TTD Vaikuntha Dwara Darshan tickets: తిరుమల తిరుపతి దేవస్థానం మండలి (టీటీడీ) వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల జారీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది వైకుంఠ ద్వార దర్శనం కోసం టోకెన్లు నవంబర్ 27, 2025 నుంచి ఎలక్ట్రానిక్ డ్రా ఆఫ్ లాట్స్ (ఈ-డిప్) ప్రక్రియ ద్వారా జారీ చేయనున్నారు. ఈ నిర్ణయం భక్తులకు సౌకర్యం కల్పించేందుకు, పారదర్శకంగా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ 30 నుంచి పది రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించాలని నిర్ణయించింది.
వైకుంఠ ద్వార దర్శనం తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి రోజున జరిగే ప్రత్యేక దర్శనం. పది రోజుల పాటు భక్తులు మహా ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకోవచ్చు. నవంబర్ 27, 2025 నుంచి ప్రారంభం. టీటీడీ అధికారులు ఈ-డిప్ (ఎలక్ట్రానిక్ డ్రా ఆఫ్ లాట్స్) వ్యవస్థ ద్వారా టోకెన్లు కేటాయించనున్నారు. భక్తులు టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ttdevasthanams.ap.gov.in లేదా ttseva యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ప్రతి రోజుకు ఒక్కోసారి మాత్రమే దరఖాస్తు చేసుకునే వ్యవస్థ ఉంటుంది. దరఖాస్తు ముగిసిన తర్వాత, లాటరీ ఫలితాలు అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటిస్తారు. విజేతలు SMS మరియు ఈమెయిల్ ద్వారా తమ టోకెన్ సమాచారం పొందుతారు. టికెట్‌లో నిర్దేశించిన తేదీ మరియు సమయం మేరకు దర్శనం లభిస్తుంది.
పది రోజులలో మొత్తం 182 గంటల దర్శన సమయంలో.. సామాన్య భక్తుల కోసం 164 గంటలు కేటాయిస్తున్నారు. మొదటి మూడు రోజుల పాటు అ్ని బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తారు. ప్రోటోకాల్ దర్శనాలు మాత్రమే అనుమితిస్తారు 300 రూపాయల టికెట్ దర్శనాలను రద్దు చేశారు. అలాగే శ్రీవాణి దర్శనాలు రద్దు చేశారు. అలాగే జనవరి 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకూ.. 300 రూపాయల దర్శనం టికెట్లు, శ్రీవాణి టికెట్లను రెగ్యులర్ పద్ధతిలోనే కేటాయిస్తారు. రూ.300 దర్శనం టికెట్లను రోజుకు 15 వేల టికెట్ల చొప్పున, శ్రీవాణి దర్శన టికెట్లను రోజుకు వేయి చొప్పున కేటాయిస్తామని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ప్రకటించారు.
తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారి ఆలయంలో 2026 ఫిబ్రవరి నెల దర్శనం, సేవలు, గదుల కోటా బుకింగ్ ఇవాళ్టి నుంచే ప్రారంభమైంది. టీటీడీ అధికారులు ఈ రోజు (నవంబర్ 18, 2025) ఉదయం 10 గంటలకు మొదటి దశగా అర్జిత సేవల లక్కీ డిప్ రిజిస్ట్రేషన్‌ను ఆన్‌లైన్‌లో తెరిచారు. ఈ నెలాఖరులోపు ఫిబ్రవరి నెల మొత్తం రూ.300 స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్లు, కల్యాణోత్సవం, ఉంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవ, అంగప్రదక్షిణం, సీనియర్ సిటిజన్ దర్శనం, SRIVANI ట్రస్ట్ టికెట్లు, తిరుమల-తిరుపతి గదులు అన్నీ ఆన్‌లైన్‌లోనే బుక్ చేసుకోవచ్చు. ముఖ్యంగా రూ.300 స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్లు నవంబర్ 25 ఉదయం 10 గంటలకు విడుదల కానున్నాయి.
ఒక్కో వ్యక్తి ఒకేసారి గరిష్ఠంగా ఆరు టికెట్లు మాత్రమే బుక్ చేసుకోగలరు. పిల్లలకు (12 ఏళ్ల లోపు) టికెట్ అవసరం లేకపోయినా వారి ఆధార్ కార్డు నంబర్ తప్పనిసరిగా ఎంటర్ చేయాలి. బుక్ చేసిన తర్వాత ఈ-టికెట్‌ను ప్రింట్ తీసుకుని, ఆధార్ కార్డు ఒరిజినల్‌తో కలిపి దర్శనానికి తీసుకురావాలి.