Bear Roaming at Tirumala Walkway: తిరుమల: తిరుమలలో కొంతకాలం కిందట చిరుత, ఎలుగుబంటి సంచారం కలకలం రేపాయి. తాజాగా మరోసారి తిరుమల మెట్ల మార్గంలో ఎలుగుబంటి సంచరించడంతో టీటీడీ అధికారులు అప్రమత్తం అయ్యారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanams) కీలక సూచనలు చేసింది. అలిపిరి మెట్ల మార్గంలో ఎలుగుబంటి సంచరిస్తోందని తెలిపారు. ట్రాప్ కెమెరాలలో ఎలుగుబంటి సంచారం కనిపించిందని టీటీడీ స్పష్టం చేసింది. భక్తులు మెట్లదారిలో ఒంటరిగా రావద్దని, కొంత మందితో గ్రూపులు గ్రూపులుగా రావాలని టీటీడీ అధికారులు సూచించారు. ఆహార పదార్థాలను సైతం నడకమార్గంలో పడవేయరాదని, వాటి కోసమే జంతువులు వస్తాయని మరోసారి భక్తులను హెచ్చరించారు. మరోవైపు భక్తుల భద్రత కోసం గస్తీని పెంచుతున్నారు. గత కొన్ని నెలల నుంచి ఏడవ మైలు నుంచి నరసింహ స్వామి ఆలయం ప్రాంతంలో జంతువుల సంచారం కనిపిస్తోంది.
లక్షితపై దాడి చేసిన చిరుత గుర్తింపు
తిరుమల అలిపిరి నడక మార్గంలో చిన్నారి లక్షితపై చిరుత దాడి చేసి చంపడం తెలిసిందే. లక్షితపై దాడి చేసిన చిరుతను అధికారులు గుర్తించారు. నడక మార్గంలో బంధించిన నాలుగో చిరుత చిన్నారి లక్షితపై దాడి చేసి చంపిందని అధికారులు గుర్తించారు. మనుషులపై దాడులు చేసిన తరువాత ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి మొత్తం ఆరు చిరుతలను బంధించగా.. వాటి నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షలకు పంపారు. ఇటీవల వాటి పలితాలు వచ్చాయి. నాలుగో చిరుతనే చిన్నారి లక్షితపై దాడిచేసి చంపినట్లు అటవీశాఖ అధికారులు వెల్లడించారు. వాస్తవానికి ఆ బంధించిన చిరుతలను తిరుపతి జూపార్కుకు తరలించి సంరక్షిస్తున్నారు. ఈ చిరుతను సైతం అక్కడే సంరక్షించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది.
నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపాలెంకు చెందిన దినేష్, శశికళ దంపతులు తమ కుటుంబసభ్యులతో 2023లో ఆగస్టు 11న తిరుమలకు వెళ్లారు. రాత్రిపూట నడకమార్గంలో వెళ్తుండగా వీరి కుమార్తె లక్షిత ఒక్కసారిగా కనిపించలేదు. ఏడో మైలు నుంచి నరసింహ స్వామి ఆలయం దగ్గరకి రాగానే లక్షిత కనిపించలేదు. టీటీడీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు, అధికారులు, అటవీ సిబ్బంది, మరికొందరు భక్తులతో కలిసి వెతికినా జాడ దొరకలేదు. మరుసటి రోజు ఉదయం ఆలయానికి సమీపంలో చిన్నారి లక్షిత మృతదేహం లభ్యమైంది. అక్కడ ఆనవాళ్లను పరిశీలించిన అటవీశాఖ అధికారులు చిరుత దాడి వల్లే చిన్నారి లక్షిత చనిపోయిందని చెప్పారు.