింది. అయితే వైకుంఠ ఏకాదశి నాడు ఇప్పటికీ వరకూ వచ్చిన‌ హుండీ ఆదాయం రికార్డును దాటింది. అంతకు మునుపు 2012 జనవరి 1వ తేదీ రూ. 4.23 కోట్ల రూపాయలు రికార్డ్ ఉండగా అదే ఏడాది 2012 ఏప్రిల్ 1వ తేదీ రూ. 5.73 కోట్ల హుండీ ఆదాయం లభించింది.