TTD News: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వీకెండ్ కావడంతో భారీ సంఖ్యలో భక్తులు స్వామి దర్శనానికి తరలి వస్తున్నారు. క్యూకాంప్లెక్స్‌లోని కంపార్డుమెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. సర్వదర్శన టోకెన్ లేని భక్తులకు 24 గంటలు పడుతోంది. గురువారం 70,896 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 4.07 కోట్ల రూపాయలు.  37,546 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.


తిరుమల శ్రీవారిని సినీ నటుడు శర్వానంద్ దర్శించుకున్నారు. నూతనంగా వివాహం చేసుకున్న శర్వానంద్ దంపతులు శుక్రవారం వేకువజామున స్వామి వారి అభిషేక‌ సేవలో పాల్గొని‌ మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. మరికొంత మంది ప్రముఖులు కూడా స్వామి వారి సేవలో పాలు పంచుకున్నారు.


శుక్రవారం వేకువజామున స్వామి వారి అభిషేక సేవలో సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, ఏపీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏవి.శేషసాయి, ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవినాధ్ తిలహరిలు కలిసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.


శ్రీవారి సేవలో‌ కేంద్రమంత్రి పీయూష్ గోయల్..


మూడు రోజుల క్రితమే తిరుమల శ్రీవారిని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ సందర్శించారు. శ్రీవారి అనుగ్రహంతో భారతదేశం అన్ని విధాల అభివృద్ధి చెందాలని స్వామి వారిని ప్రార్థించినట్లు తెలిపారు. మంగళవారం ఉదయం స్వామి వారి‌ నైవేద్య విరామ సమయంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్వామి వారి ఆశీస్సులు పొందారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న ఆయనకు టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలుకుగా.. అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేసి శేష వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశానికి మరింత సేవ చేసే భాగ్యం తనకు కల్పించాలని, దేశ ప్రజలకు స్వామి ఆశీస్సులు ఉండాలని ఆయన తెలిపారు. 


బుధవారం  హుండీ ఆదాయం ఎంతంటే?


తిరుమల శ్రీవారిని సన్నిధిలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వేసవి సెలవులు ముగిసినా శ్రీనివాసుడి దర్శనార్ధం భక్తులు క్యూ కడుతున్నారు. ప్రతి శుక్రవారం అభిషేకం నిర్వహించే క్రమంలో గురువారం మధ్యాహ్నం నుండి స్వామి వారికి పూలంగి సేవ నిర్వహించడం ఆనవాయితీగా వస్తొంది. స్వామి వారిపై ఉన్న ఆభరణాలు అన్ని తొలగించి, అరుదైన సుంగంధ పుష్పాలతో స్వామి వారిని అలంకరిస్తారు. దీనినే పూలంగి సేవ అని కూడా పిలుస్తారు. ఎటువంటి ఆభరణాలు లేకుండా పూలతో అలంకరించిన స్వామి వారి భక్తులను మంత్రముగ్ధులను చేస్తారు. బుధవారం రోజు 78,487 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 38,213 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించగా, స్వామి వారి హుండీ ఆదాయం 3.76 కోట్లు రూపాయలు ఆదాయం లభించింది. ఇక వైకుంఠం క్యూ కాంప్లెక్సులోని 31 కంపార్ట్మెంట్లల్లో భక్తులు వేచి ఉన్నారు. దీంతో టైం స్లాట్ టోకెన్లు లేని సర్వదర్శనం భక్తులకు స్వామి వారి దర్శనం కోసం దాదాపుగా 24 గంటల సమయం పడుతుంది. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనంకు 3 గంటల సమయం పడుతుంది.