TTD Darshan Tickets Online | తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) 2026 ఫిబ్రవరి నెలకు సంబంధించి వివిధ దర్శనాలు, గదుల కోటాను విడుదల చేయనుంది. నవంబర్ 18వ తేదీ ఉదయం 10 గంటలకు, శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల (సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ) కోటాను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేస్తుంది. ఈ సేవా టికెట్ల కోసం ఎలక్ట్రానిక్ డిప్ కొరకు నవంబర్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. డిప్‌లో టికెట్లు పొందిన వారు నవంబర్ 20వ తేదీ నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించినట్లయితే వారికి టికెట్లు మంజూరవుతాయి.

Continues below advertisement

కళ్యాణోత్సవం సహా మరిన్ని సేవలకు టికెట్లు

నవంబర్ 21వ తేదీన మరికొన్ని ముఖ్యమైన సేవా టికెట్లను విడుదల చేయనున్నారు. ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవం టికెట్లను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేస్తుంది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు, వర్చువల్ సేవలు మరియు వాటి దర్శన స్లాట్‌లకు సంబంధించిన కోటాను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.

Continues below advertisement

24న అంగ ప్రదక్షిణ టోకెన్ల కోటా

ఆ తరువాత, నవంబర్ 24వ తేదీన మూడు రకాల ముఖ్యమైన కోటాలను విడుదల చేస్తారు. ముందుగా, ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణ టోకెన్ల కోటా విడుదల అవుతుంది. ఆపై, ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను విడుదల చేస్తారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు, వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు శ్రీవారిని ఉచితంగా దర్శించుకునేందుకు వీలుగా ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.

ప్రత్యేక ప్రవేశ దర్శన కోటా, గదుల వివరాలు

నవంబర్ 25వ తేదీన మరో రెండు ముఖ్యమైన కోటాలు విడుదల కానున్నాయి. ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేస్తుంది. ఆ తరువాత, మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలలోని గదుల కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లను https://ttdevasthanams.ap.gov.in అనే వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవాలని భక్తులు టీటీడీ కోరింది.