Tirumala news: కలియుగ ప్రత్యక్ష దైవంగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని కొలుస్తారు భక్తులు. ఇలాంటి తిరుమల శ్రీవారి ఆలయంలో తయారు చేసే లడ్డూ ప్రసాదం పై అనేక ఆరోపణలు, చర్చలు నడిచాయి. దీని కారణంగా శ్రీవారి ఆలయంలో శాంతి హోమం నిర్వహించారు. మిగిలిన టీటీడీ ఆలయాల పరిస్థితి ఏమిటి అనేది ప్రశ్న. తిరుమల శ్రీవారి ఆలయంలో తయారు చేసే లడ్డూతో పాటు వివిధ ప్రసాదాలకు ఆ నెయ్యిని వినియోగించరని అన్నారు. మరీ పవిత్రోత్సవాల కారణంగా అది శుద్ది అయ్యింది. ఇతర ఆలయాల్లో వినియోగించిన వాటికి టీటీడీ ఏమి చేయనుంది. ఈ వివాదం తర్వాత టీటీడీ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది.
తిరుమలకు వచ్చిన నెయ్యిలో ఏం పరీక్షలు చేస్తారు?
కాంట్రాక్టర్లు ద్వారా తిరుమలకు వచ్చే నెయ్యి తొలుత తిరుపతిలోని మార్కెటింగ్ గొడౌన్‌కు వస్తుంది. ఇక్కడ మూడు శాంపిల్స్ తీస్తారు. పలు రకాల పరీక్షలు అంటే నెయ్యిలో తేమ ఎంత ఉంది, మీటర్ రీడింగ్, ఆర్ ఎం విలువ, మినరల్స్, అదనపు రంగు, మిల్క్ ఫ్యాట్ తదితర ప్రాథమిక అంశాలను పరిశీలించి టీటీడీ నిబంధనల మేరకు అన్ని ఉన్నాయా లేదా పరిశీలించి ఆ తర్వాత తిరుమలకు పంపుతారు. తిరుమలలో కూడా వీటిని పరీక్షలు చేసిన తర్వాత నెయ్యిని వినియోగిస్తారు.
కీలక నిర్ణయం తీసుకున్న టీటీడీ
తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే అన్ని అన్నప్రసాదాలలో వినియోగించే సరకులను పరీక్షలు చేయడానికి టీటీడీ చర్యలు తీసుకుంది. ఇప్పుడు జరిగిన తప్పిదాలు తిరిగి పునరావృతం కాకుండా ఉండాలని ల్యాబ్‌ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది.
తిరుమలలో NDDB CALF ల్యాబ్
ప్రస్తుతం అమలు చేస్తున్న NDDB CALF ల్యాబ్‌కు ప్రతి నెయ్యి ట్యాంక్‌లోని నమూనాలను పంపి పరీక్షలు వివరాలు వచ్చిన తరువాత వినియోగించాలని నిర్ణయం తీసుకున్నారు. వారే తిరుమలలో ల్యాబ్ ఏర్పాటుకు ముందుకు రావడంతో రూ.75 లక్షలతో అడల్ట్రేషన్ ల్యాబ్ డిసెంబర్ లేదా జనవరిలోపు పూర్తి చేయనున్నారు.
తిరుమలలో సెంట్రల్ FSSI ల్యాబ్
18 మందితో కూడిన సెన్సరీ ల్యాబ్ ఏర్పాటు చేసి CFTRI మైసూరు వారి నుంచి శిక్షణ పొందుతున్నారు. వీరు నెయ్యిలో రంగు, రుచి, వాసన, స్వచ్చత రేటింగ్ ఇస్తారు. 0 నుంచి 9.5 వరకు రేటింగ్ ఉండగా కనీసం 7 ఉంటేనే దానిని వినియోగిస్తారు. సెంట్రల్ FSSI వాళ్లు సైతం త్వరలో ల్యాబ్ ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చారు. ఇప్పటికే ప్లేస్‌ను చూశారు. త్వరలో అది కూడా అందుబాటులోకి రానుంది.
పరీక్షలు నిరంతరం జరిగే కార్యక్రమం.. అయితే ఈ ల్యాబ్‌లలో పని చేయడానికి పరికరాలు కాని.. సిబ్బంది కాని పూర్తి స్థాయిలో లేకపోవడంతో భక్తులకు.. గోవిందుడికి ఈ పరీక్ష వచ్చింది. అందుకే ఆ సమస్య లేకుండా చర్యలకు ఉపక్రమించింది టీటీడీ. అయితే తిరుమలకు వచ్చే నెయ్యి వేసి తిరుమలలోపాటు తిరుచానూరుకు సైతం అదే నెయ్యిని వినియోగిస్తారు.
తిరుమలలో జులై నెలలో జరిగిన అపచారాన్ని ఆగస్టు నెలలో జరిగిన పవిత్రోత్సవాలతో దోషం తొలగిందని టీటీడీ అధికారులు.. అర్చకులు తెలియజేశారు. అదే నెయ్యిని తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కూడా వినియోగించారు. అక్కడ కూడా ఈనెల 16 నుంచి మూడు రోజుల పాటు 18 వ తేదీ వరకు పవిత్రోత్సవాలు శాస్ర్తోక్తంగా నిర్వహించారు.
శ్రవణ దోషంగా చెప్పే లడ్డూ ప్రసాదం వివాదంలో తిరుమలలో నిర్వహిస్తున్న రీతిన తిరుచానూరులో కూడా శాంతి హోమం నిర్వహిస్తారా లేదా అనేది టీటీడీ అధికారులు స్పష్టం చేయలేదు. భక్తులు అయితే తిరుమల తరహా తిరుచానూరులో కూడా భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా శాంతి హోమం చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read: తిరుమల లడ్డూ వివాదంపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం