Tirupati News: తిరుమల శ్రీవారి దర్శనం కోసం వేల కిలో మీటర్లు ప్రయాణం చేసి క్షణకాలం పాటు స్వామి దర్శనం లభిస్తే చాలు గోవిందుడిని కోటి జన్మల అనుగ్రహం లభించిందని భావిస్తారు. అలాంటి తిరుమల తిరుపతిలో ఉండే స్థానికులు ఎక్కడికి వెళ్ళినా మీరు నెలలో ఎన్నిసార్లు దర్శనం చేసుకుంటారు అని చాలా మంది అంటుంటారు. ఇలాంటి మాటలకు సమాధానం కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంటుంది. ఇకపై ఆ పరిస్థితికి పులుస్టాప్ పెట్టే నిర్ణయం తీసుకుని అమలు చేసింది టీటీడీ.


తిరుమల శ్రీవారి దర్శనభాగ్యం స్థానికులకు చాల సంవత్సరాల నుంచి ఉంది. పూర్వం స్వామి వారి దర్శనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్లే అవకాశం ఉండేది. స్థానికులు అంటే టీటీడీ సైతం అంత ప్రాముఖ్యత కల్పించి దర్శనానికి అనుమతించే వారు. రానురాను భక్తుల సంఖ్య పెరగడంతో నిబంధనలు మార్పు చేస్తూ వచ్చారు. అయినప్పటికీ స్థానికులకు కోటా అమలు చేయడం జరిగేది. నెలలో ఒక్కసారి అయినా స్వామి వారి దర్శనం అమలులో చేసే విధానం తీసుకొచ్చారు.


కోవిడ్ కారణంగా నిలుపుదల
తిరుమల, తిరుపతి స్థానికులకు 2020 వరకు ఈ విధానం అమలు చేసే వారు. ప్రతి నెల రెండో మంగళవారం స్వామి వారి దర్శనభాగ్యం కల్పించారు. అనుకోని విధంగా కొవిడ్ రావడంతో మొత్తం స్తంభించిపోయింది. ఆ సమయంలో ఈ విధానం సైతం నిలుపుదల చేసింది టీటీడీ. ఆ నాటి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కొవిడ్ తరువాత కూడా ఈ విధానం పునరుద్ధరణ చేయలేదు. స్వామి వారి దర్శనం కోసం తిరుపతికి చెందిన నాయకుడు నవీన్ కుమార్ రెడ్డి వినతులు, నిరసనలు చేసిన ఆనాటి పాలకమండలి దాన్ని పట్టించుకోలేదు. ఆ తరువాత స్థానిక ఎమ్మెల్యే, టీటీడీ చైర్మన్‌గా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి సైతం స్థానికులకు దర్శన విషయాన్ని పట్టించుకోలేదు. దీని వల్ల 5 సంవత్సరాల కాలంలో స్థానికులకు స్వామి వారి దర్శనం లేకుండా పోయింది.


స్థానిక ఎమ్మెల్యే చొరవ
ఎన్నికల రావడంతో తిరుపతి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆరణి శ్రీనివాసులు తన వ్యక్తిగత హామీలో ఒక్కటైన తిరుమల శ్రీవారి దర్శనం స్థానికులకు అనేది బలంగా తీసుకెళ్లారు. ఎన్నికల్లో 62వేల మెజారిటీతో గెలుపొందారు. ఆ తర్వాత 5 నెలల కాలంలో అనేకసార్లు ఈ విషయాన్ని టీటీడీ అధికారులు, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌తో పాటు టీటీడీ ఛైర్మన్‌గా నియమితులైన బీఆర్ నాయుడు దృష్టి తీసుకెళ్లారు. దీనిపై అందరూ సానుకూలంగా స్పందించి టీటీడీ బోర్డు తొలి సమావేశంలో ప్రతినెల తొలి మంగళవారం స్థానికులకు స్వామి వారి దర్శనం కల్పించే నిర్ణయం వెల్లడించారు. ఇందులో భాగంగా డిసెంబర్ 3వ తేదీ తొలి మంగళవారం దర్శనభాగ్యం కల్పించనున్నారు.  


సోమవారం అంటే రెండో తేదీ తిరుమల, తిరుపతి, చంద్రగిరి నియోజకవర్గం ప్రజలకు స్వామి వారి దర్శనం చేసుకునేందుకు వీలుగా టోకెన్లు జారీ చేస్తున్నారు. నెలలో 2500 టోకెన్లు అందిస్తారు. ఒక్కసారి దర్శనం చేసుకుంటే 90 రోజుల వరకు తిరిగి దర్శనం ఉండదు. సోమవారం ఉదయం టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సహా టీటీడీ అధికారులు పాల్గొని టోకెన్లు జారీ ప్రారంభించారు. టోకెన్లు పొందిన స్థానికులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.